సాయానికో పరుగు

రన్‌లు, మారథాన్‌లు స్ఫూర్తి చాటుతూ సాగుతాయి. ఈ కుర్రాడి మారథాన్‌ సాయం చేస్తూ నడుస్తుంది. అందుకే ఇది ప్రత్యేకం. స్పెయిన్‌కు చెందిన జువాన్‌ మానువెల్‌ వైరా.. ఓ అథ్లెట్‌. ఓ సారి మన దేశానికి పర్యాటకుడిగా వివిధ ప్రాంతాలు తిరుగుతూ...

Published : 07 Apr 2018 01:20 IST

జై ‘జువాన్‌’
సాయానికో పరుగు

రన్‌లు, మారథాన్‌లు స్ఫూర్తి చాటుతూ సాగుతాయి. ఈ కుర్రాడి మారథాన్‌ సాయం చేస్తూ నడుస్తుంది. అందుకే ఇది ప్రత్యేకం. స్పెయిన్‌కు చెందిన జువాన్‌ మానువెల్‌ వైరా.. ఓ అథ్లెట్‌. ఓ సారి మన దేశానికి పర్యాటకుడిగా వివిధ ప్రాంతాలు తిరుగుతూ... అనంతపురం జిల్లాలో ఆర్డీటీ చేపడుతున్న కార్యక్రమాలను చూశాడు.  ముగ్ధుడయ్యాడు. తన వంతుగా ఇక్కడ ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. స్పెయిన్‌ వాసులనే కాకుండా, స్థానికులను కలుపుకొని మారథాన్‌ నిర్వహిస్తున్నాడు. ఈ మార్గంలో ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుడుతున్నాడు.

పిల్లల దత్తతతో మొదలు: తొలుత 2016లో 143 కి.మీ. పరుగు (మారథాన్‌)లో ఒక్కడే పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కిలోమీటర్‌కు ఒకరు చొప్పున 143 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్నాడు. వారికి అవసరమైన విద్య, ఆహారం, దుస్తులు వంటివి సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలను, దీని ఉద్దేశాన్ని స్వదేశానికి వెళ్లి స్నేహితులు, తెలిసినవాళ్లు, వివిధ సంస్థలకు తెలియజేయడంతో సాయం చేసేందుకు వారు ముందుకొచ్చారు. వాటిని ఆర్డీటీకి తెప్పించి ఆ పిల్లలకు అందేలా చేశాడు.  2017 జనవరిలో 150 కి.మీ. పరుగు నిర్వహించాడు. అందులో కొందరు స్పెయిన్‌కు చెందిన వాళ్లు, అనంతపురానికి చెందిన అథ్లెట్లు సైతం పాల్గొన్నారు. ఈసారి గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించాడు. వారికి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయించాడు. ఈ ఏడాది తాజాగా పరిగి మండలంలోని యర్రగుంట గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాడు. అక్కడి 36 నిరుపేద కుటుంబాలకు ఇళ్లు నిర్మించడం, గ్రామంలో సిమెంట్‌ రహదారులు, వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం, గ్రామంలో విద్యుత్‌ వెలుగులు కల్పించాలనుకున్నాడు. ఇందుకు అతనితోపాటు మరో 51 మంది స్పెయిన్‌ దేశీయులు, 24 మంది అనంత జిల్లా అథ్లెట్లు కలిపి మూడో అల్ట్రా మారథాన్‌లో పాల్గొన్నారు. త్వరలో ఆ సౌకర్యాలు కల్పించే పనిలో ఉన్నాడు.

- వడ్డాది మహేశ్‌, ఈనాడు, అనంతపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని