బట్టతలకి బైబై

25ఏళ్లకే బట్టతల ఆచూకి అద్దంలో తెలిస్తే... యువకుడు ఎంత కుంగిపోతాడు. తలను ఎన్నిసార్లు చూసుకొని మనసులో ఏడుస్తాడు. ఎక్కడికెళ్లైనా సరే... ఏమి చేసిఅయినా.. ఎంత ఖర్చైనా సరే బట్టతలపై జుట్టు మొలిపించుకోవాలని బలంగా కోరుకుంటాడు...

Published : 14 Apr 2018 01:57 IST

వెంట్రు‘కల నెరవేరుతుంది’
బట్టతలకి బైబై

25ఏళ్లకే బట్టతల ఆచూకి అద్దంలో తెలిస్తే... యువకుడు ఎంత కుంగిపోతాడు. తలను ఎన్నిసార్లు చూసుకొని మనసులో ఏడుస్తాడు. ఎక్కడికెళ్లైనా సరే... ఏమి చేసిఅయినా.. ఎంత ఖర్చైనా సరే బట్టతలపై జుట్టు మొలిపించుకోవాలని బలంగా కోరుకుంటాడు. ఇప్పటివరకూ ఎంత చేసినా ప్రయోజనం అంత ఉండేది కాదు... ఇప్పుడు అంత పరేషాన్‌ అక్కర్లేదంటున్నారు జపాన్‌ శాస్త్రవేత్తలు. వెంట్రుకల కుదుళ్లను శరవేగంగా పెంచగల కొత్త పద్ధతిని సృష్టించారు. మనకు పైకి కనబడే వెంట్రుక- చర్మం లోపలుండే కుదురు నుంచి పుట్టుకొస్తుంది. ఈ కుదురు లేకపోతే వెంట్రుక మనుగడ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో యోకోహామా నేషనల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెంట్రుకలకు మూలమైన కుదుళ్లను శరవేగంగా సృష్టించటంపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. సిలికాన్‌ పెట్టెల్లో రెండు రకాల కణాలను పెట్టి.. వాటి నుంచి విజయవంతంగా వెంట్రుకల కుదుళ్ల ‘మూల కణాల’ను పుట్టించారు. ఈ పద్ధతితో కొద్దిరోజుల్లోనే 5వేల కుదుళ్ల కణాలను సృష్టించటం విశేషం. వెంట్రుకల మార్పిడి పద్ధతిలో ఇప్పుడు తల వెనకభాగంలో ఉండే వెంట్రుకలను తీసి ముందుభాగంలో ‘నాట్లు’ వేస్తున్నారు. ఇందులో వెంట్రుకల సంఖ్య పెరగటమనేది ఉండదు. మందులు వెంట్రుకలు రాలటాన్ని ఆపగలవేమో గానీ తిరిగి జుట్టు మొలవటం అసాధ్యం. ఇలాంటి ఇబ్బందులను తమ కొత్త పద్ధతి తీర్చగలదని జపాన్‌ పరిశోధకులు చెబుతున్నారు. మరో పదేళ్లలో ఇది అందుబాటులోకి రాగలదని వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని