స్టూడెంట్‌... కేరాఫ్‌ స్టుమ్యాగ్జ్

కాలేజీలు అద్భుతానికి వేదికలు.. అక్కడే గుర్తింపు దక్కని ఆలోచనలు ఎన్నో ఉంటాయి... అవో అద్భుతాలని ముందే ప్రపంచానికి చాటాలి! అందుకు కాలేజీలు డిజిటల్‌ క్యాంపస్‌లుగా మారాలి. డిజిటల్‌ ఇండియాలో భాగం కావాలి. ఇదే లక్ష్యంగా నేను, నా అంకుర సంస్థ పని చేస్తోంది!

Published : 18 Nov 2017 02:11 IST

‌అంకురార్పణ
స్టూడెంట్‌... కేరాఫ్‌ స్టుమ్యాగ్జ్

కాలేజీలు అద్భుతానికి వేదికలు.. అక్కడే గుర్తింపు దక్కని ఆలోచనలు ఎన్నో ఉంటాయి... అవో అద్భుతాలని ముందే ప్రపంచానికి చాటాలి! అందుకు కాలేజీలు డిజిటల్‌ క్యాంపస్‌లుగా మారాలి. డిజిటల్‌ ఇండియాలో భాగం కావాలి.
ఇదే లక్ష్యంగా నేను, నా అంకుర సంస్థ పని చేస్తోంది!

విద్యార్ధులే నా పెట్టుబడి... వారి ఆలోచనల్లోనే నా వ్యాపారం అంటున్నారు ‘స్టుమ్యాగ్జ్‌’ వ్యవస్థాపకుడు శ్రీ చరణ్‌ లక్కరాజు. ‘బెస్ట్‌ స్టార్ట్‌అప్‌ ఫర్‌ బ్రాండింగ్‌ అండ్‌ డిజైన్‌’ విభాగంలో హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజ్‌ అసోసియేషన్‌) నుంచి అవార్డు అందుకున్న చరణ్‌ విజయానికి అడ్రస్‌గా మారాలంటే... ప్రయాణానికి పక్కా ప్రణాళిక అవసరం అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘షార్క్‌ట్యాంక్‌’ సదస్సుకి భారత్‌ నుంచి ఆహ్వానం పొందిన 7 స్టార్ట్‌అప్‌ల్లో స్టూమ్యాగ్జ్‌ ఒకటి. గత నెల్లోనే  సదస్సులో పాల్గొని స్టూమ్యాగ్జ్‌ స్టార్ట్‌అప్‌ సంగుతుల్ని పంచుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో చరణ్‌ ఈ-తరంతో పంచుకున్న సంగతులు కొన్ని...

ఆలోచన... విస్తరణ
విద్యార్థులు, కాలేజీలు, కార్పొరేటు కంపెనీలు... ఈ మూడింటిని ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా పుట్టిందే స్టుమ్యాగ్జ్‌ (స్టూడెంట్‌ మ్యాగజీన్‌) అంకుర సంస్థ. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలను ఒకే ఫ్లాట్‌ఫామ్‌ పైకి తీసుకొచ్చి, విద్యార్థుల నైపుణ్యాల్ని వెలికి తీసేలా ముందుకొచ్చిన మొట్టమొదటి వేదిక ఇదే. విద్యార్థులు వారిలో దాగున్న నైపుణ్యాల్ని చదువుతున్న క్యాంపస్‌ వరకూ కాకుండా మొత్తం దేశానికి తెలిసేలా చేయవచ్చు. పలు అంశాలపై వ్యాసాలు రాయొచ్చు. వీడియోలు పోస్ట్‌ చేయవచ్చు. దీంతో విద్యార్థుల్లో దాగున్న న్యూనతా భావాలు తొలగిపోతాయి. వారి క్రియేటివ్‌ స్కిల్స్‌ని ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంకా చెప్పాలంటే... క్యాంపస్‌ల్లో ఈవెంట్స్‌ని అందరికీ సులభంగా తెలిసేలా చేయవచ్చు. యువతని లక్ష్యంగా చేసుకుని ముందుకొచ్చే ఏ కంపెనీ అయినా స్టుమ్యాగ్జ్‌ని చూడాల్సిందే. ఉదాహరణకు విద్యార్థులు చదువుకునే దశలో చేసే ఇంటర్న్‌షిప్‌లకు ఆయా కంపెనీ వెబ్‌సైట్‌ల్లో వెతుకులాడాల్సిన పని లేదు. స్టూమ్యాగ్జ్‌ పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని స్కిల్డ్‌ విద్యార్థుల ప్రొఫైల్స్‌ని వారికి షేర్‌ చేస్తూ కంపెనీలకు విద్యార్థులకు మధ్య వారధిగా పని చేస్తుంది. ఇంకా చెప్పాలంటే... కాలేజీల అవసరం మేరకు పలు రంగాల్లోని ప్రముఖులతో కాలేజీల్లో అతిథి ఉపన్యాసాలు ఇప్పిస్తున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే కాలేజీలకు స్టుమ్యాగ్జ్‌ ఓ పీఆర్‌లా పని చేస్తుందన్నమాట. విద్యార్థులు పోస్ట్‌ చేసిన వాటిపై మా బృందం మానిటర్‌ చేస్తుంది. కంటెంట్‌ని బృందం క్షుణ్ణంగా పరిశీలించాకే స్టుమ్యాగ్జ్‌లో పోస్ట్‌ అయ్యేలా చేస్తారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులు ఫ్లాట్‌ఫామ్‌లో సభ్యులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో 303 కాలేజీలు స్టూమ్యాగ్జ్‌ని వాడుతున్నాయి. ఆండ్రాయిడ్‌ యూజర్లు ఆప్‌ రూపంలో ఇన్‌స్టాల్‌ చేసుకుని సర్వీసుని యాక్సెస్‌ చేయవచ్చు. ఇక్కడే కాకుండా దేశ వ్యాప్తంగా మరో పది నగరాల్లో స్టూమ్యాగ్జ్‌ని పరిచయం చేస్తున్నాం. విదేశాల్లోని విద్యా సంస్థల్లోకి విస్తరించాలనుకుంటున్నాం. అక్కడికి వెళ్లి చదవాలనుకునేవారికి అక్కడి విద్యార్థులే గైడ్‌ చేసే అవకాశం దొరుకుతుంది. దీంతో ఎక్కడా మోసాలకు తావు ఉండదు. విద్యార్థుల పేరు గుర్తొస్తే స్టుమ్యాగ్జ్‌ గుర్తురావాలన్నదే నా లక్ష్యం. ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ కాలేజెస్‌’గా ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్‌ అవ్వాలనుకుంటున్నాం.

అంకుర అభ్యాసం...  

స్టార్టప్‌ని ప్రారంభించడం కష్టమేం కాదు. విస్తరణ, వ్యాపారంలోనే తెలియని కోణాలు వెలుగులోకి వస్తాయి. అందుకే ‘అంకురా’భ్యాసం ఎంతైనా అవసరం...
* ఎక్కడైనా ‘నో’ వినడానికి సిద్ధంగా ఉండాలి. ‘యస్‌’ చెప్పించడానికి తగిన నైపుణ్యాల్ని కూడగట్టాలి.
* ఆలోచన రాగానే మార్కెట్‌లోకి వెళ్దాం అనుకోవద్దు.
* మనుగడలో ఉన్న స్టార్ట్‌అప్‌ల్లో కొంతకాలం పని చేయండి.
* మొదట్లోనే మితిమీరిన ఖర్చుతో ప్రచారం అక్కర్లేదు.
* అందుబాటులో ఉన్న అన్ని ఉచిత వేదికల్లోనూ ప్రచారం చేయండి.
* వినియోగదారుల్ని చేరుకునేందుకు ఉన్న అన్ని మార్గాల్ని నిరంతరం అన్వేషించాలి.
* సందర్శించాలనుకుంటే www.stumagz.com వెబ్‌సైట్‌ని చూడొచ్చు.

దేశ వ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులు ఫ్లాట్‌ఫామ్‌లో సభ్యులయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో 303 కాలేజీలు స్టుమ్యాగ్జ్‌ని వాడుతున్నాయి.
నామవాచకం కాస్త క్రియలా మారాలి. గూగుల్‌ ఒకప్పుడు నామవాచకమే. కానీ, ఇప్పుడు అదో క్రియలా మారింది. ‘గూగుల్‌ఇట్‌’ అంటున్నాం!  అలాగే, ఫేస్‌బుక్‌కి ఆదాయం 9 ఏళ్లకి వచ్చింది. మొదటి ఎనిమిదేళ్లూ ఎలాంటి సంపాదన లేదన్న విషయాన్ని గుర్తించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని