Published : 24 Mar 2018 01:58 IST

ట్రెండీ.. ట్రెండీ.. కూల్‌ కూల్‌

ట్రెండీ.. ట్రెండీ.. కూల్‌ కూల్‌

మండే ఎండలో నడుస్తున్నా... దాని తాలుకు వేడి శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదంటే...?ముంచేసే ఉక్కపోతలోనూ... శరీరం తేలికగా ఉండాలంటే...? నూలు(కాటన్‌) దుస్తులు ధరించాలని... టక్కున సమాధానం వచ్చేస్తుంది.  మరి కాటన్‌ అంటే తెలుపేనా? కాటన్‌ అంటే ప్లెయిన్‌ షర్ట్సేనా?  అయితే మాకొద్దు! కాటన్‌లో ఏదైనా వెరైటీ ఉంటే చెప్పండి అంటోంది యువత...  ఆ నూతనత్వాన్ని చదివేయండి మరి.

కాటన్‌ దుస్తులు అనగానే యువత వద్దంటుంది. దూరం పెడుతుంది. డిజైనర్లు వీరిని సైతం ఆకట్టుకోవడానికి కొత్త ఫ్యాషన్లతో సిద్ధమయ్యారు. ఈ వేసవిని చల్లగా మార్చేయానికి కొత్త మార్గాలు వెతికారు. అలాంటి వాటిల్లో చేనేతది ప్రత్యేక స్థానం. వీటిల్లో ఇకత్‌, కలంకారీలు ఇప్పుడు హాటెస్ట్‌ ట్రెండ్‌. ఇక లినిన్‌ లేతరంగుల షర్ట్‌లు ఈ కాలానికి చక్కని ప్రత్యామ్నాయం. పూలడిజైన్లు అమ్మాయిలకే అన్నది పాతమాట. ఈ వేసవిలో పూల సోయగాలు అబ్బాయిల్నీ మెప్పించేలా డిజైనర్‌ లుక్‌తో సిద్ధం అయిపోయాయి. ఇక నూలు దుస్తుల్లో ప్లెయిన్‌ అనేది ఒక రకమే. అలాని ఎప్పుడూ ఒకేతరహావి ఎందుకు? విభిన్నవర్ణాల మేళవింపుతో చెక్స్‌, లైన్స్‌ వంటివెన్నో ఎంచుకోవచ్చు. ఇక సీగ్రీన్‌, స్లీబ్లూ, ఐస్‌బ్లూ, క్రీమ్‌ వైట్‌, మిల్క్‌వైట్‌ వంటి రంగులు (లేలేతఛాయల్లో(పేస్టల్‌కలర్స్‌-షేడ్స్‌) ఈ షర్ట్‌లను ఎంచుకోవచ్చు అని సూచిస్తున్నారు డిజైనర్‌ రవి అవ్వారు.

ఇక డిజైన్‌ల సంగతికొస్తే ఈ కాలంలో కాస్త వదులుగా ఉండే  దుస్తుల్ని ఎంచుకోవడమే మంచిది. ఎప్పుడూ షర్టులేనా అనుకొనే వారు... కొంచెం కొత్తగా కుర్తాలు ప్రయత్నించవచ్చు. వీటిల్లో షార్ట్‌, లాంగ్‌, క్రాస్‌ఫిట్‌, సంప్రదాయ, డిజైనర్‌ రకాల్ని సందర్భాన్ని బట్టి వేసుకోవచ్చు. వీటిల్లోనూ కాలర్‌ ఉన్నవీ, లేనివాటితో పాటు చైనీస్‌ కాలర్‌ వంటి డిజైన్ల ఇలా మన శరీర ఆకృతిని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.

5 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలకైతే ముదురు రంగులు ఎంపిక చేసుకోవాలి. 11 -15 ఏళ్ల మధ్య వయస్సు టీనేజర్లకు చిన్న లైన్లు(గీతలు), చెక్స్‌(గళ్లు) తీసుకోవచ్చు. 15-20 ఏళ్ల యువతకు కుర్తాలు కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. 20-30ల వయసు వారికి షార్ట్‌ కుర్తాలు, యాపిల్‌కట్‌తరహా ఫినిషింగ్‌ షర్ట్స్‌ బాగుంటాయి. కార్యాలయాలు, కళాశాలలకు వెళ్లే వారికీ ఇవి చక్కగా నప్పుతాయి. నలభైల్లో ఉన్నవారికి ఖాదీ హుందాతనాన్ని తెచ్చిపెడుతుంది.
మరి ప్యాంట్లు ఎలా? అంటారా మీ కోసమే కొత్తగా క్యాజువల్‌ లూజ్‌ ఫిట్‌ కాటన్‌ ప్యాంట్లు వచ్చాయి. వీటిని చిన్నబెల్టుతో మీకు నప్పేట్లు ఎంచుకోవచ్చు. వీటిపైనా ఇకత్‌, కలంకారీ వంటి చేనేత అందాలు చమక్కుమంటున్నాయి.  వీటిని బయటికి వేసుకెళ్లడం ఇబ్బంది అనుకొనే వారు కాటన్‌ జీన్స్‌, స్లిమ్‌ఫిట్‌ కాటన్‌ ప్యాంట్లు ధరించవచ్చు. డ్రైవింగ్‌ చేసే వారు స్లిమ్‌ఫిట్‌ కాటన్‌, ఖాదీ ప్యాంట్లు సౌకర్యంగా ఉంటాయి.

మ్మాయిలకూ కాటన్‌ సల్వార్‌లూ, ట్యూనిక్‌లూ, కుర్తీలు, టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటికి జతగా లినిన్‌ కాటన్‌ లెగ్గింగ్స్‌ ఈ వేసవిలో సౌకర్యంగా ఉంటాయి. కుర్తీలకు కళంకారీ డిజైన్లు మరింత వన్నెతెస్తున్నాయి. దుపట్టాలూ, స్కార్ఫ్‌లు కూడా ఈ వన్నెలద్దుకుంటున్నాయి. క్రాప్‌టాప్‌ తరహాలో పోచంపల్లి, కలంకారీ బ్లవుజులు చీరలమీదకూ, లెహెంగాల మీదకూ కూడా నపేస్తున్నాయి. ఇంకాస్త ట్రెండీగా కనిపించాలి అనుకునేవారు పలాజోలాపైనా వేసుకుంటున్నారు. మంగళగిరి కాటన్‌, కొటాలవేవ్‌, కాంజీవరం, బెనారస్‌ రకాలు ప్రస్తుతం ఆదరణ పొందుతున్నాయని డిజైనర్‌ లావణ్య చెబుతున్నారు. పార్టీలు, ఫంక్షన్లకు కంచి చేనేత రకాలు కొత్తదనాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఎండాకాలం తక్కువ బరువుతో లినిన్‌, ఖాదీ చీరలు మగువలను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. సంబల్‌పూరి కాటన్‌   పోచంపల్లిలానే ఉంటుందని, వీటిలో వాడే రంగులు పూర్తిగా సహజసిద్ధమైiనవని ఇవి చల్లదనాన్ని ఇస్తాయంటున్నారు డిజైనర్‌ లావణ్య.

నప్పేవే మెప్పిస్తాయి

మార్కెట్లో ఎన్నో కాటన్‌ ఫ్యాషన్లు అందుబాటులో ఉన్నాయి. శరీరానికి నప్పేవి తీసుకుంటేనే ట్రెండీగా ఉంటుంది. ఇందుకు డిజైనర్‌ సలహాలు చాలా ముఖ్యం. మీకు అందుబాటులో ఉండే డిజైనర్‌ను సంప్రదించి మీ శరీరా ఆకృతి, రంగును బట్టి దుస్తులు రెడీ చేయించుకుంటే మంచిది. ఎండాకాలం వదులుగా ఉండే దుస్తులు సౌకర్యంగా ఉంటాయి. మరి ఫ్యాషన్‌కు ఇబ్బంది కదా అనుకొనే వారు... మంచి డిజైనర్ల వద్దకు వెళ్లి వారికి తగ్గట్లు డిజైన్‌ చేయించుకోవచ్చు.

- రవి అవ్వారు(గాంధీ), అవ్వారు డిజైన్స్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు