వర్చువల్‌ వివేకం

హైటెక్‌సిటీలోని ఓ బహుళజాతి సంస్థ. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ ఉద్యోగుల కోసం.. ఇంటర్య్వూలు చేపడుతోంది.. ఎందుకో ప్రాంగణం కోలాహలంగా ఉంది.. అభ్యర్థుల పలకరింపులే కాదు.. బీప్‌బీప్‌ మంటూ మిషీన్ల వింత చప్పుళ్లు.. సరదా షేక్‌హ్యాండ్లు.. ‘హాయ్‌ బ్రో ది సీజ్‌ అప్పారావు ...

Published : 06 Jan 2018 02:29 IST

వర్చువల్‌ వివేకం
12న జాతీయ యువజన దినోత్సవం

హైటెక్‌సిటీలోని ఓ బహుళజాతి సంస్థ. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ ఉద్యోగుల కోసం.. ఇంటర్య్వూలు చేపడుతోంది.. ఎందుకో ప్రాంగణం కోలాహలంగా ఉంది.. అభ్యర్థుల పలకరింపులే కాదు.. బీప్‌బీప్‌ మంటూ మిషీన్ల వింత చప్పుళ్లు.. సరదా షేక్‌హ్యాండ్లు.. ‘హాయ్‌ బ్రో.. ది సీజ్‌ అప్పారావు ఫ్రం శ్రీకాకుళం’ ‘నైస్‌ టు మీట్‌ యూ.. ఐ యామ్‌ రోబో 5.0, ఫ్రం ఆర్టిఫిషియల్‌ల్యాబ్‌ కాలనీ’.. రోబో వాలకం చూశాక అప్పారావు గుండెల్లో దడ పుట్టింది. ఇంటర్వ్యూలో దాంతో పోటీపడగలమా? వెనకాముందు చూశాడు. సగం మంది తనలాంటి పట్టభద్రులుంటేే.. ఇంకో సగం రోబోలే దర్శనమిచ్చాయి. అవి- సీ లాంగ్వేజ్‌ను చిన్నచూపు చూస్తున్నాయి. జావా జమానా ఎప్పుడో పోయిందని గేలి చేస్తున్నాయ్‌..!


సెల్‌ఫోన్‌లో మెమొరీ తక్కువుంటే బెంగ పెట్టుకుంటారు. వైరస్‌ వస్తే అల్లాడిపోతారు. దీనినే మనసుకు వర్తింపజేద్దాం. దేవుడు మనిషికి జ్హాపకాలను, కల్పనాశక్తిని ఇచ్చాడు. కానీ, ఆ మెమొరీలోని చెడును మాత్రమే మాటిమాటికీ బయటికి తీసి గుర్తు చేసుకుంటుంటాం. కానీ, మంచిని గుర్తు చేసుకోవడం లేదు. ప్రతికూల ఆలోచనలను బుర్ర నిండా నింపుకోవడం వల్ల.. చదువులు, ఉద్యోగం, జీవితం దుర్భరంగా మారుతుంది. మంచిని మరువకండి. చెడును వదిలేయండి.. అన్నది వివేకం.
హౌ టు లివ్‌ (ఎలా జీవించాలి), వై టు లివ్‌ (ఎందుకు జీవించాలి) ఈ రెండు ప్రశ్నలే యువత సమస్యలన్నిటికీ పరిష్కారం. శరీరం హార్డ్‌వేర్‌, మనసు సాఫ్ట్‌వేర్‌లాంటివి. ఈ రెండూ కరెంటుతోనే నడుస్తాయి. దేహం, మనసు అంతే.. సృష్టిలోని శక్తితో పని చేస్తాయనుకోవచ్చు. ఈ సత్యం తెలుసుకుని ఓ నాలుగడుగులు ముందుకు వేస్తే.. ఆధ్యాత్మిక మార్గం కనిపిస్తుంది. ఆ ఆలోచన కలిగినప్పుడు.. జీవితానికున్న ప్రయోజనం ఏమిటనే అన్వేషణ ప్రారంభిస్తారు. జీవితమంటే ఖరీదైన కార్లు, ఫోన్లు, దుస్తులు కాదు. కంటికి కనిపించినదల్లా సొంతం చేసుకోవాలనే తాపత్రయం కాదు. వీటన్నిటికీ మించిన పరమార్థం ఉంది. ఆ వివేకం మనకుంటే.. ఇవన్నీ చిన్నవైపోతాయి. బతుకుపట్ల స్పష్టత వస్తుంది.

- స్వామి శితికంఠానంద, రామకృష్టమఠం, హైదరాబాద్‌   

ప్పూ పొద్దున నిద్రలేస్తే వాట్సాప్‌.. అపరాత్రి వరకు ఫేస్‌బుక్‌. ఆన్‌లైన్‌ లావాదేవీలు చిటికెలో చేస్తాడు. ‘అమ్మో! మా అబ్బాయి టెక్నాలజీలో జెమ్‌. మహా చురుకు’ ఉత్తినే కితాబిస్తుంటారు తల్లిదండ్రులు. ఇంటర్వ్యూకు వచ్చాకే తన బండారం బయటపడింది. ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. భయం పట్టుకుంది. రోజుకొక టెక్నాలజీ వచ్చేస్తోంది? ఉద్యోగ ప్రపంచంలో- ఇవ్వాళ ఉండేది రేపు ఉండటం లేదు. మొన్నటివరకు ప్రోగ్రామింగ్‌దే రాజ్యం అన్నారు. ఆ తరువాత క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మేఘాలు అలుముకున్నాయి. ఆ మధ్యన బిగ్‌డేటాను హగ్‌ చేసుకున్నారు. ఇప్పుడు కృత్రిమమేథ, మెషిన్‌ లెర్నింగ్‌, రోబోటిక్స్‌.. ఓరినాయనో! ఈ ఉద్యోగాల వేట వద్దు.. ఏంటీ జీవితం? మనసునిండా ఒక పెద్ద క్వశ్చన్‌మార్కు? ‘‘యువత ఇప్పుడా ప్రశ్నల కొక్కేనికి వేలాడుతూ.. కన్ఫ్యూజన్‌లో ఉంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. తమలోని శక్తియుక్తులు ఏమిటో అంచనా వేసుకోలేకపోతున్నారు. దిశానిర్ధేశం లేదు. ఇలాంటి సమయంలోనే యువతకు వివేకానంద బోధనలు అవసరం’ అంటున్నారు రామకృష్టమఠానికి చెందిన స్వామి శితి కంఠానంద. ఈ నెల 12న వివేకానంద జయంతి సందర్భంగా.. జాతీయ యువజనోత్సవాన్ని జరుపుకోనున్నాం. నేటి యువతకు వివేకానంద బోధనలు ఎలా ఉపకరిస్తాయో చూద్దాం.

‘మీకు ఇష్టమైన ఉపాధిని ఎంచుకోండి. జీవితంలో ఒక్క రోజు కూడా పని చేయాల్సిన అవసరం రాదు..’
ఇష్టంలేని పని చేయొద్దన్నదే వివేకానందుని మాటలోని అంతరార్థం. ఇప్పుడున్న వర్చువల్‌ ప్రపంచంలో అప్‌డేట్‌ కాకపోతే ఆగిపోతాం. అదే ఇష్టమైన కెరీర్‌ అయితే ప్రత్యేకించి నేర్చుకున్నట్లు ఉండదు. ఆ పనిలోనే ఆనందం లభిస్తుంది. అప్పుడది రోబోటిక్స్‌, మెషిన్‌లర్నింగ్‌, ఎనలిటిక్స్‌.. ఇంకేదైనా ఫర్వాలేదు. ముందు ఇష్టంతోనే ఎంపిక చేసుకోవాలి. అప్పటికున్న డిమాండ్‌తోనో, అందరూ అటు వెళుతున్నారనో కాదు. 

‘ముందు నువ్వు.. ఆ తరువాతే దేవుడు’
ఒకచిన్న వైఫల్యంతోనే ఆగిపోతారు. ఇక, నా వల్ల ఏ పనీ కాదు.. అనుకుని కుంగిపోతారు. మనసు నిండా ఒకటే నెగిటివ్‌ ఆలోచనలు. పదే పదే తిరగతోడుకునే చేదు జ్ఞాపకాలు. ఆ స్వభావం వల్ల కుంగుబాటు వస్తుంది. కొన్నిసార్లు ఆత్మహత్యలకు దారితీస్తుంది. అందుకే వివేకానందుడు.. ముందు నీ మీద నువ్వు విశ్వాసం పెట్టుకో. ఆ తరువాతే దేవున్ని విశ్వసించు అన్నారు. ధైర్యవంతుల్ని, శక్తివంతులనే విజయం సిద్ధిస్తుంది. కాబట్టి పరీక్షల్లో ఫెయిలయితేనో, క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఎంపిక కాకపోతేనో జీవితం ఆగిపోదు. వెయ్యిసార్లు విఫలమైనా మళ్లీ ప్రయత్నించు.

‘జీవితమంటే ఉద్యోగమే కాదు..’
ఉద్యోగాల్లోనే జీవితాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సమాజానికి పనికొచ్చే సృజనాత్మక ఆలోచనతో ఒక స్టార్టప్‌ ఏర్పాటు చేయొచ్చు. పదిమందికి పనికొస్తున్నామన్న సంతోషం లభిస్తుంది. ఆత్మ చైతన్యాన్ని కలిగిస్తుంది. ఆ మంచిని రుచి చూడాలంటే పరోపకారం తప్పనిసరి. సహాయపడేందుకు డబ్బు అక్కర్లేదు. నువ్వు డిగ్రీ పట్టభద్రుడివైతే పదో తరగతి పిల్లలకు ట్యూషన్లు చెప్పినా చాలు. మంచి ఆలోచన లక్షల మందిని కదిలిస్తుంది.

‘అహమే పెద్ద వైరస్‌..’
ఏ ఆఫీసులోనైనా బృందంతో కలిసి పనిచేయాలి. ‘నేను’ అనే భావనకు బదులు ‘నా ప్రపంచం’ అనే విశాల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరికొన్ని చేతులు అండగా నిలుస్తాయి. అభద్రత తొలగుతుంది. ఒకరికొకరం ఉన్నామన్న భరోసా లభిస్తుంది. ‘నేను’కే పరిమితం అయితే ఆఖరికి ఒంటరితనమే మిగులుతుంది. టీమ్‌వర్క్‌లో అహానికి తావుండకూడదు.

‘ఆ కిటుకు తెలిస్తే పరిష్కారాల ప్రోగ్రామర్‌ మీరే..’
కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లను ప్రాక్టీస్‌ చేస్తారు. విదేశీ భాషలు నేర్చుకుంటారు. సంకల్పబలాన్ని కూడా మీకు మీరే బలపరుచుకోవాలి. అప్పుడు ఏ సమస్యకు అయినా పరిష్కారం కనిపెట్టే ప్రోగ్రామర్‌ కావొచ్చు. ఆ కిటికు తెలిసినప్పుడు పడినా పైకి లేవడం సులువని చెబుతారు వివేకానందుడు. కెరటం నాకు ఆదర్శం.. పడినందుకు కాదు.. పడి లేచినందుకు అన్నది అందుకే!

‘మూర్ఖులకు సెలవు దినం సోమరితనం..’
ఆ బద్ధకాన్ని స్మార్ట్‌ఫోన్‌తో పెంచిపోషిస్తున్నారు. ఒకప్పుడు టెక్నాలజీ లేదని బాధపడేవాళ్లు పెద్దలు. ఇప్పుడు కొత్తతరం సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదని బాధపడాల్సి వస్తోంది. గాడ్జెట్స్‌తో నన్ను నేను ఆర్భాటంగా ప్రపంచముందు వ్యక్తపరుచుకోను. నాలోని నైపుణ్యం, సృజనాత్మకత, వివేకంతో కూడిన ఐడెంటింటీనే కోరుకుంటాను అనుకోవాలి. చేతిలో ఖరీదైన కొత్త వెర్షన్‌ ఫోన్‌ ఉంటేనే.. నలుగురిలో గొప్పని పొంగిపోవడంలో ప్రయోజనం లేదు. కొత్త వెర్షన్‌ ఫోన్ల వెంట పరిగెడితే.. నష్టమే తప్ప లాభం శూన్యం. గాడ్జెట్స్‌తో మీరు మరింత చురుగ్గా మారే బదులు సోమరితనంతో మూలన కూర్చుండిపోతే ఎలా..?

‘ఎందుకా వర్చువల్‌ భయం..’
వర్చువల్‌ ప్రపంచాన్ని సృష్టించుకున్న మనమే..దాని కబందహస్తాల్లో ఇరుక్కుపోయాం. నిమిషానికి ఒకసారి సెల్‌ఫోన్‌ చూడకపోతే భయం. ఎవరో కాల్‌ చేసుంటారు.. ఇంకేదో మెసేజ్‌ వచ్చుంటుంది.. ఇదే ఉలికిపాటు. అదొక జబ్బుగా మారితే ప్రమాదం. అందుకే ఆయన ‘వస్తు వ్యామోహం వద్దు. నిస్సంగ బుద్ధి అలవర్చుకోండి’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని