ఆ క్షణం గెలిస్తే చాలు

‘జిమ్‌కెళ్లి బరువు తగ్గాలి..’ కొత్త డైరీలో ఏటా రాసుకునే తీర్మానమే.. జనవరి 1, 2018.. తెల్లారగానే మెలకువ వస్తుంది.. ‘ఎహె.. బయట చలి చంపేస్తోంది. ఒక్కరోజుకు కొంపలేం ఆరిపోవు. రేపు వెళ్లొచ్చులే..’ ‘అమ్మో.. ఇది నా ఫస్ట్‌ రెజల్యూషన్‌. వెళ్లి తీరాల్సిందే..!’ మీకూ, బద్ధకానికీ మధ్య స్టార్‌వార్‌ మొదలవుతుంది.. సగం దుప్పటి తీస్తారు.. మళ్లీ కప్పుకుంటారు.. పడుకోలేరు. లేవలేరు...

Published : 30 Dec 2017 02:35 IST

ఆ క్షణం గెలిస్తే చాలు

2018 సంవత్సరానికి కొత్తతరం ఆసక్తి చూపిస్తున్న తీర్మానాల్లో కొన్ని..

* కొత్త ప్రదేశాల విహారం * గుర్తింపు తెచ్చుకోవడం * స్వచ్ఛందసేవ * గుర్రపుస్వారీ * సినిమాల్లో ప్రవేశం * పెంపుడు జంతువుల పెంపకం * సమయపాలన
* బరువు తగ్గడం * డిజిటల్‌ డీ అడిక్షన్‌ * కెరీర్‌లో అప్‌గ్రేడ్‌ * పొదుపు చేయడం * జంక్‌ఫుడ్‌కు దూరం * లఘుచిత్ర రూపకల్పన * వ్యసనాలకు అడ్డుకట్ట
* కొత్త భాషల అధ్యయనం * పని ప్రదేశంలో చొరవ తీసుకోవడం * ఒత్తిడిని అధిగమించడం * యూత్‌క్లబ్స్‌లో చేరాలి * సోషల్‌మీడియాకు కల్లెం * పుస్తక పఠనం
* సంగీతమంటే ఆసక్తి * స్టార్టప్‌ నెలకొల్పడం * ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధ  * క్రెడిట్‌కార్డులపై అదుపు * క్రీడల్లో నైపుణ్యం

‘జిమ్‌కెళ్లి బరువు తగ్గాలి..’
కొత్త డైరీలో ఏటా రాసుకునే తీర్మానమే..
జనవరి 1, 2018..
తెల్లారగానే మెలకువ వస్తుంది..
‘ఎహె.. బయట చలి చంపేస్తోంది.
ఒక్కరోజుకు కొంపలేం ఆరిపోవు. రేపు వెళ్లొచ్చులే..’
‘అమ్మో.. ఇది నా ఫస్ట్‌ రెజల్యూషన్‌. వెళ్లి తీరాల్సిందే..!’
మీకూ, బద్ధకానికీ మధ్య స్టార్‌వార్‌ మొదలవుతుంది..
సగం దుప్పటి తీస్తారు.. మళ్లీ కప్పుకుంటారు.. పడుకోలేరు. లేవలేరు..
ఉరుములాంటి ఉత్సాహం.. ఆ వెనకే మెరుపులాంటి వాయిదా..
మీలో మీకు జరిగే ఆ యుద్ధంలో..
గెలుపోటములను నిర్ణయించేది..
ఒకే ఒక్క క్షణం..
ఆ లిప్తపాటును జయిస్తే మీరే హీరో..!

లాగైనా మితాహారం తీసుకుని బరువు తగ్గుతా. రోజుకు గంటసేపే ఫోన్‌ వాడతా. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు అతుక్కుపోను. అపరాత్రిళ్లు మేల్కొంటే ఒట్టు. వరుసబెట్టి సినిమాలకు వెళ్లను. కుస్తీ పడైనా సరే.. కొత్తభాష నేర్చుకుంటా. షాపింగ్‌ తగ్గిస్తా. బ్రాండెడ్‌ కొనుగోళ్ల మోజులో పడను. ఎడాపెడా ఖర్చు చేయను. పాకెట్‌మనీ మిగిలిస్తా. తిరుగుళ్లు లేవిక. కుటుంబానికి మరింత దగ్గరవుతాను. కెరీర్‌ మీద ఏకాగ్రత పెంచుతా. ఒకటా రెండా.. చాంతాడంత జాబితా రాసుకుంటాం. ఆరంభశూరత్వం అదిరిపోతుంది. ఆర్భాటం హడావిడి చేస్తుంది. కొన్నాళ్లు ఆచరణను మొదలెడతాం. పదో రోజు ఫోకస్‌ తగ్గుతుంది. పదకొండో రోజు ప్యాకప్‌ చెప్పేస్తాం. కొత్తసంవత్సరం ఒకటి చేయాలనుకోవడం, మధ్యలోనే ఆపేయడం.. చాలామందికి అనుభవమే! అయినా మళ్లీ డైరీలో రెజల్యూషన్స్‌ రాసుకుంటాం. ఆ ఆశ ఆచరణ బాట పట్టాలంటే ఏం చేయాలి?

మొదట్లో చిన్న చిన్న లక్ష్యాలతో మొదలవ్వాలి. అంచనా తక్కువ.. ఆచరణ ఎక్కువన్న మాట. అప్పుడే గమ్యం సులభంగా చేరతాం. తీర్మానం ఫలించినప్పుడు సంతృప్తి కలుగుతుంది. మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. అందుకే ‘ఆచరణసాధ్యం కాని అంచనాలేవీ పెట్టుకోవద్దు. మీ స్థాయికి తగ్గట్టు లక్ష్యాలనే ఏర్పరుచుకోండి..’ అంటున్నారు క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ నిరంజన్‌రెడ్డి. అయితే తొలిదశలో చిన్న చిన్న గెలుపుల దగ్గరే ఆగిపోకూడదు. క్రమంగా పుంజుకోవాలి. రెజల్యూషన్స్‌ స్థాయిని పెంచుతూపోవాలి. రెండు కిలోమీటర్లతో నడక ప్రారంభిస్తే.. రెన్నెళ్లు తిరిగేసరికి మూడు కిలోమీటర్లు పెంచుకోవాలన్నది నిపుణుల సూచన. ఏ తీర్మానానికైనా టైమ్‌టేబుల్‌ తప్పనిసరి. చదువుకోవడం, సినిమాలు చూడటం, సోషల్‌నెట్‌వర్క్‌, స్నేహితులు, కుటుంబం, కాలక్షేపం.. ఇలా ప్రతీ అంశానికీ అందులో చోటుండాలి. ప్రణాళికను కఠినమైన క్రమశిక్షణతో అనుసరించాలి. ఆ అలవాటే కొన్నాళ్లకు స్వభావంగా స్థిరపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక, తీర్మానాలను తలకిందులు చేసే బద్ధ శత్రువు వాయిదా. నేడు చేయాల్సిన పనిని రేపు చేద్దామనే ఉదాసీనత.. సమస్యను రెట్టింపు చేస్తుంది తప్ప తగ్గించదు. ఆ అడ్డంకుల్ని దాటుకోవడానికి ధృడసంకల్పం అవసరం. ఇదంతా ఒక ఎత్తయితే - డైరీ నిండా రెజల్యూషన్లే ఉంటాయి కానీ.. ఎందులోనూ స్పష్టత ఉండకపోవడం మరో సమస్య. అస్పష్టమైన తీర్మానాలేవీ తీరం చేరవు. ‘ఈ మాసంలో మ్యూజిక్‌ నేర్చుకోవాలన్నది ఒక లక్ష్యం అనుకుందాం. అందులో ఏ సంగీతసాధనం పట్ల ఆసక్తి ఉందో కచ్చితంగా తీర్మానించుకోవాలి. అప్పుడే మనసును నిలుపగలుగుతాం. ఏకాగ్రత కుదురుతుంది..’ అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. పొగ తాగడం మానుకోవడం, అప్పులు తీర్చుకోవడం, కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవడం, డిజిటల్‌ అడిక్షన్‌ తగ్గించుకోవడం.. ఇలా.. చిన్న చిన్న లక్ష్యాలతో మొదలైతేనే ఫలితాలు లభిస్తాయి. ఆ పట్టుదల ఉన్నప్పుడే.. మీ జీవితంలో  హ్యాపీడేస్‌ మొదలవుతాయి.

ఎవరికైనా నిద్ర లేకపోతే బుర్ర పని చేయదు. ‘అర్జున్‌రెడ్డి’ షూటింగ్‌ మంగళూరులో ఉందప్పుడు. పదహారు రోజులు షూటింగ్‌ చేయాలి. నిర్మాత, దర్శకుడు రెండూ నేనే కాబట్టి.. ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. రోజుకు రెండు గంటలు నిద్రపోతే ఎక్కువ. నేనప్పుడు తీర్మానించుకున్నా.. షూటింగ్‌ పూర్తయ్యే వరకు తప్పదని. లేదంటే సినిమా సరిగా రాదు. ‘అర్జున్‌రెడ్డి’ కోసం నిద్రను త్యాగం చేయడమే..ఈ ఏడాది నేను నెగ్గిన అతి పెద్ద తీర్మానం.
-సందీప్‌, ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు
సినిమాల్లో పాటలు పాడుకుంటూ హాయిగా ఉన్నాను. ఒకరోజు హఠాత్తుగా..ఒక ఆలోచన వచ్చింది.. ‘ఇండియన్‌ ఐడల్‌లో పాల్గొంటే..’ అని. ధైర్యంగా వెళ్లి పాల్గొన్నానంతే! కొందరు భయపెట్టినా వెనక్కి తగ్గలేదు. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుంటే.. దేశవ్యాప్తంగా పేరొచ్చేది కాదు. 2017లో ఆ చిన్న తీర్మానం నా జీవితాన్నే మార్చేసింది. కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే పని చేయాలనుకున్నప్పుడు.. తక్షణమే చేసేయాలి. ఆలస్యం చేయకూడదు.
-ఎల్‌.వి.రేవంత్‌, ఇండియన్‌ ఐడల్‌ 
రోడ్డు ప్రమాదంలో నా కాలు పూర్తిగా పోయింది. అయినా కుంగిపోలేదు. ఉదయం మూడింటికే నిద్ర లేస్తాను. మిషన్‌ 100 అనే లక్ష్యం పెట్టుకుని.. వికలాంగులకు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నాను. గత ఏడాది పారా ఒలింపిక్స్‌లో చైనాకు 251 పతకాలు వస్తే.. మనకు నాలుగే వచ్చాయి. 2020లో భారత్‌ వంద పతకాలు గెలవాలన్న రెజల్యూషన్‌తో పనిచేస్తున్నాను.
-ఆదిత్య మెహతా, సైక్లిస్ట్‌
చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయాలి. ఎలాగబ్బాని భయపడితే ఒళ్లు జలదరిస్తుంది. సాహసించి మగ్గు నీళ్లు పోసుకుంటే చలి పరారవుతుంది. అంటే - మనసు మార్చుకోవడానికి ఒకే ఒక్క క్షణం చాలన్న మాట. జీవితంలో తీసుకున్న తీర్మానాలు ఆచరించి సాధించేందుకైనా.. విఫలమయ్యేందుకైనా పట్టేది ఒక్క క్షణమే! ఆ క్షణంలోనే మీ ఎదుగుదల.. వైఫల్యం రెండూ దాగున్నాయి. ఆ సమయాన్ని జయిస్తే.. ఏ తీర్మానమైనా అమలవుతుంది.
- డా.నిరంజన్‌రెడ్డి, క్లినికల్‌ సైకాలజిస్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని