యువ(మి)త భాష్యం

సెల్‌ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లు.. ట్యాబ్‌లెట్లు.. బ్రాండెండ్‌ దుస్తులు.. బూట్లు.. వాచీలు.. వాలెట్‌లో దండిగా డబ్బుంటే.. ఆ జోరే వేరప్పా.. కళ్లకు ఇంకేదీ కనిపించదు.. కనికట్టు చేసినట్టు కొనుడే కొనుడు.. ఆ వినియోగ మాయాజాలంలో.. ఏది అవసరం? ఏది అనవసరం? తేడా తెలీదు.. కాబట్టి ఆ హోరుకు ఓ...

Published : 27 Jan 2018 01:39 IST

నయా ట్రెండ్‌- మినిమలిజం
యువ(మి)త భాష్యం  

సెల్‌ఫోన్లు.. ల్యాప్‌టాప్‌లు.. ట్యాబ్‌లెట్లు..
బ్రాండెండ్‌ దుస్తులు.. బూట్లు.. వాచీలు..
వాలెట్‌లో దండిగా డబ్బుంటే..
ఆ జోరే వేరప్పా.. కళ్లకు ఇంకేదీ కనిపించదు..
కనికట్టు చేసినట్టు కొనుడే కొనుడు..
ఆ వినియోగ మాయాజాలంలో..
ఏది అవసరం? ఏది అనవసరం?
తేడా తెలీదు..
కాబట్టి ఆ హోరుకు ఓ బ్రేక్‌ పడాలి..
ఎక్కడ తగ్గాలో తెలియాలి..
అందుకే మీకిప్పుడు కావాలి.. మినిమలిజం..
అపరిమితాన్ని పరిమితం చేసుకునే సరికొత్త జీవనవిధానమే ఇది..
మీ విష్‌లిస్టులో జతపరిచిన బోలెడు వస్తువులు.. వార్డ్‌రోబ్‌లోని నలభై రకాల బట్టలు.. గుమ్మం బయట ఐదు జతల బూట్లు.. అల్మరా నిండా అలంకరణ వస్తువులు.. బీరువాలో అరడజను అభరణాలు.. రెండు బైకులు.. ల్యాప్‌టాప్‌, గాడ్జెట్లు.. ఏవైనా కావొచ్చు. ఇలా.. అవసరం లేని వాటినల్లా కొంటూపోతే.. అత్యవసరమైన వాటికి చేతులు ఎత్తేయాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు యువతకు మినిమలిజం కావాల్సి వచ్చింది. అమెరికాకు చెందిన జోషువామిల్‌బర్న్‌, రేయాన్‌ నికోడామస్‌ అనే మిత్రులు ఈ అంశానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. మినిమలిజం పేరుతో బ్లాగ్‌ నడుపుతూ.. పుస్తకాలు, ఆడియోలు, వికాసపాఠాల ద్వారా యువతను ఆలోచింపజేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 156 దేశాల్లోని రెండు కోట్లమందిని ప్రభావితం చేశారీ మిత్రులు. అపరిమితాన్ని మితానికి పరిమితం చేయాలన్నదే వీళ్ల ఆలోచనల్లోని పరమార్థం. నిజమైన ఆనందం వస్తువుల్లో కాదు. జీవితంలో వెతుక్కోవాలన్నదే దీని సారాంశం.
ఆ ఆనందం కాసేపే!
ఒక ప్రముఖ ఆన్‌లైన్‌షాపింగ్‌ సైట్‌లో ఎన్ని వస్తువులు ఉంటాయో ఊహించండి..? సుమారు పదిహేనుకోట్లు ఉండొచ్చు. ఇవన్నీ ప్రతిక్షణం ఊరించేవే! చూసినదల్లా కొనాలని మనసు లాగేస్తుంటుంది. ఆఫర్లు, ఎక్సేంజిలు, డిస్కౌంట్లు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. క్రెడిట్‌కార్డులతో ఎన్ని ఆర్డర్‌ చేశామో.. ఎందుకు కొన్నామో కూడా తెలీదు. వస్తువులతో ఆనందం దక్కుతుందా? కచ్చితంగా దక్కదు. ఆ సంతోషం కాసేపే. ఒకటి పోతే మరొకటి. ఆఖరికి ఏ వస్తువు దగ్గరా సంతృప్తి నిలువదు. అలాకాకుండా.. మనమెందుకు జీవిస్తున్నాం? అర్థమేంటి? తెలుసుకున్నప్పుడు దొరికేదే నిజమైన సంతోషం అన్నది మినిమలిస్టుల అభిప్రాయం.
త్యాగం వద్దు గురూ..
మినిమలిజం అంటే సర్వం త్యాగం చేసి.. సన్యాసుల్లా జీవించమని కాదు. ఇల్లు, బైకు, కారు లేకుండా నెట్టుకురావడమూ కాదు. అవసరం లేని వాటిని తగ్గించుకుని హాయిగా బతకడం. నిజానికి మినిమలిజం పాటించినప్పుడే.. మనకు కావాల్సినవన్నీ దక్కుతాయి. అయితే దీని కోసం ఏం చేయాలి? అని అడగొచ్చు మీరు. ‘‘ప్రతి వస్తువును మూడు రకాలుగా చూడొచ్చు (నీడ్స్‌, కంఫర్ట్‌, లగ్జరీ). బేసిక్‌ ఫోన్‌ అనేది అవసరం అనుకుందాం. సాధారణ ఫోన్‌ సౌకర్యం.. ఇంకాస్త ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ సౌఖ్యం కిందికి వస్తుంది. ఒకవేళ ప్రతి వస్తువులోనూ ఇలా లగ్జరీకి అలవాటు పడితే.. ఒక మెట్టు దిగడంలాంటిదే మినిమలిజం..’’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ చల్లా గీత. అంటే - తక్కువ వస్తువులతోనే ఎక్కువ సంతోషంతో జీవించడం.

మరేం చేయాలి?
రుగులకు బ్రేకులు వేయండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. నేనేంటి? జీవితం ఎటు వెళుతోంది? ప్రశ్నలు వేసుకోవాలి. పరిమితికి మించి వస్తువుల్ని కొనుక్కోవడం.. సుఖాల వెంట పరిగెత్తడం.. ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం..వంటివి విశ్లేషించుకోవాలి. ఆ జోరుకు బ్రేక్‌ పడితే.. వ్యవహారం మారిపోతుంది. ఎంత వరకు పరిగెత్తగలిగితే అంతే పరిగెత్తాలి. తిరిగి తిరిగి వచ్చే కోరికలకు ఎక్కడో ఒక చోట గుడ్‌బై చెప్పాలి అంటుంది మినిమలిజం. అయితే షాపింగ్‌ మనస్తత్వాన్ని మాత్రం నియంత్రించుకోలేం? అనకండి. ఒక వస్తువు కనిపిస్తూనే... ఎలాగైనా కొనితీరాల్సిందే అనిపిస్తుంది. ఆ సమయంలో ‘ఇప్పుడు కాదు.. మళ్లీ కొంటా’నని వాయిదా వేయండి. దీన్నే ఇంపల్స్‌ డిలే టెక్నిక్‌ అంటారు. ఇక్కడి నుంచే మీకు.. ఎక్కడ తగ్గాలో తెలుస్తుంది. ఆ రోజు నుంచి మినిమలిస్టులైపోతారు! ఇక.. అక్కడి నుంచి అన్నీ హ్యాపీడేసే!


మినిమలిజం ఇప్పుడు యువతకే కాదు. కుటుంబాలకు, పర్యావరణానికీ అత్యవసరం. నేను షూటింగ్‌లో మేకప్‌ వేసుకునేప్పుడు ఒక చిన్న టిష్యూ పేపర్‌ వాడాలన్నా ఆలోచిస్తాను. ఐదారుకు మించి వాడను. చెట్లతోనే ఆ పేపర్లు తయారుచేస్తారన్న స్పృహ నాకుంది. నీళ్ల బాటిళ్లు కూడా కొనను. ఇంటి నుంచే నీళ్ల సీసా పట్టుకెళతాను. ప్లాస్టిక్‌ బాటిల్‌ పడేస్తే మట్టిలో కలిసిపోదు. కాలుష్యానికి కారణం అవుతుంది. ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు కూడా అంతే! ఒక్కో ఇంట్లో పదేసి ఉంటాయి. అందులో సగం కూడా వాడం. నేనిప్పటికీ శ్యామ్‌సంగ్‌ నార్మల్‌ స్మార్ట్‌ ఫోన్‌నే వాడుతున్నా. నా ఫ్రెండ్స్‌ అందరూ ‘ఒరే నువ్వు హీరోవురా. ముందు ఆ ఫోన్‌ మార్చు’ అంటూ ఆటపట్టిస్తుంటారు. మార్కెట్‌లోకి రోజుకొక కొత్త వెర్షన్‌ మొబైల్‌ఫోన్‌ వస్తుంది. ఈ రోజు కొన్న కొత్త ఫోను.. రేపు పాతదైపోతుంది. కొత్త వస్తువుల మోజులో నేనెప్పుడూ పరిగెత్తను.బూట్లు కూడా బాగా అరిగిపోయే వరకు వాడుతుంటా. ఇక, నా పాత బట్టలను ఇంట్లో ఉంచను. ఎప్పటికప్పుడు పేద పిల్లలకు ఇచ్చేస్తుంటా.

- నిఖిల్‌, యువ నటుడు   


మీరు అడగొచ్చు.. ‘ఏది కొనాలి? ఏది వద్దు? తేల్చుకోవడం ఎలా?’ అని. తికమక పడక్కర్లేదు. మీకు మీరే తేల్చుకోవడం క్షణాల్లో పని. ఏదైనా కొంటున్నప్పుడు ‘ఆ వస్తువు లేకపోతే బతకలేమా?’ని ఒక ప్రశ్న వేసుకోండి. ‘అమ్మో బతకలేం’ అనే జవాబు వస్తే.. తప్పక కొనండి. ‘ఏం ఫర్లేదు. బేషుగ్గా బతకొచ్చు’ అనుకుంటే కొనొద్దు. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో, మాల్‌లో కొనేముందు ఇదే ప్రశ్న వేసుకోవాలి. ఆ తరువాతే కొనాలి. దీనినే కాగ్నెటివ్‌ డ్రిల్లింగ్‌ టెక్నిక్‌ అంటారు. ఆలోచనల్ని డ్రిల్లింగ్‌ చేస్తూ పోతే.. ఏదో ఒక చోట కనువిప్పు కలగక తప్పదు. విష్‌లిస్టుకూ కోత వేయొచ్చు. అప్పుడు మీరే మిగతా వాళ్ల కళ్లు తెరిపించే మినిమలిస్ట్‌ అవుతారు.
- చల్లా గీత, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌  
వసరమున్నా లేకపోయినా.. కొనేస్తూపోతే డిమాండ్‌ పెరుగుతుంది. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అది వ్యక్తికీ, సమాజానికీ భారమే! ఫ్యామిలీ బడ్జెట్‌పైనా ప్రభావం పడుతుంది. అవసరం లేని వస్తువులను కొనకపోవడం కూడా సామాజిక సేవ కిందికే వస్తుంది. తక్కువ వస్తువులతోనే ఆనందంగా బతికేతత్వాన్ని అలవర్చుకోవాలి. ఈ మధ్య సంస్థలు వ్యయభారాన్ని తగ్గించుకుంటున్నాయి. యువత కూడా సాధారణ జీవనశైలికి అలవాటుపడాలి. ఏటికేడు వస్తువుల జాబితా తగ్గిపోవాలి. అవసరానికి మించి కొనడం ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు. మీరు అంతకు మునుపు కొనుగోలు చేసిన వస్తువు వల్ల ఇప్పుడు సంతోషంగా లేరు కదా! ఆ అనుభవమే మీకిప్పుడు జీవనసత్యం కావాలి.
- డా.నిరంజన్‌రెడ్డి, క్లినికల్‌ సైకాలజిస్ట్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని