తల్లిదండ్రులు టీచర్లు విద్యార్థి ఓ ఆప్‌

విశ్వనాథ్‌, నిశాంత్‌, అవినాశ్‌రెడ్డి... ముగ్గురూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. అయితే, వారి.....

Published : 17 Mar 2018 01:25 IST

తల్లిదండ్రులు టీచర్లు విద్యార్థి ఓ ఆప్‌
అంకురార్పణ

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ...
ప్రతి విద్యార్థినోట పలికించే చదువుల శ్లోకం... ఈ శ్లోకానికి టెక్నాలజీ హంగులు అద్దారో ముగ్గురు యువకులు! అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడున్న మార్కెట్‌ చదువుల్లోకి ఆ శ్లోక సారాంశానికి కొత్త అర్థాన్ని ఇస్తున్నారు...పిల్లల చదువుల్లో వారి పాత్రని పూర్తిస్థాయిలో పోషించేందుకు ఓ ప్రత్యేక టెక్నాలజీ వేదికను సిద్ధం చేశారు. అదే ‘రిగ్నో’ మొబైల్‌ ఆప్‌.
విశ్వనాథ్‌, నిశాంత్‌, అవినాశ్‌రెడ్డి... ముగ్గురూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. అయితే, వారి చదువుల కాలం ఎలా గడిచిందో ఏమోగానీ... నేటి కాలం చదువులపై లోతుగానే ఆలోచించారు. లక్షల సంపాదన వదులుకుని రిగ్నో ఆవిష్కరణ వైపు అడుగులు వేశారు. వారి ప్రధాన ఉద్దేశం ఒక్కటే... విద్యాలయాలు, గురువులు, విద్యార్థులకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూరించడం. ఎందుకంటే... నేటి చదువుల ప్రపంచంలో పిల్లలకు గురువులు, తల్లిదండ్రులతో సరైన సత్సంబంధాలు లేకపోవడమే. ‘మంచి స్కూల్‌లో చేర్పించాం కదా... వాళ్లే చూసుకుంటారులే’ అని తల్లిదండ్రులు... ‘క్లాసులో పాఠాలు  బోధించడంతోనే మా పని ముగిసిందనుకునే’ ఉపాధ్యాయులు... ‘చెప్పిందేదో ముక్కున పట్టి చీదేస్తే పోతుందనుకునే’ విద్యార్థులు... వీరందని మైండ్‌సెట్‌ని మార్చేలా వినూత్నమైన ఫ్లాట్‌ఫామ్‌ని సిద్ధం చేశారు. పిల్లలు స్కూల్‌కి వెళ్లింది మొదలు... వచ్చేంత వరకూ ఆప్‌ సాయంతో మానిటర్‌ చేయవచ్చు.

ఓ స్కూల్‌మేట్‌లా...
విద్యార్థులు తమ స్కూల్‌లోని తోటి విద్యార్థులు,  ఉపాధ్యాయులతో నెట్‌వర్క్‌ని క్రియేట్‌ చేసుకునేలా రిగ్నోని రూపకల్పన చేశారు. వారి స్కూల్‌ నెట్‌వర్క్‌లో తల్లిదండ్రులూ భాగస్వాములు కావొచ్చు. విద్యార్థులు నేడు విధిగా ఫాలో అవుతున్న సోషల్‌ మీడియా మాదిరిగానే ఇదీ పని చేస్తుంది. అంటే... గుర్తు తెలియని వ్యక్తులతో కాకుండా ఒకే గూటి పక్షులతో చదువుల స్నేహాన్ని కోరొచ్చు. క్లాస్‌ రూం టీచర్లని ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో యాక్సెస్‌ చేయవచ్చు. పేరొందిన పాఠశాలల్లో ఏర్పాటు చేసుకునే క్లబ్బుల్ని ఆప్‌లో రోజూ నిర్వహించొచ్చు. దీంతో ఎప్పటికప్పుడు పిల్లలు వారిలోని సృజనాత్మక కోణాల్ని ఆవిష్కరించొచ్చు. మార్కుల కోసం మాత్రమే ఆరాటపడకుండా పిల్లల మానసిక ఎదుగుదలకి దోహదపడేలా తల్లిదండ్రులు తమ ప్రోత్సాహాన్ని ఎల్లప్పుడూ అందించొచ్చు. ఉపాధ్యాయులు కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా విద్యార్థులతో ఎప్పుడైనా ఆసక్తికరమైన డేటా షేర్‌ చేయవచ్చు.
ఆసక్తికి చేయూత...
విద్యార్థులు వారి ఆసక్తిమేరకు ‘రెగ్నో ఎక్స్‌ప్లోర్‌’లో డేటాని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఆసక్తుల్ని గమనించిన ఉపాధ్యాయులు వారికి సరిపడే డేటాని విద్యార్థులతో పంచుకోవచ్చు. అంతేనా... స్కూల్‌ సిలబస్‌,  ఈవెంట్‌లు, ఇతర సమాచారాన్ని రిగ్నో నుంచే ఫాలో అవొచ్చు. దీంతో తల్లిదండ్రులు స్కూల్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి అభిప్రాయాల్ని యాజమాన్యంతో పంచుకోవచ్చు.

స్కూల్‌బోర్డు: విద్యార్థులు సాధించిన విజయాలు, క్రియేటివ్‌ వర్క్‌లను టీచర్లు షేర్‌ చేస్తారు.

డిస్కషన్స్‌: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రొగ్రెస్‌పై చర్చలు జరపొచ్చు. తమ నుంచి ఏం కోరుకుంటున్నారో చర్చించుకుని చదువులోనే కాకుండా మానసిక ఎదుగుదలకి తోడ్పాటు అందించొచ్చు.

బస్‌ ట్రాకింగ్‌: రోజూ పిల్లల్ని తీసుకెళ్లే స్కూల్‌ బస్సులు ఆప్‌ నుంచే మానిటర్‌ చేయవచ్చు.
ఇతర వివరాలకు: http://www.rigkno.com

- వాజేంద్ర బహద్దూర్‌, నారాయణగూడ, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు