ఆ ఇద్దరు సాయానికి సైన్యం

సాయం చేయాలంటే... కోట్ల కొద్దీ డబ్బులే ఉండాలా? చిన్ని మెదడులో మెరుపులాంటి ఆలోచన చాలదా! వెలుగులు నింపాలంటే.. సూర్యోదయమే కావాలా?వేల దీపాలు వెలిగించ గలిగే చిరు దివ్వె సరిపోదా! ఈ ఇద్దరు యువకులు మెరుపు లాంటి ఆలోచనతో.....

Published : 10 Mar 2018 01:48 IST

ఆ ఇద్దరు సాయానికి సైన్యం

సాయం చేయాలంటే... కోట్ల కొద్దీ డబ్బులే ఉండాలా? చిన్ని మెదడులో మెరుపులాంటి ఆలోచన చాలదా! వెలుగులు నింపాలంటే..  సూర్యోదయమే కావాలా?వేల దీపాలు వెలిగించ గలిగే చిరు దివ్వె సరిపోదా! ఈ ఇద్దరు యువకులు మెరుపు లాంటి ఆలోచనతో... అంతర్జాలంలో చిరుదివ్వె వెలిగించారు. ఆ స్ఫూర్తి మూడు లక్షలకు పైగా దీపాలను వెలిగించి కాంతులు పంచుతోంది.
దేశవ్యాప్తంగా పోటీ... 1900 ఆవిష్కరణల నుంచి దరఖాస్తులు.. 7 నెలల సుదీర్ఘ వడపోత.. 30 సంస్థల ఎంపిక... తుదిపోటీకి దిల్లీకి పిలుపు.. అందులో అత్యుత్తమంగా నిలిచిన సామాజిక అంతర్జాల ఆవిష్కరణే డొనేట్‌కార్ట్‌. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో నాస్కామ్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌ ఫోరంలో విజేతగా నిల్చింది. ప్రజలు దాతృత్వంగా ధనం బదులు వస్తువులను కొని ఇచ్చేలా భారతదేశపు మొదటి క్రౌడ్‌ సోర్సింగ్‌ వేదికను ఏర్పాటు చేశారు తెలుగు కుర్రాళ్లు అనిల్‌కుమార్‌రెడ్డి, సందీప్‌. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు రూ.1.5 కోట్ల విలువైన 3 లక్షలకు పైగా ఉత్పత్తుల్ని సాయంగా అందుకోవడం విశేషం. పెద్ద సమస్యకు వినూత్న ఆలోచనతో సులభ పరిష్కారం చూపి అందరి మన్ననలు అందుకుంటున్న వ్యవస్థాపకుల్లో ఒకరైన అనిల్‌కుమార్‌రెడ్డిని ‘ఈతరం’ పలకరించింది. తమని కదిలించిన ఘటనలు, డొనేట్‌కార్ట్‌ ప్రారంభం... తదితర విషయాలు వివరించారు.
‘‘నాది చిత్తూరు జిల్లా మదనపల్లి. సందీప్‌ది కోదాడ. ఇద్దరం ఎన్‌ఐటీ నాగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌ చదివాం. కళాశాలలో చదివే రోజుల్లో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాళ్లం. సమీపంలో ఉన్న పాఠశాలలకు వెళ్లి బోధించేవాళ్లం. సరిగ్గా అప్పుడే 2015లో చెన్నైలో వరదలు వచ్చాయి. 25 రోజుల పాటూ గూంజ్‌ స్వచ్ఛంద సంస్థతో కలిసి అక్కడ సేవా కార్యక్రమాల్లో పనిచేశాను. వరద బాధితులకు సాయపడేందుకు జనం స్పందించి పాత దుస్తులు, ఆహారం, నీళ్లు పంపడంతో వాటిని తీసుకెళ్లి అవసరమైన వారికి పంచడం మా విధి. అయితే అక్కడ జనాలు ఆశించేది ఒకటి ఉంటే దాతలు పంపేది మరోటి ఉండేది. దీంతో చాలా వస్తువులు మిగిలిపోయేవి. ఎందుకు ఇలా జరుగుతోందని ఆలోచించాం. దాతలకు నిజంగా అక్కడ అవసరాలు ఏంటో తెలియకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించి పరిష్కారంపై దృష్టిపెట్టాం.

ఉద్యోగం వద్దనుకుని..
2015 ఫైనల్‌ ఇయర్‌లో ఉండగానే ప్రాంగణ నియామకాల్లో మేం ఉద్యోగాలకు ఎంపికయ్యాం. కానీ మా ఆలోచనంతా చెన్నై వరదల్లో గుర్తించిన సమస్యకు పరిష్కారం చుట్టూనే తిరుగుతుండేవి. ఉద్యోగం వద్దనుకొని అంకుర సంస్థ ఏర్పాటు దిశగా అడుగులు వేశాం. వస్తువులు కొనుగోలు చేయాలన్నా.. ఇంటికి ఏదైనా ఆర్డర్‌ ఇవ్వాలన్నా.. ఇంకా చాలా విషయాల్లో ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాం వినియోగిస్తున్నాం. దానం చేసేందుకూ ఇలాంటి వేదిక ఉంటే ఇరువురికి ఉపయోగకరంగానే కాదు పారదర్శకంగానూ ఉంటుందని ఆలోచించాం. దాతలకు తమ నిధులను ఎలా ఎక్కడ వినియోగించారనే సమాచారం ఎప్పటికప్పుడు తెలిపేలా డొనేట్‌కార్ట్‌ను క్రౌడ్‌ సోర్సింగ్‌ వేదికగా ఏర్పాటు చేశాం.
వేదిక కల్పిస్తాం..
పిల్లలు, వృద్ధులు, మహిళలు, విద్య, వైద్యం, జంతువులు ఇలా ఎన్నో అంశాలపై స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. అక్కడ ఉంటున్న వారి రోజువారీ జీవనానికి ఎన్నో వస్తువులు అవసరమవుతుంటాయి. ఏదైనా స్వచ్ఛంద సంస్థ తమను సంప్రదించినప్పుడు వారి అవసరాలను గుర్తించి వెబ్‌సైట్‌లో ప్రచారం(క్యాంపెయిన్‌) నిర్వహిస్తాం. ఆయా సంస్థల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే వేదికలో చోటు కల్పిస్తాం. ఇందుకోసం సామాజిక మాధ్యమాలు, ఆదాయపు పన్ను మినహాయింపు 80 జి సర్టిఫికెట్‌ ఇలాంటివన్నీ పరిశీలిస్తాం. ప్రస్తుతం చైల్డ్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ మహిళాదినోత్సవం పురస్కరించుకుని శానిటరీ నాప్‌కిన్‌ ప్యాక్‌ను బహుమతిగా ఇవ్వాలని కోరాయి. 25వేల నాప్‌కిన్‌లు అవసరం దాతలు బాగా స్పందించారు. అక్కడ ఉన్న వస్తువుపై క్లిక్‌ చేసి ఆ మేరకు సొమ్ము చెల్లిస్తే సరిపోతుంది.  ఆ వస్తువులను ఆయా సంస్థలకు చేరుస్తాం. దీంతో డబ్బులు సద్వినియోగం చేశారో? లేదో? అనే ఆందోళన ఉండదు. దాతలకు తమ సాయం ఎక్కడికిపోతుందో తెలుస్తుంది. 30 శాతం మంది దాతలు యు.ఎస్‌., యు.కె. నుంచి ఇస్తుంటారు. చాలామంది కొత్త దాతలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటివరకు 300 క్యాంపెయిన్లు నిర్వహించి రూ. 1.5 కోట్ల విలువైన సామగ్రిని అవసరమైన వారికి అందజేశాం. మహారాష్ట్రలోని ఒక మారుమూల ప్రాంతంలో మహిళలు ప్రసవం కోసం 40 కి.మీ. నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడ ఒక డెలివరీ టేబుల్‌ కావాలని కోరితే దాతల సాయంతో వారికి అందజేశాం. ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. 30 శాతం వరకు తెలుగు రాష్ట్రాల్లోని సంస్థలు సాయం పొందాయి. ప్రభుత్వ పాఠశాలకు శానిటరీ నాప్‌కిన్స్‌, మంజులత రైస్‌బకెట్‌ ఛాలెంజ్‌, మహిళలకు కుట్టుమిషన్లు ఇలా తమ వేదిక ద్వారా దాతల తోడ్పాటుతో అవసరమైన వారికి అందజేస్తున్నాం.’’

పురస్కారంతో గుర్తింపు..

సమాజ హితం పెంపొందించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా వినియోగించేలా చేసినందుకు డొనేట్‌కార్ట్‌కు తాజా అవార్డుతో మరింత గుర్తింపు దక్కింది. నాస్కామ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ విభాగంలో విజేతగా నిలవడంతో మా సంస్థకు క్రెడిబులిటీ వచ్చిందని భావిస్తున్నాం. అవార్డుకు ఎంపిక కావటం ద్వారా నాస్కామ్‌ నుంచి ఏడాదిపాటు మెంటరింగ్‌ లభిస్తుంది. అది మా సంస్థకు మరింత ఉపయోగపడుతుంది. కేటీఆర్‌ అవార్డు బహూకరించడమే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కలిసి పనిచేద్దామన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ను కలవమన్నారు. ఒక క్యాంపెయిన్‌ సిద్ధం చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మరింత మందికి  www.donatekart.com వేదిక ద్వారా పారదర్శకంగా సేవలు అందాలని కోరుకుంటున్నాం.

- మల్లేపల్లి రమేశ్‌రెడ్డి, ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని