వింటే ఒత్తిడి చిత్తవుతుంది!

... గుర్తొస్తున్నాయి కదూ! స్కూల్‌ డేస్‌లోనో... కాలేజీ రోజుల్లోనో... ఆఫీస్‌ కేఫ్టేరియాలోనో... మీరు అచ్చం ఇలాగే. ఫన్నీగా ఎన్నో చేసుంటారు. కానీ, మీకు తెలుసా? అవన్నీ కేవలం ఫన్నీ మాత్రమే కాదు. ఈ రకమైన ప్రవర్తన, శరీర కదలికలూ మానసిక ఒత్తిడికి మందులుగా....

Published : 17 Mar 2018 01:39 IST

ఒంటికో భాష ఉంది
వింటే ఒత్తిడి చిత్తవుతుంది!
ఉరకలేసే వయసుకి...

45 నిమిషాల క్లాస్‌ అయ్యిందో లేదో... మాష్టారు గదిని వీడకముందే...
చేతులు రెండూ పైకి లేస్తాయి...
హాయిగా ఒళ్లు గాల్లోకి విచ్చుకుంటుంది... ఎంత రిలాక్సో!!

4 పేజీల నోట్స్‌ రాయడం అయ్యిందో లేదు... పెన్ను ముక్కు పళ్ల మధ్యకి చేరిపోతుంది...
పళ్ల మధ్య ఏదో పని ఉన్నట్టుగా తిరుగుతుంది... అప్పుడా ముఖ కవళికల్లో మజానే వేరు...

వింటున్న విషయం బుర్రకెక్కడం లేదు... తల అడ్డంగా ఊపితే బాగోదు..
నిలువుగా ఆడిస్తే అర్థమైందనుకుంటారు..
టెన్షన్‌ దేనికి? ఆపకుండా తలాడిస్తుంటే ఆ కమిట్‌మెంటే వేరు!!

హాలంతా నిశ్శబ్దం... కాఫీ సిప్‌ చేస్తూ ఫోన్లకు అతుక్కుపోయారు అందరూ...
ఓ ఇద్దరు మాత్రం పగలబడి నవ్వుతున్నారు...
అందరి చూపు వారిపైనే.. వాళ్లకు అదేం పట్టలేదు. ఎందుకంటే... ఆ 10 నిమిషాలు బ్రేక్‌ టైం!

... గుర్తొస్తున్నాయి కదూ! స్కూల్‌ డేస్‌లోనో... కాలేజీ రోజుల్లోనో...  ఆఫీస్‌ కేఫ్టేరియాలోనో... మీరు అచ్చం ఇలాగే. ఫన్నీగా ఎన్నో చేసుంటారు. కానీ, మీకు తెలుసా? అవన్నీ కేవలం ఫన్నీ మాత్రమే కాదు. ఈ రకమైన ప్రవర్తన, శరీర కదలికలూ మానసిక ఒత్తిడికి మందులుగా పని చేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచంలోని ప్రముఖమైన విశ్వవిద్యాలయాల్లో చేసిన సర్వేలు, విశ్లేషణలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అయితే, నేటి తరం ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’లో ఇవి కేవలం ‘నాస్టీ థింగ్స్‌’గా పరిగణిస్తే ఒత్తిడి ఎప్పుడూ వై-ఫైలా వెంటే తిరుగుతుంది. బయటపడేందుకు ఎన్ని పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ఆప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసినా ఫోన్‌ ఇంటర్నల్‌ మెమొరీ నిండుతుంది తప్ప... మెదడు మూడ్‌ని మార్చలేవు. అందుకే ఒత్తిడిని చిత్తడి చేసే శరీర భాషని అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. మీతో మీరు... మీలో మీరు! కాస్త నిశితంగా పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. సమస్య చిన్నదైనా... పెద్దదైనా... సింపుల్‌గా  ఆలోచనా దృక్పథాన్ని మార్చేయవచ్చు. అందుకు మీరేం చేయాలంటే?

శక్తిని నింపుకొనేందుకు... ‘హై పవర్‌ పోజ్‌’

  న్నత చదువుల్లో... ఉద్యోగాల్లో అనుకోకుండా ఒత్తిడి ఆవహిస్తుంది. భుజాలు కుంగిపోయి... కుర్చీలో కూలబడినట్లుగా... టేబుల్‌పై వాలిపోయినట్టుగా అయిపోతారు. అలాంటి సందర్భాల్లో ‘హై పవర్‌ పోజ్‌’ని ఆవాహనం చేసుకుంటే మంచి ఫలితాల్ని పొందొచ్చని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. బలంగా ఊపిరి తీసుకుని హై పవర్‌ పోజులోకి వస్తే చాలు... కేవలం రెండు నిమిషాల్లోనే అధిక స్థాయిలో టెస్టోస్టీరాన్‌ విడుదలై ఒత్తిడికి కారణమయ్యే కార్టిజోల్‌ హార్మోన్‌ ప్రభావాన్ని తగ్గిస్తుందని తేల్చారు.

మీ కౌగిలిలో మీరే... ‘హగ్‌ యువర్‌సెల్ఫ్‌’

 మీరంటే మీకెంత ఇష్టమో తెలియాలంటే? మిమ్మల్ని మీరు కౌగిలించుకోవాల్సిందే. అప్పుడే ఒత్తిడి మీ దరిచేరదు అంటున్నారు టెక్సాస్‌ విశ్వవిద్యాలయ మానసిక నిపుణురాలు క్రిస్టిన్‌ నెఫ్‌. మీరో ఒంటరనో... మిమ్మల్నెవరూ అర్థం చేసుకోవడం లేదనో... మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మీ కోసం మీరు ఉన్నారన్న విషయం గ్రహించాలి. మిమ్మల్ని మీరే కౌగిలించుకోవాలి. అప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ కార్టిజోల్‌ని నియంత్రిస్తుంది. దీంతో ఆందోళన స్థాయి తగ్గి గుండె రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి మనసుకి హాయిగా అనిపిస్తుంది.

ఇదో ఉపశమనం... ‘చాప్‌స్టిక్స్‌’

ళ్ల మధ్యలో ఇరుక్కున్న వాటిని తీసేందుకు వాడే పెన్ను, పెన్సిల్‌ ముక్కు మొదలుకుని సురక్షితమైన చాప్‌స్టిక్స్‌ వరకూ మానసిక ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం అందిస్తాయనేది కేన్సాస్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల మాట. వారి పరిశోధనలో భాగంగా కొందరికి చాప్‌స్టిక్స్‌ ఇచ్చి క్లిష్టమైన పనుల్లో వారి పని తీరుని గమనిస్తే చాప్‌స్టిక్స్‌ వాడిన వారిలో ఒత్తిడి స్థాయి తక్కువగా ఉన్నట్టు తేలింది.

దర్జాగా వెనక్కి... ‘షోల్డర్స్‌ బ్యాక్‌’

మెదడు ప్రభావం శరీరంపై ఏ స్థాయిలో ఉంటుందో... ఇదే మాదిరిగా శరీర భంగిమలూ మెదడును ప్రభావితం చేస్తాయన్నది శాస్త్రవేత్తల మాట. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఒళ్లు విరుచుకోవడం... లేదంటే రెండు చేతుల్నీ తల వెనక్కి పెట్టి బలంగా బిగించి పాజిటివ్‌ దృక్పథంతో ఆలోచిస్తే మెదడులో చురుకైన హార్మోన్లు విడుదలై ప్రశాంతంగా అనిపిస్తుందట.

చిందేయండి... ‘ఫైవ్‌ మినిట్‌ డ్యాన్స్‌ మూవ్‌’

మూడ్‌ బాలేదని ముడుచుకుని కూర్చుంటే ఎలా? కాలం మీ కోసం ఎదురు చూడదు. అందుకే ఓ ఐదు నిమిషాలు కాలంతో పాటే చిందేయండి. అంతే... మీలో హుషారు పుట్టుకొచ్చి తిరిగి రీఛార్జ్‌ అవుతారని యార్క్‌ అండ్‌ షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. దీంట్లో భాగంగా ఐదు నిమిషాలు మ్యూజిక్‌ ప్లే చేస్తూ కొందరిని వినమని... మరికొందరిని డ్యాన్స్‌ చేయమని కోరారు.. తర్వాత వారి మానసిక స్థితిని గమనిస్తే డ్యాన్స్‌ చేసినవారిలో  గణనీయమైన మార్పు కనిపించిందట.

తలూపండి... అంతే!... ‘నాడ్‌ యువర్‌ హెడ్‌’

మాధానం చెప్పేటప్పుడో... చర్చల్లోనో... కచ్చితమైన అవగాహన ఉంటేనే అవుననో... కాదనో చెప్పాలి. ఒకవేళ ఏవైనా సందేహాలు ఉన్నా... అయోమయంగా అనిపించినా... కంగారు పడి ఆందోళనకు లోను కాకుండా... తలని ఆపకుండా కిందికీ... పైకీ.. ఊపుతూనే ఉండాలి. దీంతో ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందట.ఒహైయో విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్ర నిపుణులు ఇదే చెబుతున్నారు.

వెన్ను నిటారుగా... ‘సిట్‌ అప్‌ స్ట్రైట్‌’

క్కడైనా జారబడి కూర్చుంటే అంతా నీరుగారే వాతావరణమే. నీరసం ఆవహించి మెదడు ఉత్తేజితం కాదు. అందుకే వెన్ను నిటారుగా ఉంచి కూర్చుంటే ఆత్మవిశ్వాసం పెరిగి మెదడు చురుకుగా పని చేస్తుందనేది మానసిక శాస్త్ర నిపుణుల మాట.

మీదైన నడక... ‘వాక్‌ హ్యాపీ’

ఖుషీ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌, భూమిక వెనక నడుస్తూ మాట్లాడే సంభాషణ ఎప్పటికీ మర్చిపోలేం! అక్కడ పవన్‌ నడకలో ఉత్సాహం, ఉత్సుకత కనిపిస్తుంది. మీ నడకలోనూ అంతే ఉత్సాహం ఉండాలి. అప్పుడే మనసంతా పాజిటివ్‌ ఆలోచనలతో నిండి ఉంటుందని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.

పొట్ట చెక్కలవ్వాలి... ‘బెల్లీ లాఫ్‌’

డుపారా నవ్వుకునేందుకు కారణాలు వెతుక్కోనక్కర్లేదు. హాయిగా నవ్వేయండి. మిత్రుల జోకులకు మెచ్యూర్డ్‌గా ప్రవర్తిస్తూ మితంగా నవ్వక్కర్లేదు. కడుపు చెక్కలయ్యేలా నవ్వండి. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరిగి ఒత్తిడి మాయం అవుతుందట. అందుకే ‘ఫేక్‌ స్మైల్‌’కి బాయ్‌ చెప్పేసి పగలబడి నవ్వండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని