ఆవిష్క‘రణ ధీరులు’

నుసి... మసి... కాదేది ఆవిష్కరణకు అనర్హం. కొవ్వొత్తిని మండిస్తే వచ్చే నుసి... బ్యాటరీ పనితీరును మెరుగుపరుస్తుంటే నమ్ముతారా?

Published : 20 Jan 2018 02:31 IST

కొత్త కెరటాలు
ఆవిష్క‘రణ ధీరులు’

నుసి... మసి... కాదేది ఆవిష్కరణకు అనర్హం. కొవ్వొత్తిని మండిస్తే వచ్చే నుసి... బ్యాటరీ పనితీరును మెరుగుపరుస్తుంటే నమ్ముతారా? అల్లనేరేడు గింజలతో నీటిలో ఫ్లోరైడ్‌ తొలగించవచ్చంటే ఆశ్చర్యపోకుండా ఉంటారా?
ఇలా ప్రకృతిలోనే ఎన్నో సమస్యలకు పరిష్కాలున్నాయంటున్నారు హైదరాబాద్‌ ఐఐటీ విద్యార్థులు. సురేష్‌, మయూర్‌, పూనమ్‌, రీతూ, అనన్య, రవి, శ్రీనాథ్‌, శీతల్‌, రమ్య, మనోహర్‌... ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకొని పర్యావరణహిత ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు..

ఐఐటీ హైదరాబాద్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని కార్బన్‌ బృందం ప్రకృతే మూలంగా నూతన ఆవిష్కరణలు చేస్తోంది. వారి ఆలోచనలు, ఉత్పత్తులు ఇప్పటికే ఎందరి మన్ననలో పొందాయి. నానో మెటీరియల్స్‌ ఉపయోగిస్తూ వీరు ఆవిష్కరించిన శానిటరీ న్యాప్‌కిన్స్‌, థర్మాకోల్‌ వ్యర్థాల నుంచి చమురు పీల్చే ఫ్యాబ్రిక్‌ను తయారు చేసిన యంత్రానికి ఈ ఏడాది జర్మనీ, చైనాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇన్నొవేషన్‌ ఫెయిర్‌లలో పతకాలు లభించాయి. పర్యావరణహితంగా ఉండే న్యాప్‌కిన్ల ఆవిష్కరణకు గాను పరిశోధక విద్యార్థిని శీతల్‌ యాదవ్‌ను ‘గాంధియన్‌ యంగ్‌ టెక్నొలాజికల్‌ ఇన్నొవేషన్‌ అవార్డు’ వరించింది.

కార్బన్‌ బృందానికి మార్గదర్శనం చేస్తున్న సహాయ ఆచార్యులు డాక్టర్‌ చంద్రశేఖర్‌శర్మ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు కొవ్వొత్తిని మండించడం ద్వారా వచ్చే నుసిని లిథియం అయాన్‌ బ్యాటరీల్లో ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయని కనుగొన్నారు. పదే పదే రీఛార్జి చేసే సమస్య తప్పడంతో పాటు బ్యాటరీల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుందని వీరి పరిశోధనల్లో గుర్తించారు. తాజాగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇంప్రింట్‌ పథకం ద్వారా ఈ ఆవిష్కరణను సాకారం చేయడానికి నిధులను అందించింది. రూ.2.6 కోట్లతో మూడేళ్ల పాటు మరిన్ని పరిశోధనలు సాగించేందుకు వీలు కలిగింది. చాలా తక్కువ ఖర్చుతో, గ్రామీణ ప్రాంతాల్లో సులువుగా ప్రాథమిక రక్త పరీక్షలు నిర్వహించే ఒక పరికరాన్ని వీరు అందుబాటులోకి తెచ్చేలా పరిశోధనలు సాగించనున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌, సీఎస్‌ఐఆర్‌ కోల్‌కతా, ఐఐఈఎస్‌టీ కోల్‌కతా, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ మార్క్‌ మోడే, కోల్‌కతాకు చెందిన వైద్యుడొకరు ఈ ఆవిష్కరణను సాకారం చేయడంలో నిమగ్నమయ్యారు.  ఇలా చక్కని పరిశోధనలు చేస్తూ పరిశోధక విద్యార్థులను ప్రోత్సహిస్తున్న చంద్రశేఖర్‌ శర్మకు 2017 సంవత్సరానికి గాను ‘యువ శాస్త్రవేత్త’ అవార్డు వచ్చింది

పరిశోధనల్లో కొన్ని..

* నారింజ తొక్కల నుంచి తీసిన రసంలో థర్మాకోల్‌ను ఉంచితే అది చిక్కని ద్రావణంగా మారుతుంది. దీనిలో నుంచి చమురు పీల్చే ఫ్యాబ్రిక్‌ను తయారు చేసే యంత్రానికి వీరు రూపునిచ్చారు. 
* అల్లనేరెడు గింజలను ఉపయోగించి నీటిలోని ఫ్లొరైడ్‌ను తగ్గించేలా పరిశోధనలు చేశారు. గింజల నుంచి సేకరించిన కార్బన్‌ ద్వారా నీటిలో కరిగిన ఫ్లోరైడ్‌ లవణాలను సంగ్రహించేలా పరీక్షలు చేసి మంచి ఫలితాలను సాధించారు.
* రెస్టైరో టెక్నాలజీస్‌ పేరిట అంకుర సంస్థను  ప్రారంభించారు. పర్యావరణ హిత ఉత్పత్తులను దీని ద్వారా మార్కెట్లోకి తేనున్నారు.
* ‘రాత్రివేళ కారులో ప్రయాణిస్తుంటే ఎదురుగా వచ్చే వాహనాల దీపాల కాంతి వల్ల కళ్లు మసకబారిపోతాయి. ముందు ఏముందో కనిపించదు. ఇందుకు కారు అద్దంపై పడిన కాంతి... పరావర్తనం చెందడమే కారణం. ఈ సమస్యకు ప్రకృతే ఆధారంగా పరిష్కారం కనుక్కొన్నారు కార్బన్‌ బృంద సభ్యులు. నీట తడవని, కాంతి పరావర్తనం చెందని వస్తువుల తయారీ అంశమై వీరు చేసిన పరిశోధనలు ఫలించాయి.
* గ్రామీణ మహిళలు నెలసరి సమయంలో శానిటరీ న్యాప్‌కిన్స్‌ ఉపయోగించలేని దుస్థితి. వీటి ధర ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. పైగా వీటి తయారీలో రసాయనాల మోతాదు ఎక్కువగా ఉంటుందనే వాదనా లేకపోలేదు. ఒక ఆవిష్కరణతో వీటన్నింటికీ మెరుగైన పరిష్కారం చూపగల సత్తా ఈ సభ్యుల సొంతం. తక్కువ ధరకు ప్రకృతి హిత న్యాప్‌కిన్‌ తయారు చేశారు.

- రాజేందర్‌ సురకంటి, ఈనాడు, సంగారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని