గాల్లోంచి నీరు తీశారు వీరు

వీరందరినీ చూసి చలించారు ఈ యువకులు. ఈ బాధలు తీర్చడానికి.......

Published : 24 Mar 2018 01:24 IST

గాల్లోంచి నీరు తీశారు వీరు

నీళ్లు లేక.. నోళ్లు ఎండిన గ్రామాలెన్నో?కన్నీళ్లు తాగి.. దాహం తీర్చుకుంటున్న ఊర్లు ఎన్నో? శుద్ధ జలాల కోసం.. కి.మీ. వెళుతున్న జనాలెందరో?
వీరందరినీ చూసి చలించారు ఈ యువకులు. ఈ బాధలు తీర్చడానికి ఏమైనా చేయాలనుకున్నారు. గాలి నుంచి నీరు గ్రహించే పరికరం తయారు చేశారు. ‘ఉరవు’ పేరుతో అంకుర సంస్థను నెలకొల్పి వీరు ఆవిష్కరించిన ఈ పరికరానికి లాస్‌యాంజెల్స్‌ నుంచి నడిచే ఎక్స్‌ప్రైజ్‌ అనే సంస్థ బహుమతి ప్రకటించింది. టాటా గ్రూప్‌, ఆస్ట్రేలియన్‌ ఎయిడ్‌ సంయుక్తంగా ఈ బహుమతి కింద రూ.32 లక్షలు అందివ్వనున్నాయి. శ్రీవాస్తవ్‌, అమిత్‌, భరత్‌, సందీప్‌, వెంకటేశ్‌ అనే 5మంది ఔత్సాహిక కుర్రాళ్లు సాధించిన ఘనత ఇది.
నదులు, సముద్రాలు, చెరువులు, కాల్వలు, బోర్లు... ఇలా నీటి వనరులెన్నో చూశాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న గాలి నుంచి నీరు తోడుకొనే రోజులు రానున్నాయంటున్నారు ఈ యువత. 25 దేశాలు, 98 బృందాలు... ఇంతమంది పోటీపడినా మన హైదరాబాద్‌కు చెందిన ‘ఉరవు’ అంకుర సంస్థ తుది 5 బృందాల జాబితాలో స్థానం సంపాదించింది. ఈ అయిదు బృందాలకు ఒక్కొక్కరికీ రూ.32 లక్షలు అందిస్తారు. రెండో విడత పోటీలోనూ విజేతలైన వారికి 1.5 మిలియన్‌ డాలర్లు ఇచ్చి ప్రోత్సహిస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రమైంది. 2025 నాటికి ఇది ఉగ్రరూపం దాల్చి 350 కోట్ల మంది ప్రజలు జలం కోసం అలమటించే పరిస్థితి వస్తుంది. దీన్ని గుర్తించే మేం ఈ ఆవిష్కరణకు నడుంబిగించామని చెబుతారు ఈ కుర్రాళ్లు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన, భిన్నమైన సబ్జెక్టులు చదివిన ఈ అయిదుగురు కలిసి గాలిలోంచి నీరు తీసే పరికరాన్ని ఆవిష్కరించారు. మానవ జీవితంలో తలెత్తే అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనే నూతన ఆవిష్కరణలకు ఎక్స్‌ప్రైజ్‌ అనే సంస్థ పోటీలు నిర్వహించి... బహుమతులు అందిస్తుంటుంది. మన ‘ఉరవు’ సంస్థ ఇప్పుడు దీనికి ఎంపికైంది.
మెటిరియల్‌ సైన్స్‌, సౌరశక్తి ఆధారంగా ఈ పరికరం తయారు చేశారు. ఇందులో ఒక లీటర్‌ నీటి ఉత్పత్తికి రూ.1.50 ఖర్చు అవుతుంది. ఈ పరికరం పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. దీని తయారీకి రూ.30వేలు ఖర్చైందని, ఒక్కో పరికరం రోజుకు 10 లీటర్ల నీటిని గాలి నుంచి ఉత్పత్తి చేయగలదని ఈ బృందంలో ఒకరైన భరత్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని