హాలీవుడ్‌లో ‘బతుకమ్మ’

సింగరేణి బొగ్గుగనుల్లో సరిగమలు నేర్చుకున్న ఈ కుర్రాడు.. సినిమాల్లో పాడాలన్నది కల. తీయటి గొంతును నమ్ముకుని.. ఊరును వదులుకుని.. హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.

Published : 30 Dec 2017 02:05 IST

యువ గళం
హాలీవుడ్‌లో ‘బతుకమ్మ’

సింగరేణి బొగ్గుగనుల్లో సరిగమలు నేర్చుకున్న ఈ కుర్రాడు.. సినిమాల్లో పాడాలన్నది కల. తీయటి గొంతును నమ్ముకుని.. ఊరును వదులుకుని.. హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి తిరిగి.. అనుకున్నది సాధించాడు. ఇరవై చిత్రాలకు పైగా పాటలు పాడినా.. హాలీవుడ్‌లో తెలుగు వాళ్లు తీసిన చిత్రంలో ‘బతుకమ్మ’ పాడినందుకు పరవశిస్తున్నాడు.. జై శ్రీనివాస్‌. ఆ కబుర్లే ఇవి..

ద్రాచలంలో పుట్టాను. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రిలో పెరిగాను. చిన్నప్పటి నుంచి సంగీతమే ఊపిరిగా బతికింది మా కుటుంబం. అప్పట్లోనే మా తాతగారు వీరబ్రహ్మంగారి తత్వాలను గేయరూపంలో రాశారు. అమ్మానాన్న కూడా గాయకులే. కుటుంబ సభ్యులు భద్రాచలంలో కీర్తనలు పాడేవారు. చిన్నప్పటి నుంచి నాకు కూడా సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. అమ్మానాన్నలు ఒక సంగీతం మాస్టారును ఏర్పాటు చేసి.. సరిగమలు నేర్పించారు. అప్పట్లో తెలంగాణ పల్లెల్లో జానపద గీతాలు పరవళ్లుతొక్కేవి. ఎక్కడ చూసినా పాటల పోటీలే. ఉత్సాహంగా వెళ్లి పాల్గొనేవాడ్ని. బోలెడు బహుమతులు వచ్చాయి. మ్యూజిక్‌లో డిగ్రీ చేద్దామని హైదరాబాద్‌కు వచ్చాను. సినిమాల్లో గాయకుడిగా స్థిరపడాలన్నది నా ఆలోచన. నగరంలో బతకడం ఆషామాషీ కాదు కదా! అందుకే మా అక్కవాళ్ల ఇంట్లోనే ఉన్నాను. ఎనిమిదేళ్లు ఫిల్మ్‌ స్టూడియోల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలో సిరిమల్లె విష్ణుకిషోర్‌ ఆల్బమ్‌ తీసుకొచ్చారు. అందులో గణపతిస్తోత్రం భక్తి గీతాలాపనతో నా కెరీర్‌ మొదలైంది. ఆ తరువాత ఒక తెలుగు చిత్రంలో చంద్రబోస్‌ రాసిన గీతాన్ని పాడాను. సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌ దగ్గర మెళకువలు నేర్చుకున్నాను. నా కెరీర్‌ను ‘జై’ సినిమా మలుపు తిప్పింది. అందులో ‘దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే’ అనే పాట   పేరుతెచ్చింది. నానీ కథానాయకునిగా నటించిన ‘జెండాపై కపిరాజు’, సిద్దార్థ హీరోగా చేసిన ‘ఎన్‌హెచ్‌ 4’, హాస్యచిత్రం ‘భజంత్రీలు’ తదితర చిత్రాల్లో పాడాను. ప్రస్తుతం రెండు చిత్రాల్లో పాడుతున్నాను. బాలీవుడ్‌లో పాడాలన్నదే నా తదుపరి లక్ష్యం.

స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ తరహాలో ‘ఇండియన్‌ పోస్ట్టుమాన్‌’ అనే చిత్రాన్ని మన తెలుగు వాళ్లు హాలీవుడ్‌లో తీశారు. అమెరికాలో కొంత భాగం, తెలంగాణలోని చారిత్రక ప్రదేశాల్లో మరికొంత భాగం చిత్రీకరించారు. అందులో ‘ఉయ్యాలో ఉయ్యాలో ఐ లవ్‌ యు బతుకమ్మ ఉయ్యాలో..’ అనే పాట పాడాను. హాలీవుడ్‌ చిత్రంలో తెలంగాణ పాట పాడినందుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ గుర్తింపు వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని