క్యూబక్స్‌...టైమ్‌పాస్‌కీ డబ్బులు

కొత్తగా ఇంకేదో చేయాలనే ధ్యాసకు.. ఇంట్లో వాతావరణమే వేదికయ్యింది భార్య, అమ్మా, నాన్న విశ్లేషణలు తోడయ్యాయి అంతే... ఊసుపోక చేసే టైమ్‌పాస్‌కి విలువొచ్చింది. ‘క్యూబక్స్‌’ అనే అంకురసంస్థ పుట్టుకొచ్చింది. ఇది తన ఇష్టసఖి ఐడియానేనని... కష్టపడి రూపాన్ని ఇచ్చానని చెబుతున్నారు నాగేశ్‌ జూలూరి.. మొదటి అడుగుతోనే రెండు లక్షల యూజర్‌ బేస్‌కి చేరిన క్యూబక్స్‌ అంకుర సంస్థ కహనీని ఈ-తరంతో పంచుకున్నారు...

Published : 14 Apr 2018 02:10 IST

అంకురార్పణ

క్యూబక్స్‌ టైమ్‌పాస్‌కీ డబ్బులు


కొత్తగా ఇంకేదో చేయాలనే ధ్యాసకు..
ఇంట్లో వాతావరణమే వేదికయ్యింది
భార్య, అమ్మా, నాన్న విశ్లేషణలు తోడయ్యాయి
అంతే... ఊసుపోక చేసే టైమ్‌పాస్‌కి విలువొచ్చింది.
‘క్యూబక్స్‌’ అనే అంకురసంస్థ పుట్టుకొచ్చింది.
ఇది తన ఇష్టసఖి ఐడియానేనని...
కష్టపడి రూపాన్ని ఇచ్చానని చెబుతున్నారు నాగేశ్‌ జూలూరి..
మొదటి అడుగుతోనే రెండు లక్షల యూజర్‌ బేస్‌కి చేరిన క్యూబక్స్‌ అంకుర సంస్థ కహనీని ఈ-తరంతో పంచుకున్నారు...

నాన్న విశ్రాంత ఉద్యోగి. అమ్మ ఇంట్లోనే. భార్య వినుత. పిల్లల సంరక్షణ నిమిత్తం తనూ ఇంట్లోనే. పనులన్నీ ముగించుకున్నాక అమ్మా, నాన్న టీవీ. నా వైఫ్‌ ఏమో యూట్యూబ్‌. ఎప్పుడూ ఇదే తంతు. ఇవి లేకుండా వారికి పొద్దు పోదు. పైసా ఉపయోగం ఉండదని మనసులో అనుకునే వాడిని. ఒక్కోసారీ... వినిపించేలా కూడా! నా మాటలతో భార్య ఆలోచనలో పడినట్టుంది. ఓ రోజు తన ఆలోచనను నాతో పంచుకుంది. గంటల కొద్దీ చేసే ఈ టైమ్‌పాస్‌కి విలువ కట్టే మార్గం ఉంటే బాగుంటుందని. తనూ చదువుకున్న అమ్మాయే కావడంతో ఆలోచనకు సాన పెట్టింది. నాకూ నిజమే అనిపించింది. ఇద్దరం ఎన్నో ఆలోచనలు చేశాం. పేరెంట్స్‌తోనూ చర్చించాం. ఎంబీఏ ఫైనాన్స్‌ చదివిన వినుత టైమ్‌పాస్‌కీ విలువ కట్టాలనుకుంది. పాయింట్స్‌తో పోటీ పెడితే బాగుంటుందని సూచించింది. సంపాదించిన పాయింట్స్‌ని డిజిటల్‌ కరెన్సీగా మార్చుకుంటే ఇంకెప్పుడూ నా నోట ఎన్నో సార్లు విన్న ‘ఊరికే ఎందుకిలా టైమ్‌పాస్‌’ అన్న మాటలు ఇక వినిపించవంది. ఇంకేముందీ... నా బుర్రకు పని పడింది. మరో ముగ్గురితో బృందంగా ఏర్పడి తన ఆలోచనకి రూపు తీసుకొచ్చా. అదే ఈ ‘క్యూబక్స్‌’.
 


ఇదో మొబైల్‌ యాప్‌
సినిమాలు, వార్తలు అంటే.. ఒకప్పుడు టీవీలు. ఇప్పుడంతా మొబైళ్లే. వీడియో కంటెంట్‌ అంతా మొబైల్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయ్‌. డేటా ప్యాక్‌లు ఎంత చౌకయ్యాయో చెప్పక్కర్లేదు. ఇంటా, బయటా అందరూ మొబైల్‌తోనే జట్టు. మరోవైపు యూట్యూబ్‌ ఏమో హిట్టు. కుర్రోళ్లు, పెద్దోళ్లు, ఉద్యోగులు, వ్యాపారులనే తేడా లేకుండా గంటల కొద్దీ యూట్యూబ్‌లోనే టైమ్‌పాస్‌. కొందరు న్యూస్‌... ఇంకొందరు జబర్దస్త్‌ లాంటి ఫన్‌ ప్రొగ్రామ్‌లు. ట్రైలర్లు... ఇంటర్వ్యూలు... చూసేస్తున్నారు. యూజర్లు చూడడం వల్ల కంటెంట్‌ ప్రొఫైడర్లకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయ్‌. కానీ, బోల్డంత సమయం వెచ్చింది చూస్తున్న ప్రేక్షకుడికి ఏంటి ఉపయోగం? ఇవన్నీ ఉత్తినే ఎందుకు చూడాలి అనుకునేవారికి ‘క్యూబక్స్‌’ యాప్‌ ప్రత్యేకం. వీడియో చూస్తూ కింద వచ్చే క్విజ్‌లో పాల్గొనొచ్చు. సరైన జావాబులిస్తూ పాయింట్స్‌ని జమ చేసుకోవచ్చు. ఎకౌంట్‌లో జమైన పాయింట్స్‌ని డిజిటల్‌ కరెన్సీగా మార్చుకోవచ్చు. ఇప్పటికైతే పేటీఎం వాలెట్‌ని యాప్‌ సపోర్ట్‌ చేస్తుంది. అవసరం మేరకు వాలెట్‌లోకి పాయింట్స్‌ని రీడీమ్‌ చేసుకుని క్యాష్‌గా మార్చుకోవచ్చు. ఆప్‌లో ఎక్కువ సమయం వీడియోలు వీక్షిస్తూ... క్విజ్‌లో పాల్గొనేవారికి బోనస్‌ పాయింట్లు అదనం. అలాగే, యాప్‌లోకి ఇతరుల్ని  ఆహ్వాస్తే మరిన్ని పాయింట్లు వస్తాయి. మీ నుంచి ఆహ్వానం పొందినవారు యాప్‌లో చేస్తున్న స్కోర్‌ ఆధారంగా మీకూ రోజూ బోనస్‌ పాయింట్స్‌ వస్తాయి. సినిమా టికెట్లు, ఆహారానికి సంబంధించిన పలు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ని యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నారు. ‘షేర్‌’ ఆప్షన్‌తో పాయింట్స్‌ని ఇతరులకు షేర్‌ చేయవచ్చు. క్విజ్‌ని తెలుగు, హిందీ భాషల్లోకి మార్చుకుని చదువుకోవచ్చు.
 

నిశిత పరిశీలన
ఈ తరహా క్విజ్‌లో యూజర్లు వీడియోలను నిశితంగా చూస్తారు. ఉదాహరణకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌కి సంబంధించిన వీడియో చూస్తున్నప్పుడు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా విని కింది ప్రశ్నలకు జవాబులిస్తారు. దీంతో ఇంగ్లిష్‌ త్వరగా నేర్చుకోవచ్చు. జనరల్‌ నాలెడ్జ్‌ వీడియోలను చూసేటప్పుడు క్విజ్‌ ద్వారా మెదడుకి సాన పెట్టుకోవచ్చు. ఆసక్తుల మేరకు యాప్‌లో వీడియోలను బ్రౌజ్‌ చేయవచ్చు. అందుకు పలు విభాగాలు ఉన్నాయి. వీడియో కంటెంట్‌ ప్రొవైడర్లు వారి వీడియోలకు వ్యూస్‌ని ఎంచుకునేందుకు క్యూబక్స్‌ని ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్‌లా వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే నుంచి యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.
యాప్‌ డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/fqbcRv

డిగ్రీతోనే సంప్రదాయ చదువులకు స్వస్తి చెప్పేశా. హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడంతో నగరమే నాకు అన్నీ నేర్పింది. నెట్‌లింక్స్‌, సత్యం, టెక్‌ మహేంద్రా... ఇలా పలు కంపెనీల్లో ఉద్యోగాలు, స్వయంగా కొన్ని వ్యాపారాలు చేశా. ‘జెస్ట్‌ రీచ్‌’ పేరుతో కొన్నేళ్ల ముందే స్టార్టప్‌ రేస్‌లోకి వచ్చాను. బృందంగా ఏర్పడి ఐటీ సర్వీసెస్‌ని అందిస్తున్నాం. ఇప్పుడు వినూత్న ఆలోచనతో ‘క్యూబక్స్‌’. స్టార్టప్‌ల రేస్‌లో నిలబడి నెగ్గుకు రావాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి. రాత్రికి రాత్రే అద్భుతాలు చేయాలి అనుకునేవారు స్టార్టప్‌ల నిర్వహణకి అర్హులు కాదు. సక్సెస్‌ సాధించనవాటినో... ఏదైనా సక్సెస్‌ ఫార్ములాని నమ్ముకునో అంకురాల్ని స్థాపిస్తే నెట్టుకురాలేరు. సరైన బృందం... ఛాలెంజ్‌లను ఎదుర్కొనే ధైర్యం ఎంతైనా అవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని