అమ్మ కథలే నా పయనం

అమ్మ చెప్పిన కథలతో ఆసక్తి పెంచుకొని, సినిమా దర్శకుడు కావాలనుకొని....

Published : 31 Mar 2018 01:42 IST

అమ్మ కథలే నా పయనం

 అమ్మ చెప్పిన కథలతో ఆసక్తి పెంచుకొని, సినిమా దర్శకుడు కావాలనుకొని హైదరాబాద్‌ వచ్చిన హన్మకొండ కుర్రాడి కథ ఇది. 15ఏళ్లపాటు ఎన్నో కష్టాలకోర్చి... పరిశ్రమ చర్చించుకొనే చిత్రం తీసి మెప్పించిన ఆ కుర్రాడు వేణు ఊడుగుల. ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ... సగటు యువకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించి విజయం అందుకున్నాడు. వరంగల్‌ జిల్లాకు చెందిన ఈ కుర్రాడు తన  కష్టాల నుంచి ప్రేమ పెళ్లి, విజయం వరకూ ‘ఈతరం’తో పంచుకున్నారు.
‘నీది నాదీ ఒకే కథ’ సినిమాకు ఎన్నో ప్రశంసలు అందాయి. అలాగే కొన్ని విమర్శలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు?
వాటిని నేను స్వీకరిస్తున్నాను. ఇది ఒక తండ్రి లక్ష్యానికి, తన ఇష్టాలకు మధ్య నలిగిపోయే ఓ వ్యక్తి కథ. లక్ష్యాల పేరుతో పిల్లల స్వేచ్ఛను, వారి ఆశలను చంపేసే హక్కు ఎవ్వరికీ లేదు. అదే సినిమాలో చెప్పాను. గొప్ప లక్ష్యం లేకపోవచ్చు. అయితే జీవితం మనిషిని ఎలా తీసుకుపోతుందో చెప్పలేం కదా! ఇదీ నేటి తరంలో ఓ యువకుడి కథ. అందుకే అందరికీ నచ్చింది.
దర్శకుడిగా మారక ముందు ఏం చేశారు?
హన్మకొండలో ఒకసారి సిటీకేబుల్‌ వాళ్లు సీరియల్‌ తీస్తుంటే దానికి అసిస్టెంటుగా పనిచేశాను. తర్వాత ఎలాగైనా సినిమాలకు దర్శకత్వం చేయాలని హైదరాబాద్‌కు బయలు దేరాను. ఎలా పరిశ్రమలోకి వెళ్లాలో తెలియదు. కొరియర్‌ బాయ్‌గా, ఫ్యాక్టరీల్లో కార్మికుడిగా, ఓ బ్యాంక్‌లో... ఇలా చాలా పనులు చేశాను. లోక్‌సత్తా యాడ్స్‌కు మొట్టమొదటగా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించాను. త్రిపురనేని సాయిచంద్‌ గారు నన్ను ‘ఆ నలుగురు’ రచయిత మదన్‌ గారికి పరిచయం చేశారు.  రెండు సినిమాలకు అసోసియేట్‌గా పనిచేశాను. ఇక తర్వాత ఇలా... మీ ముందుకొచ్చాను.
ప్రయత్నాల్లో ఎలాంటి కష్టాలు పడ్డారు?
కొన్ని కథలు తీసుకొని 12 మందికి వినిపించాను. సినిమా చేద్దామని చెప్పి, తర్వాత పట్టించుకొనే వారు కాదు. ఈ కథను శ్రీవిష్ణుకు మొదట వినిపించాను. ఇద్దరం కలిసి నిర్మాతల కోసం తిరిగాం. ఒకరోజు నారా రోహిత్‌గారికి చెప్పాం. ఆయన చాలా ఇంప్రెస్‌ అయ్యారు. ఈ కథను ఎలాగైనా తీయాలని నిశ్చయించుకున్నారు. ప్రశాంతి, కృష్ణ విజయ్‌, నారా రోహిత్‌, శ్రీవిష్ణు కలిసి దీన్ని నిర్మించారు. ఇంత మంచి నిర్మాతలు దొరకడం నా అదృష్టం.
మీలో విశ్వాసం పెంచిన ప్రశంస?
సినిమా మొత్తం పూర్తయ్యాక ఒక పెద్ద నిర్మాతకు చూపించాం. ఆయనకు నచ్చలేదు. ఇది ఆడదని చెప్పేశారు. నాకూ, నా బృందానికి ఏం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా డీలా పడిపోయాం. ఆ నైరాశ్యం నుంచి తేరుకొని మదన్‌, శేఖర్‌కమ్ముల, దేవకట్టా గారికి సినిమా చూపించాం. వారికి బాగా నచ్చింది. అప్పుడు వారిచ్చిన ప్రోత్సాహం మరిచిపోలేనిది. ఒక రకంగా మాకు మళ్లీ ప్రాణం పోశారు వాళ్లు. తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ గారు, దర్శకుడు తేజగారు ఎంతగానో మెచ్చుకున్నారు.
మీ ఈ ప్రయాణంలో బాగా బాధ పెట్టిన సంఘటన?
మానాన్న నా విజయం కోసం ఎంతగానో ఎదురుచూశారు.  సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరిగేటప్పుడు నాన్నకు సీరియస్‌ అయ్యింది. వెంటనే బయలుదేరి వెళ్లాను. ఇంటికి వెళ్లే సరికి రాత్రి 10గంటలైంది. అప్పటికి నాన్న మాట్లాడలేకపోయి రెండు రోజులైంది. నాన్న నా వైపు చూశారు. సినిమా రిలీజ్‌ ఎప్పుడని అడిగారు. జరీనా వచ్చిందా అని ప్రశ్నించాడు. అంతే అవే చివరి మాటలు. నా విజయం కోసం ఎదురుచూసిన నాన్న సినిమా రిలీజ్‌కు 10 రోజుల ముందే ప్రాణాలు విడిచారు.

నాది వరంగల్‌ జిల్లా చెన్నారావు పేట మండలం, ఉప్పరపల్లి. నాలుగో తరగతి వరకూ అక్కడే చదివాను. తర్వాత నా చదువు హన్మకొండలో మా పెద్దన్నయ్య నడిపే స్కూల్‌లో జరిగింది. నాన్న కొమ్మాలుగౌడు సర్పంచిగా పనిచేశారు. మా అమ్మ అమృతమ్మ. అమ్మ రాత్రిపూట నాకు చెప్పే కథలే నన్ను చాలా మార్చాయి. ఆ కథల్లోని ఆత్మ నన్ను ఇప్పటికీ వెంటాడుతుంటుంది. ఆరుబయట వెన్నెల్లో పడుకొని, చుక్కలు, మేఘాల గురించి ఫాంటసీ కథలు ఎంతో చక్కగా చెప్పేది. అవే నన్ను ఈ వైపు నడిపాయి.
నేను హైదరాబాద్‌లో ఓ యాడ్‌ కంపెనీలో పనిచేసేటప్పుడు జరీనా నాకు పరిచయం అయ్యింది. మంచి స్నేహితులమయ్యాం. తర్వాత ప్రేమించుకున్నాం. తను నన్ను బాగా అర్థం చేసుకొంటుంది. ఇటీవలే పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకొన్నాం. ఇంకా పిల్లలు లేరు. నా ఈ విజయంలో సగం జరీనాదే. నన్ను ప్రతీక్షణం ప్రోత్సహిస్తుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని