గ్యాడ్జెట్‌ గ్యాంగ్‌.. గమనం ఎటు?

అదో గ్యాడ్జెట్‌ గ్యాంగ్‌ చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ చెవులకు హెడ్‌సెట్‌ జేబులో పవర్‌బ్యాంకు చుట్టూ వై-ఫై అందినకాడికి హాట్‌స్పాట్‌లు మొత్తంగా... వారిదో టెక్‌ ప్రపంచం అది వారికే సొంతమైన వర్చువల్‌ వరల్డ్‌ అక్కడే వారిని టెక్నాలజీ వ్యసనం ఆవహిస్తోంది....

Published : 19 May 2018 01:54 IST

రెడ్‌ సిగ్నల్‌
గ్యాడ్జెట్‌ గ్యాంగ్‌.. గమనం ఎటు?

 అదో గ్యాడ్జెట్‌ గ్యాంగ్‌ చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ చెవులకు హెడ్‌సెట్‌ జేబులో పవర్‌బ్యాంకు చుట్టూ వై-ఫై అందినకాడికి హాట్‌స్పాట్‌లు మొత్తంగా... వారిదో టెక్‌ ప్రపంచం అది వారికే సొంతమైన వర్చువల్‌ వరల్డ్‌ అక్కడే వారిని టెక్నాలజీ వ్యసనం ఆవహిస్తోంది. సెల్ఫీల వలలో... వీడియో గేమ్‌ల ఉచ్చులో... సోషల్‌ మీడియా జడిలో తడిసి ముద్దయ్యేలా చేస్తోంది! సెల్ఫీలు... షేరింగ్‌లు.. లైక్‌లు... కామెంట్‌లు.. స్కోర్‌లు... వీటి మధ్యే మత్తులో మునిగి తేలుతున్నారు.. వారెవరో కాదు. ‘టెక్‌ బానిసలు’సోషల్‌ మీడియాతో మన సమయం వృథా చేస్తున్నామా? సద్వినియోగం చేసుకుంటున్నామా? అనేది ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన ప్రశ్న. ఫేస్‌బుక్‌ వేదికగా రక్తదాతలను, గ్రహీతలను కలిపి ఎన్నో ప్రాణాలు కాపాడిన యువకుడి గురించి చదివాం. అలాగే మన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న సభ్యుల వాట్సప్‌ గ్రూప్‌ల్లో చేరి ఎంతో అవసరమైన సమచారాన్ని పంచుకుంటున్న వారినీ చూస్తున్నాం. సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యేవాళ్లు, దర్శకత్వంపై అడుగులు వేసేవారు. ఇలా పలువురు సోషల్‌మీడియా ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకొందరు పిచ్చి రాతలు, పోస్టింగులు చూస్తూ, సెల్ఫీలు పెట్టుకొంటూ, కామెంట్లు ఏరుకొంటూ కాలం వృథా చేస్తున్నారు. సోషల్‌మీడియా అనేది ఓ పదునైన కత్తి... అది మన చేతిలో ఉంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ప్రయోజనం పొందుతామా? లేక మెడ కోసుకోవడానికి వాడతామా? అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఇదో వ్యసనంలా మారకుండా జాగ్రత్త పడేందుకు ఆయా సోషల్‌ అడ్డాలు ట్రాకింగ్‌ ఆప్షన్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఇప్పటికే ‘టైమ్‌ స్పెంట్‌’ ఆప్షన్‌ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‌ కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నట్లు ప్రకటించింది.
* మనిష్‌ వయసు 17. ఎనిమిదో తరగతి వరకూ క్లాస్‌లో టాప్‌ త్రీలో ఉండేవాడు. ఎప్పుడైతే స్మార్ట్‌ఫోన్‌ చేతికొచ్చిందో... గేమింగ్‌ స్టేషన్‌ ఇంటికొచ్చిందో తన ప్రపంచమే మారిపోయింది. రోజుకి 10-14 గంటలు గేమ్స్‌తోనే. క్లాస్‌లకు బంక్‌ కొట్టడమే కాదు. చివరికి పరీక్షలూ రాయలేదు. తిండి కూడా గేమ్స్‌ ఆడుతూనే. ప్రవర్తనా... ఆకారం అన్నింటిలో మార్పే. కళ్లు ఎర్రబడటం... మెడ నొప్పి... అలసట. ఇదేంటని అడిగిన తల్లినే కొట్టేంత పని చేశాడు. ఏం చేసినా గేమింగ్‌ వైపు ధ్యాస మళ్లకుండా ఆపలేకపోయారు. చివరికి మానసిక వైద్య నిపుణులు పర్యవేక్షణలో గేమింగ్‌ అడిక్షన్‌ నుంచి బయటికి తీసుకొచ్చారు.
* తరుణి ఇంజినీరింగ్‌ చదువుతోంది. పదిహేను నిమిషాల్లో తను తీసుకునే సెల్ఫీలు ఎన్నంటే 100. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే. తనకి నచ్చేలా సెల్ఫీ చక్కగా వచ్చేంత వరకూ తీసుకుంటూనే ఉంటుంది. తర్వాత నచ్చిన వాటిని డిస్‌ప్లే పిక్‌తో మొదలెట్టి సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో పోస్ట్‌ చేస్తుంది. అక్కడితో తన సరదా ఆగదు. పోస్ట్‌ చేసిన వాటికి లైక్‌లు ఎన్ని... కామెంట్‌లు ఎన్నో... పదే పదే చెక్‌ చేసుకుంటుంది. ఆశించినస్థాయిలో స్పందన లేకుంటే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. ఎంత కంట్రోల్‌ చేసుకోవడానికి చూసినా మనసాగదు. సెల్ఫీల సంఖ్య ఇంకా పెరగడంతో పాటు మానసిక ఒత్తిడికి లోనవడం మొదలయింది.
* రాహుల్‌ హైపర్‌ యాక్టివ్‌. చదువులోనూ.. అల్లరిలోనూ నెంబర్‌వన్‌. టెక్నాలజీ అండతో తన ఎనర్జీ ఇంకా పెరిగింది. కళ్లు చదువుతుంటే వేళ్లేమో తాకేతెర కీబోర్డుపై. పుస్తకాల్లో పేజీలు తిరగేస్తూనే.. ఫోన్‌నీ పదే పదే అన్‌లాక్‌ చేస్తుంటాడు. అదెంత దూరం వచ్చిందంటే ఫోన్‌ని పరీక్ష సెంటర్‌కి తీసుకెళ్లేంత. ఇన్విజిలేటర్‌ హెచ్చరికతోనైనా ఫోన్‌ ఇవ్వలేదు. పరీక్ష మధ్యలో ఫోన్‌ రింగ్‌ అయ్యేంత వరకూ తన నుంచి ఫోన్‌ని వేరు చేయాలనే ఆలోచనే రాలేదు. దీంతో పరీక్ష హాల్‌ నుంచి బయటికి పంపారు.
వీళ్లు ముగ్గురే కాదు... ఇలా తెలియకుండానే టెక్‌ బానిసలుగా మారుతున్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మీకు గుర్తుందా? ఒకప్పుడు పాకెట్‌ మనీ దేనికంటే? ఏ టీనేజర్‌ అయినా సినిమాకనో... షికారుకనో... ఫ్రెండ్స్‌తో పిక్నిక్‌కనో చెప్పేవారు. మరి, ఇప్పుడు తడుముకోకుండా డేటాప్యాక్‌కో.. గేమింగ్‌ సబ్‌స్క్రిప్షన్‌కనో చెప్పేస్తున్నారు. టీనేజర్లే కాదు. కొలువుల కోటల్లో వేలకు వేలు సంపాదించే కుర్రోళ్లూ ఇదే ఫాలో అవుతున్నారు. ఎప్పటికప్పుడు స్టేటస్‌ అప్‌డేట్స్‌ పెట్టేస్తూ... పూటకో సెల్ఫీతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గేమింగ్‌లే.. గేమ్‌లు! తాకేతెరలపై మునివేళ్లు వీరి మాట వింటే ఒట్టు.. చేతిలో గేమింగ్‌ జాయ్‌స్టిక్‌ల్లోనే వీరి జాయ్‌ అంతా!! ముఖ్యంగా 16 నుంచి 20 ఏళ్ల వయసున్నవారిలో ఈ ధ్యాస ఎక్కువ. మరి, మీరూ ఇదే కోవలోకి వస్తారా? అయితే, ఒకసారి ఆలోచించాల్సిందే. ‘అబ్బే అంత సీన్‌ లేదులే. మాకు తెలియదా? అందంతా జస్ట్‌ టైమ్‌పాస్‌’ అని కొట్టేపారెయొద్దు. ఈ టెక్నాలజీ వ్యసనం నిజ జీవితంలో ఎన్నో రకాల ట్విస్ట్‌లను పరిచయం చేస్తుంది.

సంఖ్య పెరుగుతోంది

 డేటా ప్యాక్‌లు చౌక అవ్వడం... స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడం. ‘కాసేపు రిలాక్స్‌ అవుతాడులే!’ అని తల్లిదండ్రులు భావించడం... ఇలా ఇంట్లో పేరెంట్స్‌ నెట్టింట్లోకి తీసుకెళ్తున్నారు. ఇక ఫ్రెండ్స్‌, పీర్‌ గ్రూప్స్‌ ప్రోత్సాహంతో నాణేనికి మరోవైపు పరిచయం అవుతుంది. ఇక్కడే నియంత్రణ అవసరం. ఏం చేస్తున్నాడు? ఏం చూస్తున్నాడు? ఏంటి ప్రయోజనం? అనే లెక్కలు పేరెంట్స్‌లోనూ.. పిల్లలోనూ పెరగాలి. టెక్నాలజీకి దగ్గరవడం తప్పులేదుగానీ... అదో మాయగా ఫీల్‌ అయ్యి వాస్తవ ప్రపంచాన్ని విస్మరించడం తప్పు అంటున్నారు కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌.టీ.ఎస్‌.రావు. ‘ప్రధానంగా వీడియో గేమింగ్‌లోనే ఇది మొదలవుతుంది. కాసులతో లెక్కలేకుండా ఖరీదైన గేమ్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుని మనుషులతో సంబంధం లేకుండా మాయలో పడిపోతారు. అదో వ్యసనమని తెలియక కౌన్సెలింగ్‌కి వస్తున్నారు. నెలలో ఒకరో ఇద్దరో వచ్చేవారు. ఇప్పుడు వారి సంఖ్య పెరుగుతోంది. వారానికి 8 కేసుల వరకూ చూస్తున్నాం. వీరిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు చాలా క్లిష్టమైన చికిత్సా విధానాల్ని పాటించాలి. నెలల సమయం పడుతుంది.’ అని ఈ నూతన వ్యసన వ్యాధి గురించి చెప్పారు.

నియంత్రణ అనివార్యం 

వయసొచ్చాక కాదు. ‘కిడ్స్‌ యూట్యూబ్‌’ పెడితేగానీ గోరు ముద్దలు అందుకోని పరిస్థితి. అక్కడే పరిచయమైన టెక్నాలజీ ఫాలోయింగ్‌ వారితోనే పెరిగి పెద్దవుతుంది అంటున్నారు    ఓ విద్యాసంస్థల ఛైర్మన్‌, సైకాలజిస్ట్‌  ఎం.వేణుగోపాల్‌ రెడ్డి. ‘తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. నెలల వయసులో టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌పై నేర్చుకోవడంతో పిల్లల దారి అటువైపు మళ్లుతుంది. తర్వాత అలవాటుగా మారుతుంది. టీనేజ్‌కి వచ్చేసరికి అది లేకుండా గడవని పరిస్థితికి వాళ్లు చేరుకుంటారు. ఇదే వ్యసనం.’ అంటారాయన.

* సెల్ఫ్‌చెక్‌

* గీత మీదుంటే...
రోజులో కనీసం మూడు సెల్ఫీలు తీసుకుంటారు. కానీ, కచ్చితంగా సోషల్‌ మీడియాలో పంచుకోవాలి అనుకోరు.
* గీత దాటడం
మూడు సార్లు క్లిక్‌ మనిపించడం. వెంటనే షేర్‌ చేయడం.
* వ్యసనం
ఎప్పుడంటే అప్పుడు సెల్ఫీలు తీయడం. వాటిని పోస్ట్‌ చేయడం. స్పందనల్ని ట్రాక్‌ చేయడం. ఇలా రోజులో కనీసం ఏడు సార్లు అయినా సెల్ఫీల సందడి షురూ చేస్తారు.
మీరు సెల్ఫీ బానిసా?
మూడు దశలుల్లో సెల్ఫీ వ్యసనం దగ్గరవుతుంది

* గేమింగ్‌ గదిలో ఉన్నారా?

* ముఖ్యమైన వాటిపై నిర్లక్ష్యం మొదలు
* అకారణంగా కోపం... ఒత్తిడికి లోనవడం
* పోటీలో వెనకబడడం... విరమించడం
* అలసట... తలనొప్పి.. కళ్లు ఎర్రబడడం
* గేమింగ్‌కి అయ్యే ఖర్చుకి వెనకాడరు
* అప్పటి వరకూ మీకు ఎంతో ఇష్టమైన వాటిని వదిలేస్తారు.
* ప్రియ మిత్రుల్ని కోల్పోతారు. గేమింగ్‌లో క్యారెక్టర్లు వారిని రీప్లేస్‌ చేస్తాయి.

* సోషల్‌ మీడియాకి చిక్కితే

* అందుబాటులో లేనప్పుడు మరింత ఎక్కువగా  సోషల్‌ నెట్‌వర్క్‌ అడ్డాల గురించి ఆలోచించడం
* వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం కోసం ఎఫ్‌బీనో, ట్విట్టర్‌నో ఆశ్రయించడం
* సోషల్‌ అడ్డాలకు దూరంగా ఉన్నప్పుడు మీలో అసహనం, ఒత్తిడి ఎక్కువడం
* సోషల్‌ లైఫ్‌ శృతిమించడంతో చదువు, ఉద్యోగం, స్నేహాల్లో భేదాభిప్రాయాలు ఎక్కువ అవడం...
* ప్రియమిత్రులంటే ఫేస్‌బుక్‌ ఫ్రెండ్సే అనుకోవడం
* ఫ్రెండ్‌ రిక్వస్ట్‌లు ఏమొచ్చాయోనని పదే పదే చెక్‌ చేసుకోవడం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని