చిత్తూరోడికి కాలేజీలో అదే పని

‘లవర్స్‌’ సినిమాలో ‘‘మగజాతి ఆణిముత్యాన్ని’ అంటూ... కనిపించిన అమ్మాయిలు అందరినీ బాదే సప్తగిరి... కాలేజీ రోజుల్లో ఎంతోమంది అమ్మాయిల వెనుక తిరిగాడు. ‘‘అక్కా.. పిలుస్తూనే వచ్చేయాలా?’’

Published : 09 Dec 2017 02:10 IST

చిత్తూరోడికి కాలేజీలో అదే పని

‘లవర్స్‌’ సినిమాలో ‘‘మగజాతి ఆణిముత్యాన్ని’ అంటూ... కనిపించిన అమ్మాయిలు అందరినీ బాదే సప్తగిరి... కాలేజీ రోజుల్లో ఎంతోమంది అమ్మాయిల వెనుక తిరిగాడు. ‘‘అక్కా.. పిలుస్తూనే వచ్చేయాలా?’’ అని వణికిపోయే సప్తగిరి.. ‘ధైర్యానికి నేను సెల్ఫీని’ అంటున్నాడు. సప్తగిరి ఎల్‌ఎల్‌బీ అంటూ మనముందుకొచ్చిన చిత్తూరోడు... సప్తగిరి అవతార్‌, సప్తగిరి జేమ్స్‌బాండ్‌ చిత్రాలు  వస్తే ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను ‘ఈతరం’తో సరదాగా పంచుకున్నాడు.

* అక్కా... మాపై అంత అభిమానమేంటక్కా... పిలుస్తూనే వచ్చేయాలా? అని నిజ జీవితంలో ఎవరినైనా అనుకున్నారా?
అలా భయపెట్టే అక్కలు తగల్లేదు...ప్రేమ కథా చిత్రమ్‌ తర్వాత ఎవరిని అక్కా అని పిలిచినా తమ సొంత తమ్ముడిలా ఆప్యాయంగా చూస్తున్నారు.

* పెళ్లంటే వద్దంటున్నావ్‌ ? అంతగా భయపడిపోయావా?
సప్తగిరికి భయమంటి? ధైర్యానికి నేను సెల్ఫీని(నవ్వుతూ).... అబ్బే అదేం లేదన్నా... కెరీర్‌ ముఖ్యం కదా! నా దృష్టి ఇప్పుడు దానిమీదే.

* వెంకటప్రభు ప్రసాద్‌(అసలుపేరు)కు గానీ... సప్తగిరికి గానీ ప్రేమ కథలేమైనా ఉన్నాయా?
సప్తగిరికి లేవన్నా... వెంకటప్రభు ప్రసాద్‌కు ప్రేమ కథ కాదు... కథల సంపుటే ఉంది. కాలేజీలో ఉన్నప్పుడు అదే పని. మా ఇంట్లో అద్దం ఉండేది... నేను అందులో అందంగా కన్పించే వాణ్ని. ఇంకేముంది నచ్చిన అమ్మాయినల్లా వెంటపడేవాణ్ని. ఏదో మన ప్రయత్నం తప్ప... ఆ పక్క నుంచి కదలికే ఉండేది కాదు(నవ్వు).

* సినిమా ఫ్రెండ్స్‌ వచ్చారని... ఊర్లో స్నేహితుల్ని వదిలేయలేదు కదా!
అలా ఎందుకు అన్పిస్తుందన్నా... 10 తరగతి లోపు ఫ్రెండ్స్‌ జీవితాంతం ఉంటారన్నా. మీకు ఓ సంగతి చెబుతా... నేను సినిమాలో వేషాలు వేస్తున్న కొత్తలో చాలా మంది మా ఊర్లో ఉండే స్నేహితులు నమ్మే వాళ్లు కాదు. ఒరే వీడు మన సప్తగిరా? కాదా? మనోడిలా వేరే ఎవరైనా ఉన్నారా? అని అనుమానించే వారు. కొన్ని పరీక్షల తర్వాత ఒరే... ఈడు మనోడేరా! అని సొంతం చేసుకున్నారు.

* నటనే వద్దన్నావ్‌... హీరో అయ్యావ్‌? దర్శకుడివి కావాలనుకున్నావ్‌... కుదరలేదు. ఇప్పుడు దర్శకత్వం ఏమైనా చేసే ఆలోచన...?
నాకు దర్శకత్వం పిచ్చి. అవకాశం వస్తే వదులుకుంటానా? తప్పకుండా చేస్తా.

* జేమ్స్‌ కామరూన్‌ అవతార్‌4లో అవకాశమిస్తే?
ఆ సినిమాలో ఎవరైనా ఒకటే కదా! అంతా పండారా గ్రహ వాసులే.. ఇక సప్తగిరి ఉన్నా కన్పించడు కదా! అప్పుడు దాని పేరు సప్తగిరి అవతార్‌.

* జేమ్స్‌బాండ్‌ సినిమా మీతో తీస్తానంటే?
ప్రపంచంలో ఉండే మంచి అందమైన హీరోయిన్లందరినీ సినిమాలో పెట్టమని అడుగుతా!

* ఖాళీగా ఉంటే ఏం చేస్తారో?
ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతా. నాకు కొంచెం ఆ వైపు ఆలోచనలున్నాయిలే.

* సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ.. తర్వాత ఏ సప్తగిరి వస్తాడో?
సప్తగిరికి దెయ్యం పట్టింది, సప్తగిరి సన్నీలియోని... అంటూ చాలామంది ఈ కోణంలోనే కథలు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పలేం కదా!

సిక్స్‌ప్యాక్‌?
యోగాతో సిక్స్‌ ప్యాక్‌ వస్తుందేమో ట్రైచేస్తా. జిమ్‌కు మాత్రం వెళ్లను.

వర్క్‌అవుట్స్‌?
రోజూ యోగ చేస్తా.

ఇష్టమైన ఫుడ్‌?
వెజిటేరియన్‌ ఫుడ్‌ బాగా తింటా.

మెచ్చిన ప్రశంస?
చిరంజీవి గారి ఇంట్లో ఆయనతో రెండున్నర గంటల సేపు మాట్లాడటం. ‘‘నీ పేరు నా దాకా వచ్చిందంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావో అర్థం అయింది’’ ఆయన అన్నారు. అంతకంటే నాకేం కావాలన్నా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని