ఛాలెంజ్‌.. సైయ్యా?

ప్రణాళికలు... పేపర్‌ వర్కులు ప్రాజెక్టులు... ప్రాఫిట్‌ అకౌంట్‌లు ఉరుకులు... పరుగులు... ఇంతేనా లైఫ్‌ అంటే... ఇంకేదో ఉంది బాస్‌!! అందుకే ఈ సవాళ్లు స్వీకరించేందుకు మీరు సిద్ధమేనా? ఫిట్‌నెస్‌పై కొందరు... పర్యావరణ పరిరక్షణపై ఇంకొందరు... సెలబ్రిటీల ఛాలెంజ్‌లు ఆకట్టుకుంటున్నాయి. రాజకీయాలు మొదలు సినిమాలు, స్పోర్ట్స్‌... రంగం ఏదైనా ఓ మంచి పని కోసం ఒకరిపై మరొకరు ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. మరి, మీ సంగతేంటి? వాటికి లైక్‌లు కొడుతూ షేరింగ్‌లు, ఫార్వర్డులు చేయడమేనా? ఏదైనా మంచి పనికి పూనుకుని ఇతరులకు సవాల్‌ విసరాలంటే సెలబ్రిటీనే కానక్కర్లేదుగా! ఎవ్వరైనా ‘ఛాలెంజ్‌’ చేయొచ్చు. కళాశాలల్లో విద్యార్థులు మొదలుకుని....

Published : 28 Jul 2018 01:46 IST

ఛాలెంజ్‌.. సైయ్యా?

ప్రణాళికలు... పేపర్‌ వర్కులు
ప్రాజెక్టులు... ప్రాఫిట్‌ అకౌంట్‌లు
ఉరుకులు... పరుగులు...
ఇంతేనా లైఫ్‌ అంటే...
ఇంకేదో ఉంది బాస్‌!!
అందుకే ఈ సవాళ్లు
స్వీకరించేందుకు మీరు సిద్ధమేనా?

ఫిట్‌నెస్‌పై కొందరు... పర్యావరణ పరిరక్షణపై ఇంకొందరు... సెలబ్రిటీల ఛాలెంజ్‌లు ఆకట్టుకుంటున్నాయి. రాజకీయాలు మొదలు సినిమాలు, స్పోర్ట్స్‌... రంగం ఏదైనా ఓ మంచి పని కోసం ఒకరిపై మరొకరు ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. మరి, మీ సంగతేంటి? వాటికి లైక్‌లు కొడుతూ షేరింగ్‌లు, ఫార్వర్డులు చేయడమేనా? ఏదైనా మంచి పనికి పూనుకుని ఇతరులకు సవాల్‌ విసరాలంటే సెలబ్రిటీనే కానక్కర్లేదుగా! ఎవ్వరైనా ‘ఛాలెంజ్‌’ చేయొచ్చు. కళాశాలల్లో విద్యార్థులు మొదలుకుని... కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల వరకూ అందరూ. చదువులు, ఫిట్‌నెస్‌, వ్యక్తిత్వం, స్కిల్స్‌ని పెంపొందించుకునేలా సై సవాలంటే.. బాగుంటుంది కదూ! నేటి తరం మిలీనియల్స్‌ది ఇదే మాట. అందుకోండి సవాల్‌ అంటున్నారు. స్వీకరించేందుకు మీరు సిద్ధమేనా?

ఆసక్తికొద్దీ మరోటి

సివిల్‌ సర్వీస్‌ నా లక్ష్యం. ప్రస్తుతం ఇంజినీరింగ్‌లో చేరా. దీంతో పాటు నాకు పొలిటికల్‌సైన్స్‌ అంటే ఇష్టం. పైగా నాకు సివిల్‌ సర్వీసులో ఉపయోగపడుతుంది. అందుకే దీనికి సంబంధించిన మెటీరియల్‌, పుస్తకాలు చదువుతుంటా. దీంతో వ్యక్తిగతంగా నాకో కిక్‌ దొరుకుతుంది. నేనున్న రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అందుకే నేను చదివేది ఇంజినీరింగే అయినా ఫ్రీ టైమ్‌లో పాలిటీ బైట్స్‌ని సేవ్‌ చేస్తుంటా? మరి, మీకు ఇలాంటి ఆసక్తి ఉంటే ఇదే నా సవాల్‌? ఇష్టమైన సబ్జెక్టుపై ఓ కన్నేయండి.

- భరత్‌, ఈసీఈ, కర్నూలు.

వర్క్‌అవుట్‌కు రెడీ..

ఇంటర్‌ రెండేళ్లు.. హాస్టల్‌.. ఒకటే చదువు. తెల్లవారుజామున లేచినప్పటి నుంచి నిద్ర కళ్లను కమ్మేసేవరకూ స్టడీ అవర్స్‌. అందుకే బాగా లావైపోయా. షేప్‌ అవుట్‌. ఇప్పుడూ ఇంజినీరింగ్‌లో చేరా. రోజూ ఉదయాన్నే గ్రౌండ్‌కి వెళుతున్నా. వార్మ్‌అప్‌, జాగింగ్‌... మూడు నెలల్లో నా హైట్‌కు తగ్గ వెయిట్‌కి వస్తా. అప్పుడు జిమ్‌కి వెళ్తా. ఆరు నెలల్లో పర్‌ఫెక్ట్‌ షేప్‌లోకి వస్తా. ఛాలెంజ్‌. మిమ్మల్ని మీరూ ఓ సారి చెక్‌ చేసుకోండి.

- సునీల్‌, సీఎస్‌ఈ, చెన్నై.

సేవకి సిద్ధమా?

అనారోగ్యానికి గురైనప్పుడో... పెద్దవాళ్లకి సాయంగానో. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తుంటాం. వందల పడకలున్న హాస్పటల్స్‌లో ఏయే విభాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటాం. అలాంటి సందర్భంలో హెల్ప్‌ అయ్యేలా మా సెక్షన్‌లో అందరం బృందాలుగా ఏర్పడి వారంలో ఒక రోజు కొంత సమయం హాస్పిటల్‌లోని రోగులకు సాయం అందిస్తాం. వారు వెళ్లాల్సిన స్పెషల్‌ విభాగాలకు తీసుకెళ్లడం. కావాల్సిన మందులు కొనివ్వడం. హాస్పటల్‌ పరిసరాల్ని శుభ్రం చేయడం చేస్తుంటాం. మీరున్న ప్రాంతంలో మీరేం చేస్తున్నారు? గ్రూపుగా ఏర్పడి మీరూ సేవకి సై అంటే.. ఇది మీకో సవాల్‌. 

- అభిలాష్‌, సీఎస్‌ఈ, కనిగిరి

ఫోన్‌కి రెండు గంటలు దూరం

ఫోన్‌ని చూడకుండా... వాడకుండా.. ఉండగలరా? ‘వామ్మో.. ఊహకే అందని ఆలోచన!’ అనుకుంటున్నారు కదూ! ఎంత సమయం ఉండగలరు? ‘ఎక్కువలో ఎక్కువ అంటే... ఐదు లేదా పది నిమిషాలు!’ అనుకునేవారికి నాదో సవాల్‌. నేను రోజులో రెండు గంటల పాటు ఫోన్‌ని దూరంగా పెడుతున్నా. నా మనసు ఫోన్‌ వైపు మళ్లకుండా ఆ సమయంలో నాకు ఇష్టమైన చిత్ర లేఖనంపై దృష్టి పెడుతున్నా. నాన్నతో కలిసి గార్డెనింగ్‌ చేస్తున్నా. మరి, మీరు? 

- మహేశ్‌, ఈసీఈ, ఏలూరు

అలారం పెట్టొద్దు

ఏదైనా అలవాటుగా మారితే మనం మరొకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. చిన్నప్పటి నుంచి ఉదయాన్నే లేచి చదువుకోవాలంటే అమ్మో, నాన్నో నిద్రలేపేవారు. అలారం, ఫోన్‌.. అలవాటైయ్యాక పేరెంట్స్‌పై కాకుండా గ్యాడ్జెట్‌లను నమ్ముకోవడం మొదలయ్యింది. ఇక ఫోన్‌లో అయితే ఎన్ని అలారం సెట్టింగులో... 4, 4:15, 4:30... ఇలా ప్రతి పావుగంటకి ఒకటి. చివరికి ఉదయం నాలుగుకి లేవాల్సింది ఏ ఐదుకో లేవడం. టీన్స్‌ అందరం చేసేదే. దీన్ని అధిగమించేందుకు రోజూ నేను అలారం పెట్టుకోకుండా అనుకున్న సమయానికి నిద్రలేస్తున్నా. మీకూ లేచే దమ్ముందా? 

- చంద్ర, బీబీఏ, హైదరాబాద్‌

రోజుకి రెండు పేజీలు  

ఫోన్‌ని గంటలు తరబడి చూస్తాం. నిద్రలేకుండా పోస్టింగ్‌లు చదువుతాం. మరి, చేతిలోకి పుస్తకం తీసుకుని ఎంత కాలం అయింది. పాఠ్య పుస్తకాలు కాదు. అంతకు మించినవి. అంటే మహనీయుల జీవిత చరిత్రో.. పేరొందిన నవలో.. మరేదైనా. పరిపూర్ణమైన వ్యక్తిగా మారేందుకు అవెంతో తోడ్పడతాయి. అందుకే ఇష్టమైన పుస్తకాన్ని తెచ్చుకుని కచ్చితంగా రోజులో రెండు పేజీలు చదవాలని నిర్ణయించుకున్నా. మీ సంగతి చెప్పండి.. ఛాలెంజ్‌. 

- చరణ్‌, ట్రిపుల్‌ఐటీ, శ్రీసిటీ.

నా లంచ్‌తో పాటు అందరికీ..

ఇంటరైపోయింది. ఇప్పటి వరకూ ఎప్పుడూ ఆలోచించలేదు. రోజూ అమ్మ తెల్లారేసరికి టిఫిన్‌, లంచ్‌ సిద్ధం చేసేది. ఇప్పుడు ఇంజినీరింగ్‌. ఏళ్లు గుడుస్తున్నా అమ్మకి అంతే పని. అందుకే ఆ పనిలో కొంత నేనూ తీసుకుందాం అనుకున్నా. వారంలో ఓ రోజు నా లంచ్‌ బాక్సు నేనే సిద్ధం చేసుకుంటున్నా. అలాగే, ఇంటిలిపాదీకి. అమ్మకి వారంలో ఓ ఉదయం వంటగదిలో కుర్చీ వేసి కూర్చోబెడుతున్నా. మరి, మీరు?

- సంతోష్‌, మెకానికల్‌, వెల్లూరు.

సెక్షన్‌కో చెట్టు

గేటు దాటుతుంటే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. కొత్త క్యాంపస్‌. విశాలంగా ఉంది. చెట్లు కాస్త తక్కువగా కనిపించాయ్‌. కాస్త వెలితిగా అనిపించింది. ఫ్రెషర్లందరం రానున్న హ్యాపీడేస్‌ని మరింత ఉల్లాసంగా.. ఉత్సాహంగా మార్చాలనుకున్నాం. అందుకే సెక్షన్‌కో చెట్టు చొప్పున క్యాంపస్‌లో నాటాం. ఈ నాలుగేళ్లు మా క్యాంపస్‌లో నాది అని చెప్పుకోవడానికి ఏదోటి ఉండాలిగా! సో... ఫ్రెషర్స్‌ అందరికీ ఇదే మా ఛాలెంజ్‌. మొక్కని నాటేసి... ఎఫ్‌బీలో పోస్ట్‌ చేసేయండి. 

- విష్ణు, ఈసీఈ, హైదరాబాద్‌

రోజుకు రెండు పదాలు

ఇప్పటివరకూ ఇంగ్లిష్‌లో ఒక పేరాగ్రాఫ్‌ రాయడమే కష్టం. అలాంటిది ఇక మీదట చదువంతా ఇంగ్లిష్‌లోనే. భయమైతే లేదు. ఎందుకంటే... సీనియర్స్‌ అందరూ నేనిప్పుడున్న స్థితిని దాటొచ్చినవారే. ‘క్యాంపస్‌ మనకి అన్నీ నేర్పుతుంది’ అని వారు చెబుతుంటే ధైర్యం వచ్చింది. అయితే, నేనైతే ముందు ఓ అడుగు వేయాలిగా.. అందుకే రోజుకు రెండు ఇంగ్లిష్‌ పదాలు నేర్చుకుంటా. డిక్షనరీలో అర్థం తెలుసుకొని.. సొంతవాక్యం రాస్తున్నా. నా లాంటి సమస్యే మీకుంటే ఇదో సవాల్‌!

- చిన్నికృష్ణ, ఈఈఈ, తిరుపతి.

అవగాహన అనివార్యం

శరీరంలో మార్పుల వల్ల దగ్గు, జలుబు ఎలా వస్తుందో. ఒక వయసుకి వచ్చిన ఆడపిల్లలకి నెలసరి అలానే ప్రవేశిస్తుంది. స్కూలు వయసు ఆడపిల్లల్లో సరైన అవగాహన ఉండదు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఆడపిల్లలకు ఇది పెద్ద సమస్య. ఆ రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పెద్దగా పట్టదు. దీంతో వారికి పలు రకాల సమస్యలు వస్తాయి. నేను ఆ వయస్సు నుంచి వచ్చినదాన్నే కదా! అలాంటి సమయంలో ఆసరా అయ్యేలా... అవగాహన కల్పించేలా నెలకో స్కూల్‌కి వెళ్లి అవగాహన కల్పిస్తాం. వయసులో వ్యత్యాసం తక్కువగా ఉండడంతో మాతో వారి సందేహాల్ని పంచుకోవడానికి ఇష్టపడతారు. 7 నుంచి 10వ తరగతి అమ్మాయిలకు వివరంగా చెబుతాం. కొన్ని శానిటరీ నాప్‌కిన్స్‌ని పంచుతాం. మరి, మీరో..! 

- నిఖిత, ఈసీఈ, పుదుచ్చెరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని