4 నిమిషాలు... 60 లక్షలు

రైతుల ఆత్మహత్యలపై రూపొందిన షార్ట్‌ఫిల్మ్‌ ‘మిస్సింగ్‌’. సోషల్‌ మీడియాలో....

Published : 03 Mar 2018 01:13 IST

4 నిమిషాలు... 60 లక్షలు
అన్నదాతపై ఉన్నమాట

రైతుల ఆత్మహత్యలపై రూపొందిన షార్ట్‌ఫిల్మ్‌ ‘మిస్సింగ్‌’. సోషల్‌ మీడియాలో వైరల్‌. ఫేÆస్‌బుక్‌లోనే ఇప్పటివరకూ అరవై లక్షలకి పైగా వీక్షించారు. కొన్ని వేలమంది కామెంట్స్‌ రాశారు. హృదయాన్ని మెలిపెట్టే ఈ కథ ‘న్యూజెర్సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఈ రోజే ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా ‘మిస్సింగ్‌ దర్శకుడు’ ఎ.గంగారెడ్డిని ఈతరం పలకరించింది.
‘లఘు’దర్శనం
మిస్సింగ్‌.. నిడివి నాలుగు నిమిషాలు.. ఉండేది రెండే పాత్రలు.. ఫేస్‌బుక్‌లో చూసింది అరవై లక్షలు... న్యూజెర్సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శన.. ఇంతలా ఈ పొట్టి చిత్రంలో ఏముందీ అంటే.. అన్నదాత దీన పరిస్థితి ఉంది. ‘మా అబ్బాయి గత ఇరవై రోజులుగా కనిపించడం లేదు’ అనే పోస్టర్‌తో మొదలవుతుంది. సమాజం, ప్రభుత్వం రైతుల ఆతహత్యలను పట్టించుకోని పరిస్థితిలో ఓ మహిళారైతు తన కొడుకు కోసం అన్వేషణ చేసిన వ్యధాపూరిత కథే ఇది. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. వీక్షకులను వెంటాడుతుంది. దేశానికి అన్నంపెట్టే రైతన్న ఊపిరికి ఎలా ఉరిబిగుసుకుంటోందో కళ్లకు కడుతుంటే... చెమర్చని కళ్లుండవు. ఆలోచించని మనసుండదు.

అనుభవాలే తెరపై..
గంగారెడ్డిది నిజామాబాద్‌ జిల్లా మోతె గ్రామం. ఇతని నాన్నకి డెబ్భై మూడేళ్లు. ఇప్పటికీ సైకిల్‌ మీద పొలానికి వెళ్లి వ్యవసాయం చేస్తాడు. చదువుకునే రోజుల్లో గంగారెడ్డీ వ్యవసాయం చేశాడు. లండన్‌లో ఎంబీఏ చేసిన ఇతనికి విజువల్‌ మీడియా అంటే ఆసక్తి. రచనపై ఆసక్తి ఉంది. ఫొటోగ్రఫీతో పరిచయముంది. అందుకే అమెజాన్‌లో ఉద్యోగాన్ని వదులుకుని హైదరాబాద్‌కి వచ్చాడు. ఫేస్‌బుక్‌లో ఫొటోలను చూసి బెంగళూరుకు చెందిన కిసాన్‌రాజ్‌ సంస్థ సంప్రదించింది. ఆ యాడ్‌లో రైతు జీవితాన్ని చూపించాడు. ఆ తర్వాత తనికెళ్లభరణితో చేసిన ‘కేర్‌ మోటో’ యాడ్‌కి మంచి పేరొచ్చింది. పేరుకి ఇవి రెండూ యాడ్స్‌ అయినా అందులో హ్యూమన్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి. కాబట్టే అవి లక్షల హృదయాల్ని తాకాయి.

అలా ‘మిస్సింగ్‌’ చేసే అవకాశం..
రెండు యాడ్‌ఫిల్మ్స్‌ ఫేస్‌బుక్‌లో వైరల్‌ అయ్యాయి. దీంతో అమెరికాలోని సురేష్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గంగారెడ్డిని మెసెంజర్‌లో సంప్రదించాడు. సురేష్‌ రైతు ప్రేమికుడు. తెలుగురాష్ట్రాలతో పాటు, మహారాష్ట్రలో ఆత్మహత్యలు చేసుకున్న కొందరు రైతుకుటుంబాల్లోని పిల్లలకు చదువు చెప్పిస్తుంటాడు. ‘ఐఫర్‌ ఫార్మర్స్‌’ అనే సంస్థను నెలకొల్పాడు. సురేష్‌ అనుకున్న ఓ కథను గంగారెడ్డికి చెప్పాడు. అలా ‘మిస్సింగ్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించే అవకాశం గంగారెడ్డికి వచ్చింది. ఇటీవలే రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే తోటివారు భరోసాను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ‘ఎంకరేజ్‌మెంట్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌ తీశాడు. దీన్ని నలభై లక్షల మంది వీక్షించారు.


అదే నా ఆశ

కేంద్రప్రభుత్వ లెక్కల ప్రకారం 1995 నుంచి 2015 వరకూ దేశంలో ఇరవై మూడులక్షల ఇరవై వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనధికారికంగా మరో నాలుగు లక్షలమంది చనిపోయారని ఎన్జీవో సంస్థలు అంటున్నాయి. ఈ లెక్కలు చూసి బాధపడే ‘మిస్సింగ్‌’ ఫిల్మ్‌ చేశాం. కంటెంట్‌, టెక్నికల్‌ స్టాండర్డ్‌తో లఘుచిత్రంలో రైతుల ఆత్మహత్యలనే పెద్ద విషయాన్ని చర్చించాం. ఇది సవాల్‌తో కూడుకున్న విషయం. ఇందులో వాస్తవం ఉంది. కాబట్టే ప్రతి ఒక్కరూ కనెక్టయ్యారు. అందుకే న్యూజెర్సీ ఫిల్మ్‌ఫెస్టివల్‌ దాకా ఈ చిత్రం వెళ్లింది. దర్శకత్వం చేయాలనేదే నా లక్ష్యం.

- గంగారెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని