అమ్మాయి... ఆమెగా అబ్బాయి.. అతనుగా

ఓ పదిహేడేళ్లు వ్యర్థమైపోయినట్టు... అప్పుడే కొత్తగా పుట్టినట్టు... కలల్నే భోజనంగా ఆరగిస్తూ... ఓ కొత్త ప్రపంచంలోకి ప్రయాణం... ఇంటర్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ వైపు... పంజరం నుంచి స్వేచ్ఛలోకి... పయనించినట్లు! అక్వేరియం నుంచి సాగరంలోకి... దూకినట్లు...! కొత్త అలవాట్లు, కొత్త స్నేహాలు. ‘మేం వయసుకి వచ్చాం’... అని... యువత సొంత జెండా. ‘మేం చేసేదే ట్రెండ్‌... మేం చూసేదే వరల్డ్‌...’ అని కొత్త అజెండా....

Published : 05 May 2018 01:45 IST

అమ్మాయి... ఆమెగా అబ్బాయి.. అతనుగా

ఓ పదిహేడేళ్లు వ్యర్థమైపోయినట్టు... అప్పుడే కొత్తగా పుట్టినట్టు... కలల్నే భోజనంగా ఆరగిస్తూ... ఓ కొత్త ప్రపంచంలోకి ప్రయాణం... ఇంటర్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ వైపు... పంజరం నుంచి స్వేచ్ఛలోకి... పయనించినట్లు! అక్వేరియం నుంచి సాగరంలోకి... దూకినట్లు...! కొత్త అలవాట్లు, కొత్త స్నేహాలు. ‘మేం వయసుకి వచ్చాం’... అని... యువత సొంత జెండా. ‘మేం చేసేదే ట్రెండ్‌... మేం చూసేదే వరల్డ్‌...’ అని కొత్త అజెండా.* ‘అమ్మా నాకేం కావాలో నీకే బాగా తెలుసు!’ అని ముద్దుగా మాట్లాడే కూతురు... ‘నాకేం కావాలో నాకు తెలుసు. నన్ను ఎంచుకోనివ్వు’ అంటుంది.
* ‘నాన్నా నాకు ఈ డ్రస్‌ కొనిస్తావా?’ అని వేలు పట్టుకుని క్యూట్‌గా అడిగిన కొడుకు ‘నాకు అన్నీ ఫలానే బ్రాండే కావాలి. లేకుంటే నాకొద్దు’ అని డిమాండ్‌ చేస్తాడు.
* ‘నాన్నకి చెప్పు ఈ వీకెండ్‌... అందరం కలిసి వెళ్దాం.’ అని గోముగా అడిగే  పిల్లలు... ‘నేను ఫ్రెండ్స్‌తో ఔటింగ్‌కి వెళ్తున్నా... లాంగ్‌రైడ్‌.’ అని ముఖంపైనే చెప్పేస్తారు.
బ్బాయి... అతనైపోతున్న వేళ.. అమ్మాయి... ఆమెలా మారుతున్న వేళ... కొత్త ఆలోచనలు రెక్కలు కట్టుకొని ఆకాశంలో చుక్కల వేటకు బయలుదేరుతున్న నవ యువత. ఇంటర్‌ నుంచి ఇంజినీరింగ్‌, డిగ్రీల్లో చేరే పిల్లల్లో వచ్చిన మార్పులకు కారణమేంటి? పుడుతున్న స్వతంత్ర భావాలకు ప్రేరణేంటి?
పంజరం నుంచి స్వేచ్ఛలోకి
ప్రెషర్‌ కుక్కర్‌ చదువుల్లో పేరెంట్స్‌కి నచ్చేదేంటి? మార్కులు. ఎందుకంటే... పిల్లల భవిష్యత్తుని దాంట్లో చూస్తారు. ఈ మార్కుల పోరాటాలు దాటి.. ర్యాంకుల పోటీల్లో గెలిచాక పిల్లలు కోరుకునేది కాసింత స్వేచ్ఛ.  రెండేళ్ల పోరాటంలో ఏదో సాధించినట్టు... పేరెంట్స్‌ కోరిందేదో ఇచ్చేసినట్టు భావన. దీంతో స్వేచ్ఛని వారికి వారే ప్రసాదించుకుని స్వతంత్రులం అయ్యామనుకుంటారు. దేన్నైనా అడగడం మానేస్తారు. డిమాండ్‌ చేస్తారు. నాకు ఫలానా బ్రాండ్‌ మొబైల్‌, వాచ్‌, దుస్తులు కావాలనో... బైకు కొనివ్వాలనో... ఇలా ప్రతీదీ డిమాండే. ఇక అప్పుడప్పుడే బయటి ప్రపంచంతో కనెక్టు అవుతారు. పరిధి పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో స్నేహం. వారి ఆసక్తుల్ని సరిపోల్చుకుంటూ వారి  మాటలకూ... చేష్టలకూ ప్రభావితం అవుతారు. దీంతో రామబాణంలా పని చేసిన  తల్లిదండ్రుల మాటలు నచ్చవు. ‘నీకేం తెలియదమ్మా... ఊరుకో.. నాన్నా..’ అంటూ పెద్దవాళ్లను చిన్నబుచ్చుతుంటారు. ఏం పట్టనట్టుగా పక్క నుంచే వెళ్లిపోవడం అలవాటు చేసుకుంటారు. పెద్దలంటే నచ్చక కాదుగానీ... చెప్పేవి నచ్చక. చెప్పే విధానం ఒప్పక. ఇన్నేళ్లపాటు అన్నీ తామై పెంచిన పేరెంట్స్‌తో పంచుకోనివి ఆన్‌లైన్‌లో దగ్గరైన వారికి షేర్‌ చేయడం ఉన్నతమైందిగా భావిస్తారు. ఇవే కాదు... జుట్టు స్టైల్‌తో పాటు కట్టు..  బొట్టూ మారిపోతుంది. ఈ టీనేజ్‌ ‘మిస్టరీ’ని దాటుకుని ‘మిస్టర్‌’ అడల్ట్‌గా మారే క్రమంలో మరెన్నో కోణాలు. వారిని వారు సరికొత్తగా ఆవిష్కరించుకోవడంలో... అప్పటి వరకూ ఉన్న పరిస్థితుల్ని పట్టించుకోరు. ఇవన్నీ నిశితంగా గమనించే తల్లిదండ్రులు ఒత్తిడికి గురికాకుండా పిల్లలే క్రిస్టల్‌ క్లియర్‌ సమాధానాలు కావాలి.
కిక్కైనా లెక్కుండాలి
* ఇంటర్‌ రెండేళ్లు. కాలేజీ, హాస్టల్‌, స్టడీ అవర్స్‌. ఈ చదువుల సంద్రం ఈది మంచి కాలేజీలో సీటు. బ్రాండెడ్‌ యాక్సెసరీస్‌తో క్యాంపస్‌లో కాలు పెడతారు. తర్వాతేంటి? బోర్డు ఎగ్జామ్స్‌ మాదిరిగా బట్టీ పట్టడాలు... పక్కనే  చదివించడాలు.. అక్కడ కనిపించవు. మేమే ముందుండాలి అనుకుంటే... ఇతరులు పోటీ అనుకోకుండా మీకు మీరే పోటీ అనుకోవాలి. అప్పుడే స్వేచ్ఛా వాతావరణంలో స్వచ్ఛమైన నాలెడ్జ్‌ని సంపాదించొచ్చు. లేదంటే ఒత్తిడిని తట్టుకోలేక... ఓటమిని అంగీకరించలేక.. అయోమయంలో పడిపోతారు.
* క్యాంపస్‌లో కట్టు.. బొట్టూతో పాటు చాలా మార్పుల్ని చూడాల్సి వస్తుంది. వాటిల్లో కిక్కుని ఆస్వాదిస్తూనే లెక్కని మర్చిపోకూడదు. మన కుటుంబం... మన సంప్రదాయం.. పరిస్థితులను ఎప్పటికప్పుడూ బేరీజు వేసుకోవాలి.
* ఇంటర్లో ఒకరో ఇద్దరో ఫ్రెండ్స్‌. ఇంజినీరింగ్‌లో నలుమూలల నుంచి నాలుగు రకాల ఆలోచనలతో వస్తారు. బెస్టీలుగా మారతారు. వారికి తగినట్టుగా ఉండాలనుకుంటారు పిల్లలు. తప్పులేదుగానీ... మీరు వేరు, మీ ఆర్థిక పరిస్థితులు వేరన్న విషయాన్ని గ్రహించాలి. వారు బ్రాండెడ్‌ వేసుకున్నంత మాత్రాన మీరూ అదే ఖరీదైన బ్రాండ్‌ని వాడాలనుకోకూడదు. స్మార్ట్‌ ఫోన్‌ ఉండాలి. అంతేగానీ... అది  ఐఫోనో... వన్‌ప్లస్సో కానక్కర్లేదు.
* పార్టీలంటూ ఆలస్యంగా వస్తే అమ్మాన్నానలు దండించేది.. మీ మీద కోపంతో కాదు. అప్పటిదాకా మీకేమైందోనన్న ఆందోళనలో. ఆ విషయం గుర్తించండి. ఎక్కడికి వెళ్తున్నాం. ఎవరితో వెళ్తున్నామో పెద్దలకు చెప్పడం ఉత్తమం.
* ‘కన్నారుకదా... పెంచాలి...’ అనే ధోరణి యువత వదులుకోవాలి. బాధ్యతగా మసులుకోవాలి. మనల్ని పెంచడం వారి బాధ్యత అయితే... వారికి ఇబ్బంది కలుగకుండా మసులుకోవడం యువత కర్తవ్యం.
* మాకేం కావాలో మాకు తెలుసని ముక్కుసూటిగా చెప్పే పిల్లలూ మీరున్న స్థితిని విశ్లేషించుకోవాల్సిన తరుణం ఇదే. మీలోనే భవిష్యత్తుని వెతుక్కునే తల్లిదండ్రులకు విడమర్చి  చెప్పాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే వారికి తమ పిల్లలు ఎప్పటికీ పిల్లలే. మీ ప్రవర్తన చూసి తల్లిదండ్రులు కచ్చితంగా ఆలోచనలో పడతారు. వారిని సమాధాన పరచాల్సిన అవసరం యువతకుంది.తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి
* చిన్నప్పటి నుంచి మార్కులు.. ర్యాంకుల మధ్యే పిల్లల వ్యక్తిత్వాన్ని లెక్కగట్టడం ఏ మాత్రం సరైంది  కాదు. ఆ గ్రేడు వస్తే నీకు అది కొనిస్తా అని... ఈ ర్యాంకు వస్తే ఇది నీ సొంతం అని చెప్పే మాటలు వారి ఆలోచనా సరళిని మార్చేస్తాయి.
* మానసికంగా, శారీరకంగా వచ్చే మార్పుల్ని గమనిస్తూ... అందుకు తగినట్టుగా వారిని సిద్ధపరచాలి. హీరోలను... ఇష్టమైన వారినీ అనుకరించడం మొదలుపెడతారు. ఈ తరహా కలల ప్రపంచంలోకి ఇతరుల్ని త్వరగా ప్రవేశించనివ్వరు. ఇలాంటి సమయంలోనే వాస్తవాల్ని పరిచయం చేయాలి. వారి ఉద్దేశాల్ని అర్థం చేసుకోవాలి.
* మీరు చెప్పిందే చేయాలనే దృక్కోణాన్ని మార్చుకోవాలి. లేదంటే మొదటికే మోసం. ఒకరి ఎమోషన్స్‌ మరొకరు అర్థం చేసుకోవాలి. అనర్థాలేంటి? మంచేంటి? చర్చించుకుని కలిసి నిర్ణయం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
* మన పరిస్థితులు? మన పరిధి తెలియచెబితే విపరీత పోకడ తగ్గుతుంది. ఇది నిరంతర ప్రక్రియ.

మేమే కరెక్టు అనుకోవద్దు 

టీనేజ్‌లో వస్తున్న మార్పులు కొన్ని వారికే అంతుపట్టవు. అందుకే  వారున్న స్థితిని ‘మిస్టరీ పీరియడ్‌’ అంటారు. పేరెంట్స్‌ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పటి వరకూ ‘లవ్‌ యూ మామ్‌... మిస్‌ యూ డాడ్‌’ అని చెప్పినవారే ‘లీవ్‌ మి ఎలోన్‌... డోన్డ్‌ డిస్ట్రబ్‌’ అనేందుకు వెనకాడరు. బయటి ప్రపంచంతో ఎక్కువ కనెక్టు అవడం వల్లే ఇంట్లో వాళ్లతో ఇలా ప్రవర్తిస్తుంటారు. మంచి కొడుకుగా... విద్యార్థిగా... ఫ్రెండుగా... లవర్‌గా ఉండేందుకు సిద్ధం అవుతుంటారు. ఈ క్రమంలో వాటిని పూర్తిస్థాయిలో మేనేజ్‌ చేయడం సాధ్యం కాక ఒత్తిడికి లోనవుతుంటారు. ‘సోషల్‌ ఐడెంటిటీ’ కోసం...తపన పడతారు. వెళ్తున్న రైలు పక్కన నిలబడి సెల్ఫీలు దిగడం... కొండ..  కాలువ... అంచుల్లో కేరింతలు కొట్టడం ఈ కిక్‌ కోసమే. ఇలాంటి సందర్భాల్లో సరైన కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.

- గీత చల్లా, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్

మంచి..చెడుల విచక్షణ అవసరం 

ఆరో తరగతి నుంచే ఐఐటీ, నీట్‌ కోచింగులంటూ... పిల్లలకు ఎటువంటి ఆనందం లేకుండా చేస్తారు తల్లిదండ్రులు. ఇంటర్‌ దాకా బాగా చదివితే చాలు ఆ తర్వాత నీ ఇష్టం అంటారు. ఇదే గ్రాడ్యుయేషన్‌ ప్రారంభంలో వారిని విపరీత ధోరణికి మారుస్తుంది. అందుకే ఇంటర్లో 95 శాతం మార్కులు సాధించిన వారు డిగ్రీ ప్రథమ సంవత్సరం బ్యాక్‌లాగ్స్‌ పెట్టుకుంటారు. అందుకే చిన్నప్పటి నుంచే మన కుటుంబ పరిస్థితులు వివరిస్తూ పెంచాలి. ఏది మంచి, ఏది చెడో విడమరచాలి. బాధ్యత నేర్పాలి. మాకు ఎప్పుడూ స్వేచ్ఛ ఉంది అని పిల్లలు ఫీల్‌ అయ్యేలా చేయాలి. అప్పుడే ఒక్కసారి పంజరంలోంచి వచ్చిన చిలుకలా ఎలా పడితే అలా ఎగిరిపోకుండా ఉంటారు.

 

- డా. వీరేందర్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని