చేజారితే చేటే!

ట్విట్టర్‌లో... ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టాగ్రామ్‌... ఇలా వాడుతున్న పలు సోషల్‌ మీడియా వేదికలపై ఇలానే పోస్టింగ్‌లు పెట్టడమో... కామెంట్‌లు చేయడమో చేస్తున్నారా? జాగ్రత్త సుమా! ‘సోషల్‌’ లైఫ్‌లో మీ ప్రొఫైల్‌ కాండక్ట్‌ సర్టిఫికెట్‌గా మారుతోంది. మీరు చేసిన అప్‌డేట్స్‌, పోస్టింగ్‌లు మీ వ్యక్తిత్వానికి...

Published : 21 Jul 2018 01:53 IST

చేజారితే చేటే!

* బీటెక్‌ పూర్తి చేసిన భరత్‌ రెండేళ్లు ఖాళీగా తిరిగి.. టక్కు, టైతో ఇంటర్వ్యూకి వెళ్లాడు. మూడేళ్ల అనుభవం ఉందని, ఓ లక్ష్యంతో ఈ ఉద్యోగానికి వచ్చానని ఇంటర్వ్యూ ప్యానల్‌ను మెప్పించే ప్రయత్నం చేస్తాడు. వారం తర్వాత ఫోన్‌ చేస్తామని చెప్పిన మాటలకు ఇంకేంటి నేను సెలెక్ట్‌ అయినట్టే అనుకుంటాడు. వారం తర్వాత ఫోన్‌ రాకపోతే తనే సంస్థకు ఫోన్‌ చేస్తాడు... ‘భరత్‌ మీరు ఫేక్‌ సమాచారం ఇచ్చారు. మీకు  ఉద్యోగ అనుభవం లేదు. రెండేళ్లు ఖాళీగా ఉన్నారు. మీ వ్యక్తిత్వంలో చాలా లోపాలున్నాయి. దయచేసి సరి చేసుకోండి. లేదంటే చిక్కుల్లో పడతారు!’ ఇదీ ఫోన్‌ కాల్‌ సారాంశం. ఈ విషయాలు వాళ్లకెలా తెలిశాయి? * రమ్యకి మేనేజర్‌గా పదేళ్ల అనుభవం. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌. కొత్తగా ప్రారంభించిన ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా అపాయింట్ అయ్యింది. మరో అసిస్టెంట్‌ మేనేజర్‌నీ  తీసుకున్నారు. కొత్త శాఖలో ఇద్దరే ఉద్యోగులు. ఇంకా పూర్తిస్థాయిలో రిక్రూట్‌మెంట్‌ జరగలేదు. ఓ రోజూ ఆఫీస్‌కి వెళ్లగానే టేబుల్‌పై ఎల్లో స్లిప్‌. కారణం. సరదాగా తను పెట్టిన ఓ సోషల్‌ స్టేటస్‌. అదేంటంటే... ‘కొత్త శాఖలో నేనే బాస్‌. నాకో అసిస్టెంట్‌. ఇంకెవ్వరూ లేరు!’ అని. కంపెనీ ఆ స్టేటస్‌ని మరోలా అర్థం చేసుకుని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించింది.  * వినయ్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. అమెరికా వెళ్లడానికి పాస్‌పోర్ట్‌ అప్లై చేశాడు. అధికారులు పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌ని తిరస్కరించారు. కారణం ఏంటో ఇప్పటికే మీరు అర్థమైంటుంది. సోషల్‌ నెట్‌వర్కింగ్‌లో పంచుకునే వాటిని సీరియస్‌గా తీసుకోకపోవడమే.  సామాజికవేదికల్లో సిల్లీగా ఓ పోస్ట్‌ పెట్టేసి నవ్వుకుంటారు. మర్చిపోతారు. మీరు పోస్ట్‌ చేసిన టెక్స్ట్‌ మేటరో... ఫొటోనో ఎప్పటికీ అలానే ఉంటాయి. ప్రైవసీ సెట్టింగ్స్‌ని  బ్రేక్‌ చేసి ఇంటర్నెట్‌ ప్రపంచంలో మీరు చేసిన పోస్ట్‌ ఎవ్వరైనా చూడగలిగే అవకాశం ఉంది. భరత్‌, రమ్య, వినయ్‌ తెలియక చేసిన తప్పు ఇదే! ఆయా సోషల్‌ నెట్‌వర్కింగ్‌లో వారు పోస్ట్‌ చేసినవే భరత్‌కు ఉద్యోగం రాకపోవడానికి, రమ్యని ఉగ్యోగం నుంచి తీసేయడానికి, వినయ్‌కి పాస్‌పోర్ట్‌ ఇవ్వకపోవడానికి కారణం.

ట్విట్టర్‌లో... ఫేస్‌బుక్‌.. ఇన్‌స్టాగ్రామ్‌... ఇలా వాడుతున్న పలు సోషల్‌ మీడియా వేదికలపై ఇలానే పోస్టింగ్‌లు పెట్టడమో... కామెంట్‌లు చేయడమో చేస్తున్నారా? జాగ్రత్త సుమా! ‘సోషల్‌’ లైఫ్‌లో మీ ప్రొఫైల్‌ కాండక్ట్‌ సర్టిఫికెట్‌గా మారుతోంది. మీరు చేసిన అప్‌డేట్స్‌, పోస్టింగ్‌లు మీ వ్యక్తిత్వానికి కొలబద్దలుగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో మీ కెరీర్‌ను నిర్దేశించబోతున్నాయ్‌! అందుబాటులో ఉంది కదా అని బుర్రకు తట్టిందలా,్ల చేతికి వచ్చిందల్లా రాయకండి! అరచేతిలో వైకుంఠం హద్దులు దాటితే నరకం చూపిస్తుంది. ఎంతంటే... కష్టపడి సాధించిన ఉద్యోగం ఊడేంతలా. సో ఫ్రెండ్స్‌... పారాహుషార్‌!

కాలేజీలో చేరాలన్నా, ఉద్యోగంలో జాయిన్‌ అవ్వాలన్నా మనందరికీ కాండక్ట్‌ సర్టిఫికెట్‌ ఉంటుంది. మన ప్రవర్తనకు అదో కొలబద్ద అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, నేటి ఆన్‌లైన్‌ ప్రపంచంలో మీ వ్యక్తిత్వాన్ని, ఆలోచనల్ని అంచనా వేసేందుకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లు వేదికలుగా నిలుస్తున్నాయి. యువతరం సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సరికొత్త వారధులుగా నిలుస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని ఆయా కంపెనీలు కొత్తవారిని ఉద్యోగంలోకి తీసుకునే ముందు సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో వారి వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నెట్‌వర్క్‌ కమ్యూనిటీలోని ఇతర స్నేహితులతో చేస్తున్న కమ్యూనికేషన్‌, సంబంధాల్ని గమనిస్తూ సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. అప్పటికే పని చేస్తున్న ఉద్యోగుల పోస్టింగ్‌లను గమనిస్తూ కంపెనీ వ్యవహారాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు ఆయా కంపెనీల మానవవనరుల (హెచ్‌ఆర్‌) విభాగాలు ప్రత్యేకంగా టెక్నికల్‌ బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రొఫైల్స్‌పై నిఘా వేస్తున్నాయి. అభ్యర్థులు పొందుపరిచిన బయోడేటాలోని వివరాల్ని క్రాస్‌చెక్‌ చేస్తున్నారు.


* కాలేజీల్లో చదివేవారు, ఉద్యోగాల్లో ఉన్న వారే కాదు... పిల్లలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనికి తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం. వారు ఎలాంటి పోస్టింగులు పెడుతున్నారు. ఏవీ షేర్‌ చేస్తున్నారు.. గమనించి తగిన సూచనలివ్వాలి.


లైట్‌ తీసుకోకు బాస్‌!

సోషల్‌ నెట్‌వర్క్‌లో మీరు పొందుపరిచే వివరాలు మీ వ్యక్తిత్వాన్ని మరింత పెంచేలా ఉండాలి. స్నేహితులతో సంభాషణ హుందాగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివిధ సైట్‌ల్లో తప్పుడు బయోడేటాలను పెట్టకండి. చేస్తున్న ఉద్యోగం, బాస్‌ పట్ల మీకున్న అసహనాన్ని బహిరంగంగా పోస్ట్‌ చేయడం మంచిది కాదు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌... లాంటి సైట్‌ల్లో ప్రైవసీ సెట్టింగ్స్‌ని విధిగా సెట్‌ చేసుకోవాలి.


జల్లెడ పడుతున్నారు
ప్రైవసీ సెట్టింగ్స్‌ పెట్టుకున్నంత మాత్రన మీకు సంబంధించిన డేటా బయటికి పొక్కదు అనుకుంటే పొరబాటే. ఎందుకంటే... మీ నెట్‌వర్క్‌లో ఉన్న ఫ్రెండ్స్‌ ఈ విషయంలో కట్టుదిట్టంగా లేకున్నా మీ గుట్టు బయటికి వచ్చేస్తుంది. మీరెలాంటి పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు... వాటిపై మీ ప్రతి స్పందనలు ఎలా ఉన్నాయ్‌... లాంటి మొత్తం వివరాల్ని గ్రూపులోని ఫ్రెండ్స్‌ ఎకౌంట్‌ నుంచి సేకరించొచ్చు. మీ గురించి జల్లెడ పట్టాలనుకునే కంపెనీలు పలు రకాల టెక్నాలజీ మాధ్యమాల ద్వారా మీ ప్రొఫైల్‌ని ఎక్స్‌ప్లోర్‌ చేస్తాయి. ఇందుకు కొన్ని అప్లికేషన్స్‌ని డెవలప్‌ చేసుకుంటున్నాయి కూడా. వాటితో మీ వాల్‌పై పంచుకున్న చిట్టా మొత్తం సేకరిస్తున్నారు. ఇప్పటికే మీరేదైనా కంపెనీలో ఉద్యోగులైతే, కంపెనీ క్రియేట్‌ చేసిన ఎఫ్‌బీ కమ్యూనిటీని విధిగా మీరూ ఫాలో అవ్వాల్సి రావొచ్చు. ఇలా ఎప్పుడైతే మీరు కంపెనీ సోషల్‌ ఎకౌంట్‌ని ఫాలోయర్‌గా మారారో.. అప్పటి నుంచి మీ ఎకౌంట్‌ని కంపెనీ మానిటర్‌ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.


విద్యార్థిగా ఉన్నప్పుడు మీరు పోస్ట్‌ చేసిన ఆకతాయి ఎఫ్‌బీ పోస్ట్‌ బాధ్యతాయుతమైన వృత్తిలో చేరేందుకు మీకు అడ్డుగా మారొచ్చు. కష్టపడి పని చేస్తూ బాస్‌పై మీకున్న అసహనాన్ని స్నేహితుడితో పంచుకున్న ఓ ఫన్నీ ట్వీట్‌ మీ ఉద్యోగం పోవడానికి కారణం కావచ్చు. నోటి మాట అయితే పూర్తవ్వగానే గాల్లో కలిసిపోతుంది. తూచ్‌! నేనలా అనలేదు అని మాట మార్చేయవచ్చు. కానీ, నాజూకైన మీ మునివేళ్లతో టైప్‌ చేసిన సోషల్‌ ఛాట్‌ ఎప్పటికీ అలానే ఉంటుంది. మీ సోషల్‌ నెట్‌వర్క్‌ వాల్‌పై భద్రంగా!


సోషల్‌ నడవడిక ఉండాలి

మాజంలో ఎలాగైతే మంచి నడవడిక అవసరమో... సోషల్‌ లైఫ్‌లోనూ హుందాగా నడుచుకోవడం అలవర్చుకోవాలి. ముఖ్యంగా యువత. క్యాంపస్‌ దాటుకుని కెరీర్‌వైపు అడుగులు వేసేవారు సోషల్‌ ప్రొఫైల్‌కి మంచి కాండక్ట్‌ సర్టిఫికెట్‌ నెట్టింట్లో దొరికేలా నడుచుకోవాలి. వాడుతున్న భాష మొదలుకుని అప్‌లోడ్‌ చేస్తున్న వీడియోల వరకూ అన్నీ మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. పరీక్షల్లో మంచి హ్యాండ్‌ రైటింగ్‌తో గ్రామర్‌ తప్పులు లేకుండా ఎలాగైతే పొందిగ్గా రాస్తామో అదే తీరుగా మీ సమాచారం ఉండేలా చూసుకోవాలి. టాపిక్‌ ఏదైనా... మీ స్పందనలు ముక్కుసూటిగా ఉంటున్నాయా? విశ్లేషణాత్మకంగా సాగుతున్నాయా? అనే విషయాల్ని వాల్‌పై మీ స్పందనల ఆధారంగా కంపెనీలు విశ్లేషిస్తాయి. సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారా? లేదా? అనే విషయాన్ని విశ్లేషించేందుకు మీ కామెంట్‌లు, పోస్టింగ్‌లే కంపెనీలకు ప్రధానమైన సోర్సు కోడ్‌లు. ఉదాహరణకు మీ ఫేస్‌బుక్‌లో ఎక్కువ రాజకీయపరమైన అప్‌డేట్స్‌ ఉన్నాయనుకుందాం. మీరో ఓ రాజకీయ పార్టీకి వ్యతిరేకం. మీరు ఒక్కమాట కూడా ప్రత్యక్షంగా అనకుండా ఆయా నాయకుల నెగెటివ్‌ వీడియోలు పదే పదే పోస్ట్‌ చేస్తున్నారు. అంటే.. మీకు రాజకీయపరమైన అంశాలపై ఆసక్తి ఎక్కువ అని కంపెనీకి తెలుస్తుంది. ఇలా మీవైన అభిరుచులు, వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారు. అక్కడా.. ఇక్కడా చూసి ఇంప్రెసివ్‌గా ఉన్న బయోడేటాని కాపీ చేసి లింక్‌డిన్‌లో పెట్టేస్తే నడిచిపోయే రోజులు పోయాయి. ఎన్ని రోజుల ముందు మీ సోషల్‌ ప్రొఫైల్‌ని ఎలా అప్‌డేట్‌ చేశారో కూడా తెలుసుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. మీరెంచుకున్న రంగంలో పుంజుకునేందుకు మీరెలాంటి సోర్సుల్ని సోషల్‌ లైఫ్‌లో ఫాలో అవుతున్నారు... ఏయే వ్యక్తులు, కంపెనీలను ఫాలో అవుతున్నారో పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

- అను వెలదండి, ఆన్‌లైన్‌ బ్రాండ్‌ కన్సల్టెన్సీ

ఈ నిఘా సరైనదేనా?  

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లపై ఇలాంటి నిఘా స్వేచ్ఛను హరించేదా? అనే సందేహం రావొచ్చు. కానీ, ఇది వ్యక్తిత్వాన్ని అంచనా వేసేది మాత్రమే. ఎలాగంటే... సోషల్‌ మీడియాలో అనేక సంఘటనల్ని చూస్తుంటాం. స్పందిస్తాం. మొన్నీ మధ్యే సోషల్‌ మీడియాలో ఓ పోస్టింగ్‌ని గమనించా. అదేంటంటే... కాలేజీ బయట అమ్మాయిని అత్యంత కిరాతంగా నరికి చంపిన ఫొటోలు, వీడియో. చాలా వ్యూస్‌, కామెంట్స్‌ వచ్చాయ్‌. కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు. ఎవ్వరికీ తెలీదు. కానీ, పోస్టింగ్‌ల కింద గమనించిన స్పందనల్ని చూస్తే షాకింగ్‌గా అనిపించింది. ఒకతను  ‘బాగా చేశావ్‌’ అని రాశాడు. అది చదివిన ఏ కంపెనీ అయినా ఆ వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇస్తుంది. ఒకవేళ అతని మానసిక స్థితి తెలియక జాబ్‌ ఇస్తే కంపెనీలో అలాంటి మరో సంఘటన జరదని గ్యారెంటీ ఏంటి? ఈ దృక్కోణంలో ఆలోచిస్తే ఇది కేవలం వ్యక్తుల నిజాయితీ, వ్యక్తిత్వాన్ని అంచనా వేసేందుకేనని స్పష్టంగా అర్థం అవుతుంది. అభ్యర్థుల బయోడేటాల్లోని నిజానిజాల్ని తెలుసుకునేందుకు ఇదో సరికొత్త మార్గంగా ఆయా సంస్థల హెచ్‌ఆర్‌ విభాగాలు వాడుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు విలువల్ని కాపాడుతూ బాధ్యతాయుతంగా సోషల్‌ నెట్‌వర్క్‌లను వాడుకోవడం పట్ల ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్నాయి.

- సాయి సతీశ్‌, టెక్నాలజీ నిపుణులు

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని