ఫోకసిగా ముందుకు

అంత ఫోకస్‌ అక్కర్లేదు. ఒక్కసారి హైదరాబాద్‌, బాగ్‌అంబర్‌పేటలోని ఐ-ఫోకస్‌లోకి అడుగుపెడితే చాలు. బాహుబలి సైన్యంలా చుట్టుముడతారు. వూరుపేరు జాన్తానై! ఎందుకొచ్చారు? పనేమిటి? ఎవర్ని కలవాలి? ఇంటర్వ్యూలేమీ ఉండవు. ఆత్మీయతతో ఆలింగనం చేసుకుంటారంతే! పిల్ల కాలువలు, నడివయసు వాగులు, ఆరితేరిన నదులు.. తారతమ్యం ఉండదు. ఆ మహాసముద్రంలో కలిపేసుకున్నంత పనిచేస్తారు! అవును.. వాళ్లది మహా మైత్రీం భజత! బంధుత్వాలు చెడొచ్చు కానీ.. ఈ సామాజిక బంధుత్వం ఒక్కసారి ఏర్పడితే.. జీవితాంతం తెగిపోయేది కాదు......

Published : 02 Dec 2017 02:21 IST

ఫోకసిగా ముందుకు  

నీకెంత మంది దోస్తులు..
యాభై.. వంద.. ఫేస్‌బుక్‌లో అయితే ఓ వెయ్యి వేసుకో..
ఎవరికైనా పాతికవేల మంది జిగిరీదోస్తులు ఉంటారా?
పనిగట్టుకుని స్నేహం చేసినా అసాధ్యం..

అంత ఫోకస్‌ అక్కర్లేదు. ఒక్కసారి హైదరాబాద్‌, బాగ్‌అంబర్‌పేటలోని ఐ-ఫోకస్‌లోకి అడుగుపెడితే చాలు. బాహుబలి సైన్యంలా చుట్టుముడతారు. వూరుపేరు జాన్తానై! ఎందుకొచ్చారు? పనేమిటి? ఎవర్ని కలవాలి? ఇంటర్వ్యూలేమీ ఉండవు. ఆత్మీయతతో ఆలింగనం చేసుకుంటారంతే! పిల్ల కాలువలు, నడివయసు వాగులు, ఆరితేరిన నదులు.. తారతమ్యం ఉండదు. ఆ మహాసముద్రంలో కలిపేసుకున్నంత పనిచేస్తారు! అవును.. వాళ్లది మహా మైత్రీం భజత! బంధుత్వాలు చెడొచ్చు కానీ.. ఈ సామాజిక బంధుత్వం ఒక్కసారి ఏర్పడితే.. జీవితాంతం తెగిపోయేది కాదు. ఇది ఇప్పటికిప్పుడు సాధ్యమైంది కాదు. పన్నెండేళ్ల సహృదయాల అల్లిక. పదుగురు మంచి మనుషుల కలయిక. ఈ భావనను ఏ పాశ్చత్య వ్యక్తిత్వనిపుణుల ఆలోచనల నుంచో స్వీకరించలేదు. మన ఉమ్మడి కుటుంబ పరమార్థమే వీళ్ల రాజ్యాంగం. సమర్థత, సమగ్రత, భారతీయత.. అధికరణలు. ఈ మూడింటినీ యువతలో నూరిపోసేందుకు ఐఫోకస్‌ పనిచేస్తోంది. ‘నడి సముద్రంలో ఒక చిన్న పడవలో ఒంటరిగా ప్రయాణిస్తున్నాం అనుకోండి. దానికి చిల్లు పడితే మునిగిపోతాం. అదే వంద పడవల మధ్య వెళుతున్నప్పుడు చిల్లుపడితే.. వంద చేతులు కాపాడతాయి. మా లక్ష్యం కూడా అదే! యువత ఎంత కలిసికట్టుగా ఉంటే అంత బలం’ అంటున్నారు సంస్థ నిర్వాహకులు. ఐఫోకస్‌ పుష్కరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో రేపు ఆదివారం వేడుక నిర్వహించనుంది.

అంతర్జాలం ప్రపంచాన్ని కుగ్రామం చేసింది. సమస్త సమాచారాన్నీ చిటికెలో తెలుసుకోవచ్చు. ఏ కొత్త విషయం నేర్చుకోవాలన్నా శిక్షణ సంస్థలు బోలెడు. కానీ, మర మనిషిని మన మనిషిగా తీర్చిదిద్దే సంస్థలేవీ? దుర్భిణివేసి గాలించినా దొరకవు. అందులోనూ యువతకు దిశానిర్దేశం చేసి.. సన్మార్గంలో నడపించడం అంత సులభం కాదు. చదువుల దగ్గర నుంచి వ్యక్తిత్వం వరకు రోజుకో సమస్య. కంటికి కనిపించినదల్లా ఆకర్షణే! ప్రలోభాలు, ప్రతికూల ప్రభావాలు.. ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. తమ శక్తిసామర్థ్యాలను అంచనా వేసుకోలేరు. ఒక లక్ష్యం ఉండదు. చిన్న నిర్ణయం తీసుకోవడానికే గందరగోళపడతారు. ఏం చేయాలో దిక్కుతోచదు. ‘‘ఇక్కడికి వస్తే అవన్నీ పటాంపంచలు అవుతాయి. ఐఫోకస్‌ సభ్యుల భరోసా దొరుకుతుంది. అనుభవజ్ఞుల సలహాలు అండగా నిలుµస్తాయి. జీవితం పట్ల స్పష్టత ఏర్పడుతుంది’’ అంటున్నారు సంస్థ ప్రతినిధులు. ‘నేను’తో అడుగుపెట్టిన వాళ్లు ‘మనం’తో కదం తొక్కుతున్నారు. ‘క¹ళ్లు మూస్తే దేవుణ్ణి చూడాలి. కళ్లు తెరిస్తే దేశాన్ని చూడాలి’ అంటూ ఐఫోకస్‌ ఆలోచనకు అంకురార్పణ చేసిన సద్గురు శివానందమూర్తి ప్రేరణే ఈ సంస్థ అంతర్వాహిణి.
* ఐ ఫోకస్‌ కుటుంబంలో చేరేందుకు ఎలాంటి నిబంధనలు అవసరం లేదు. ఎవరైనా చేరవచ్చు. వయసు అడ్డంకి రాదు. కుల, మత, ప్రాంత ప్రస్తావనే ఉండదు.
* ఇందులో నాలుగు రకాల సభ్యులు ఉంటారు. బాలవికాస్‌, టీన్‌వికాస్‌, యువవికాస్‌, మనోవికాస్‌. బ్రిగేడియర్‌ స్థాయికి కూడా వెళ్లొచ్చు.
* ఇక్కడ చదువులు, లక్ష్యాలు, కెరీర్‌పాఠాలు, స్టార్టప్‌ కిటుకులు వంటివే కాదు. జీవనపాఠాలు, అనుభవజ్ఞుల సాంగత్యం, సందేహాల నివృత్తి, చక్కటి వ్యక్తిత్వ నిర్మాణానికి అవకాశం లభిస్తుంది.
* ఎలాంటి ఫీజులు ఉండవు. ఉదయం, సాయంత్రం తరగతులు నిర్వహిస్తారు. అదీ సరదా సంభాషణల్లాగే నడుస్తుంటాయి. బృందంలో కలిసిపోయే తత్వం అలవర్చుకోవడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం చాలా సులభం.
* భవనంలోకి అడుగుపెట్టిన తరువాత నేర్చుకునే తొలిపాఠం.. మనసారా నవ్వుకోవడం. కొత్తగా వచ్చిన వాళ్లలో రెండు మూడు రోజుల్లోనే బిడియం పారిపోతుంది. సభ్యుల్లో సులువుగా ఇమిడిపోతారు.
*వీళ్లది జగమంత కుటుంబం. పెద్దవాళ్లయితే అన్నయ్యలు, అక్కయ్యలు.. చిన్నవాళ్లయితే అన్నా తమ్ముడు అనే పిలుచుకుంటారు. కుటుంబంలోని ఆత్మీయ వాతావరణం ఇక్కడ శోభిల్లుతుంది.

నేను శాప్‌ నేర్చుకున్నా. ఉద్యోగం రాలేదు. బ్యాంకు పరీక్షలు రాశాను. అక్కడా నిరాశే! కుంగుబాటులో ఉన్నప్పుడు ఐఫోకస్‌లో చేరాను. ఒకప్పుడు కంప్యూటర్లు మరమ్మతు చేసేవాడ్ని. ఆ సంగతే మరిచిపోయా. ఇందులోనే ప్రయత్నం చేయమన్నారు. సంస్థ పరిధిలోని సొసైటీ కింద.. అక్షయ ఆటోమేషన్‌ అనే స్టార్టప్‌ నెలకొల్పాను. ఇప్పుడు నా భవిష్యత్తుకు స్పష్టమైన మార్గం కనిపిస్తోంది.
- ఎంఆర్‌కె రెడ్డి, బోధన్‌
నాకు ఒక దురలవాటని చెప్పలేను. బీటెక్‌ పూర్తి చేశాక ఏ దారిలో వెళ్లానో తెలీదు. ఏదో కోల్పోతున్నానన్న బాధ మెలిపెట్టేది. ఎలా మారాలో తెలిసేది కాదు. స్నేహితులు ఐఫోకస్‌ గురించి మాట్లాడుకునేవాళ్లు. ఇదేదో బాగుందే అనుకుంటూ ఒక రోజు వెళ్లాను. యువతీయువకులు సమూహాలుగా ఏర్పడి స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారంతే! ఎవరిలోపాలను వాళ్లు బహిరంగంగా చెప్పుకుంటూ.. సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఇదేకదా కావాల్సింది అనిపించింది. కొద్ది రోజుల్లోనే అనూహ్యమార్పు వచ్చింది.
- చాణక్య, భద్రాచలం
నేను ఎంబీఏ పూర్తి చేశాను. కరాటేలో బ్లాక్‌బెల్ట్‌. ఇక్కడికి వచ్చాక.. సభ్యులకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను. నేటి యువతరం, విద్యార్థులను పౌష్టికాహారలోపం వేధిస్తోంది. దాన్ని సరిచేసేందుకు సంస్థ సొసైటీ పరిధిలోనే నిగ్రహ అనే స్టార్టప్‌ మొదలుపెట్టాను. వందల పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు సేకరించాం. పిల్లల్లో ఆరోగ్యచైతన్యం తీసుకొస్తున్నాం. తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తున్నాం. సామాజిక స్పృహ నాకొక దీర్ఘకాలిక లక్ష్యం ఏర్పరిచింది.
- శ్వేత, హైదరాబాద్‌
ఇంత వినయంతో ఉత్సాహంతో వైవిధ్యమున్న స్నేహితులను ఇక్కడే చూస్తున్నా. వీళ్ల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. నేను ఇక్కడికి నటుడిగానో, హీరోగానో రాలేదు. ఒక సాధారణ సభ్యుడిలా వచ్చాను.
- అల్లు అర్జున్‌, నటుడు
‘ఇక్కడ అడుగుపెట్టగానే నేను చూసింది ఐఫోకస్‌లో ఆంగ్లఅక్షరం ‘ఐ’. దాన్ని తిరగేసి చూస్తే ప్రశ్న అవుతుంది. ఇక్కడ ఎవరికీ ప్రశ్న అంటే భయం లేదని నాకు అర్థమైంది. ప్రతి ప్రశ్నకు వాళ్ల దగ్గర స్పష్టమైన సమాధానం ఉంది. అది నాకు బాగా నచ్చింది..’’
- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, దర్శకుడు
(ఐఫోకస్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు..)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని