దావోస్‌లో తెలుగు తేజాలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌.. అక్కడ ఇటీవలే జరిగిన ప్రపంచ ఆర్థికసదస్సుకు మహామహులు తరలివచ్చారు.. అందులో అందర్నీ ఆకర్షించిన ముగ్గురు యువతేజాలు మన తెలుగువాళ్లే! ఒకరు ప్లాస్టిక్‌వ్యర్థాలను...

Published : 03 Feb 2018 02:09 IST

మేము సైతం
దావోస్‌లో తెలుగు తేజాలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌.. అక్కడ ఇటీవలే జరిగిన ప్రపంచ ఆర్థికసదస్సుకు మహామహులు తరలివచ్చారు.. అందులో అందర్నీ ఆకర్షించిన ముగ్గురు యువతేజాలు మన తెలుగువాళ్లే! ఒకరు ప్లాస్టిక్‌వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చే ప్రక్రియను వివరించారు. ఇంకొకరు పరిశ్రమలకు సరఫరా చేసే సహ ఉత్పత్తులు ఎంత కీలకమో చెప్పుకొచ్చారు. మూడో వ్యక్తి.. నరకప్రాయం అవుతున్న నగరజీవితాలను ఎలా బాగుచేసుకోవాలో సలహాలు అందించారు. దావోస్‌కు వెళ్లిన ఆ ముగ్గురే వీరు..

బస్సులోనో రైల్లోనో వెళుతూ ఒక బాటిల్‌ నీళ్లు కొనుక్కుంటాం. దప్పిక తీర్చుకుని ఖాళీ బాటిల్‌ రోడ్డుపక్కన పడేస్తాం. ఒకటి రెండు కాదు. లక్షల బాటిళ్లు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ప్లాస్టిక్‌ పైపులు, గృహసామగ్రి, కుర్చీలు, బిందెలు.. ఒక్కటేమిటి? మన దైనందిన జీవితం మొత్తం ప్లాస్టిక్‌తోనే ముడిపడి ఉంది. టన్నుల కొద్దీ గుట్టలుగా పేరుకుపోతోంది. అలాంటి ప్లాస్టిక్‌ వ్యర్థాలను మళ్లీ రీసైక్లింగ్‌ చేసి.. పునర్వినియోగంలోకి తీసుకొస్తోంది బన్‌యన్‌ నేషన్‌. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ సహవ్యవస్థాపకుల్లో ఒకరు మని వాజ్‌పేయ్‌. వరంగల్‌లోని ఎన్‌ఐటిలో బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన ఈయన సాంకేతికతను అందిపుచ్చుకున్న నైపుణ్యవంతుడు. భవిష్యత్తును ముందే అంచనావేసి.. ప్లాస్టిక్‌వ్యర్థాలతో కుస్తీపట్టే సంస్థకు ప్రాణం పోశాడు. డెలివేర్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ డిగ్రీ పూర్తి చేశాడు. యుసి బార్క్‌లీ, కొలంబియా బిజినెస్‌ స్కూల్‌లలో డ్యూయల్‌ ఎంబీఏ పూర్తి చేశాడు. ప్రముఖ ఐటీ సంస్థ క్వాల్‌కం ఇంక్‌లో కొంత కాలం పనిచేశాడీయన. డిజైన్‌, డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌, మొబైల్‌ టెక్నాలజీలలో అనుభవజ్ఞుడు. అనంతరం పర్యావరణహిత సంస్థను పెట్టాలన్న ఆలోచనతో ‘బన్‌యన్‌ నేషన్‌’ నెలకొల్పాడు. ఈ సంస్థ ప్రపంచ ఆర్థిక సదస్సులో డెల్‌ పీపుల్స్‌ చాయిస్‌ అవార్డును అందుకున్న తొలి భారతీయ సంస్థ. ప్లాస్టిక్‌ వ్యర్థాల్లోని రంగు, ఇంక్‌, కోటింగ్‌, ఇతర రసాయనాలను తొలగించి.. తిరిగి వినియోగించుకునే శుద్ధ ప్లాస్టిక్‌ను తయారుచేస్తుందీ సంస్థ. దావోస్‌లో అవార్డును అందుకోవడం భారతీయ సంస్థలకు ప్రోత్సాహాన్ని అందించినట్లయిందని చెప్పాడు వాజ్‌పేయ్‌.

ప్రపంచ ప్రగతికి కొత్త ఆలోచనలు కావాలి. ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వాలు, మేధావులు కలిస్తేనే ఆ ఉజ్వల భవిష్యత్తు సాధ్యం అవుతుంది అంటున్నారు హర్షవర్ధన గౌరినేని. అమరరాజ గ్రూప్‌ సంస్థల వ్యాపార కుటుంబంలో పుట్టిన హర్ష కెరీర్‌లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. అతను పర్ద్యు విశ్వవిద్యాలయంలో సైకాలజీ చదువుకున్నాడు. ఆరోగ్య సంరక్షణ, వైద్య పరికరాలు, ఉత్పత్తి నిర్వహణలతోపాటు ఫిట్‌నెస్‌ రంగంలోనూ కృషి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌, తిరుపతిల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న మంగల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనే అవకాశం రావడం అరుదైనది. అంతర్జాతీయస్థాయి మేథోవర్గాలను కలుసుకునేందుకు అదో చక్కటి వేదిక అన్నారు. మంగల్‌ సంస్థ పర్యావరణహితాన్ని దృష్టిలో పెట్టుకుని వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. నట్లు, బోల్టులు, షీట్‌మెటల్స్‌, ప్లాస్టిక్‌ ఉత్పత్తిలో సత్తా చాటుతోంది.

ప్రపంచవ్యాప్తంగా నగరాలన్నీ నరకకూపాల్లా మారుతున్నాయి. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ, తీవ్ర కాలుష్యం.. ఇవన్నీ సగటు ఆయుఃప్రమాణాలను దెబ్బతీస్తుండటం దారుణం. నగరజీవుల నాణ్యమైన జీవితం కోసం స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు ఏం చేయాలన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఇప్పుడు అదే చర్చను దావోస్‌లోనూ లేవనెత్తారు మన తెలుగు అమ్మాయి దీపిక ప్రసాద్‌. హైదరాబాద్‌కు చెందిన ఈ సివిక్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ బిగ్‌ఐడియాస్‌ పేరుతో జరిగిన చర్చలో మాట్లాడారు. ‘భారతదేశంలో ప్రతి గంటకు 1800 మంది నగరాలకు వలస వస్తున్నారు. వీళ్లందరూ మెరుగైన ఉపాధి అవకాశాల కోసం వస్తున్న వాళ్లే! అయితే నగరాల్లో నాణ్యమైన జీవితానికి దూరం అవుతున్నారు. దిల్లి, బెంగళూరు వంటి నగరాల్లో అయితే జీవితం సంక్లిష్టంగా మారింది’ అన్నది దీపిక అభిప్రాయం. నివాసయోగ్యమైన నగర నిర్మాణాల కోసం కృషి చేస్తున్నారీమె. లకీర్‌ అనే సంస్థ సహ వ్యవస్థాపకులుగా వివిధ వేదికల మీద తన ఆలోచనలను పంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సానుకూల మార్పునకు దోహదం చేస్తున్న గ్లోబల్‌ షేపర్స్‌ కమ్యూనిటీలోను సభ్యురాలు. ఇందులో 150 దేశాలకు చెందిన 7 వేల మంది యువ సభ్యులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు