ప్రేమను ప్రేమతోనే గెలుద్దాం

కన్నీళ్లతో వాట్సప్‌లు నిండాయి. రక్తమోడిన పోస్టులు ఫేస్‌బుక్‌ను ముంచాయి. పత్రికలు, టీవీలు... విశ్లేషణలతో హోరెత్తించాయి. డేటాలన్నీ ప్రేమ... పెళ్లి చుట్టూనే ఖర్చయిపోయాయి. మాటలన్నీ పెద్దలు.. పిల్లలు.. అంటూ నిట్టూర్చాయి. ఎవరి భావాలు వారివి... ఎవరి అభిప్రాయాలు వారివి. తప్పు చేస్తున్నదెవరు? తప్పుగా అర్థం చేసుకుంటున్నదెవరు?

Published : 22 Sep 2018 02:08 IST

ప్రేమను ప్రేమతోనే గెలుద్దాం

కన్నీళ్లతో వాట్సప్‌లు నిండాయి. రక్తమోడిన పోస్టులు ఫేస్‌బుక్‌ను ముంచాయి. పత్రికలు, టీవీలు... విశ్లేషణలతో హోరెత్తించాయి. డేటాలన్నీ ప్రేమ... పెళ్లి చుట్టూనే ఖర్చయిపోయాయి.
మాటలన్నీ పెద్దలు.. పిల్లలు.. అంటూ నిట్టూర్చాయి. ఎవరి భావాలు వారివి... ఎవరి అభిప్రాయాలు వారివి. తప్పు చేస్తున్నదెవరు? తప్పుగా అర్థం చేసుకుంటున్నదెవరు?
తప్పుదారి పడుతున్నదెవరు? తప్పుగా ఆలోచిస్తున్నదెవరు? తప్పు ఎవరిదైనా ముప్పు ప్రేమకే జరుగుతోంది.

గౌరవనీయులైన తల్లిదండ్రులకు

నరికితే...
ప్రేమికులు చనిపోవచ్చునేమో... ప్రేమ కాదు..
విడదీస్తే...
మతాలు బతకొచ్చునేమో.. ప్రేమికులు కాదు...
పిల్లలే ప్రాణమంటారు.. ఆ పిల్లల ప్రాణాలే బలికావాలంటారు
ఎందుకు అమ్మానాన్నల్లారా..?

మీరూ మా వయసు దాటే వచ్చి ఉంటారు. మీరూ ఏదో సందర్భంలో  ప్రేమ రుచి చూసే ఉంటారే... మరి మా ప్రేమ గురించి తెలిసినప్పుడు మీ ప్రేమ రోజులు ఒక ్కసారి గుర్తు చేసుకోండి. అప్పటికీ కోపం వస్తే అప్పుడు ఆగ్రహించండి. తెలిసీతెలియని వయసులో ప్రేమించామనుకో... తెలియజెప్పండి. ప్రేమగా దగ్గరికి తీసుకొని  వివరించండి. మీ మాట ఎప్పుడూ కాదనని మేం ఎందుకు వ్యతిరేకిస్తున్నామో ఒక్కసారి మా మనసులోకి తొంగిచూడండి. మేం మీకంటే చిన్నపిల్లలం... తప్పు చేయొచ్చు.  మీరు వాటిని సరిదిద్దాలి గానీ.. తీవ్రనిర్ణయాలు తీసుకుంటే ఎలా? ఇష్టమైనవేవో నిర్భయంగా చెప్పే స్వాతంత్య్రం ఇచ్చిన మీరే ఆ స్వేచ్ఛను నొక్కిపట్టేస్తే ఎలా? ప్రేమ...  ఊపిరి... మరి దాన్ని బంధించాలనుకుంటే ఎలా? దాన్ని మీకు తగని రీతిలో, తగిన మార్గంలో తిప్పుకోవాలి. అంతేతప్ప ఆపేస్తామంటే ఎలా?

* మేం సంతోషంగా ఉండటమే మీ లక్ష్యమైతే... మేం ఇలాగే బాగుంటామంటుంటే ఎందుకు పట్టించుకోరు? ఒకవేళ మేం వెళుతున్న మార్గంలో ఇబ్బందులుంటే చెప్పండి. వీలైతే వాటిని అధిగమించేందుకు సాయం చేయండి. చిన్నప్పటి నుంచి వేలుపట్టి నడిపించిన మీరే... ఇప్పుడు వేరు చేస్తే మా మనసులు ఎంతగా విలవిలలాడతాయి? ఆస్తిపాస్తులే ముఖ్యమా? మనకు ఎక్కువ ఉన్నప్పుడు మేం ప్రేమించిన వారికి అవి ఇచ్చి ప్రోత్సహించవచ్చు కదా!

* కులం, మతం... అంత పట్టింపా? ఒకే కులంలో చేసుకున్న జంటలు బాగున్నాయా? ఒకే మతంలో చేసుకున్న దంపతులు విడిపోవడం లేదా? కులం వేరైతేనే వచ్చే ఇబ్బంది ఏంటి? మా సంతోషమే కోరుకుంటే కులం, మతం పెద్ద విషయమా? దీని కోసం ఎంతో ఇష్టమైన మమ్మల్నే ద్వేషిస్తారా?

* సమాజం ఏమనుకుంటుందో అంటారు... మనం చనిపోతేనో? చంపితేనో ఊరుకుంటుందా? అప్పుడూ అనుకుంటుంది కదా! మీ పెంపకం మీద మచ్చ పడుతుందని భయపడతారా? ప్రేమించి, పెళ్లి చేసుకొని బాగుంటే... ఏమీ అనలేదు. మీ పెంపకానికి మచ్చా రాదు. అలా మీరు మమ్మల్ని ప్రేరేపించండి. మేం నిలదొక్కుకునేలా ప్రోత్సహించండి. అప్పుడు మీ ప్రేమా గెలుస్తుంది. మా ప్రేమ నిలుస్తుంది.

ప్రియమైన పిల్లలకు...

మా కడుపు కాల్చుకొనైనా మీ ఆకలి తీరుస్తాం
మీకు దెబ్బ తగిలితే మేం కన్నీళ్లు పెట్టుకుంటాం
మీరే లోకంగా బతుకుతుంటే.. మాది వేరే లోకమంటారు మీరు!
ఎందుకు పిల్లల్లారా?

మీకు జ్వరమొస్తే... ఎన్ని రాత్రుళ్లు మేల్కొన్నామో తెలుసా? మిమ్మల్ని మంచి దుస్తుల్లో చూడటానికి మేం పాత బట్టలతోనే సరిపెట్టుకున్నామని గమనించారా? మిమ్మల్ని  మంచి చదువులు చదించడానికి మా రక్తమాంసాలనే చెమటగా మార్చామని ఊహించగలరా? మీకు గౌరవప్రదమైన జీవితం ఇవ్వడానికి ఎన్ని అవమానాలు భరిస్తున్నామో  ఆలోచించారా? మీకోసం ఇన్ని చేస్తుంటే... మమ్మల్ని, మా అభిప్రాయాలను కాలదన్ని వెళ్లిపోతారా? అప్పుడే పుట్టిన ప్రేమే ఎక్కువనుకుంటే... మీరు పుట్టకముందు నుంచే మాలో మీపై పుట్టిన మా ప్రేమ సంగతేంటి? మరి దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీ ప్రేమను గెలిపించుకోవడానికి... మా ప్రేమను చంపేయాలా?

* మీకు చిన్న దెబ్బ తగిలితే ఎంతగానో విలవిలలాడిపోయే మేం... మిమ్మల్ని హింసించడానికీ వెనుకాడటం లేదంటే మాలో ప్రేమను ఎంతగా చంపేశారో  ప్రశ్నించుకోండి. చదువు పూర్తికాదు... ముక్కుపచ్చలే ఆరవు... అప్పుడే మీరు ఎవరితోనే తిరుగుతుంటే... మాకు ఎంత కోపం వస్తుంది? ముందు బాగా చదువుకోండి.  స్థిరపడండి. తర్వాత ప్రేమ గురించి చెప్పండి. మేం ఆలోచిస్తామో? లేదో? మీకే తెలుస్తుంది!

* మీరు బాగుండటమే మా జీవితాశయం. మీరు ఎవరినో ప్రేమిస్తారు. వాళ్ల గురించి మీకు తెలిసినంత మాకు తెలియదు కదా! తెలియజెప్పండి. ప్రేమించామని చెప్పగానే ఓకే అనకపోవడానికి మాకు సవాలక్ష కారణాలుంటాయి. వాటిని ఒక్కొక్కటీ తెలుసుకొని సమాధానం ఇవ్వండి. మేం ఒప్పుకునేంత వరకూ వేచిచూడండి. ఒకవేళ మీకు వేరే సంబంధాలు చూస్తుంటే వ్యతిరేకించండి. గట్టిగా గొడవపడండి. మీకు అంగీకారం లేకుండా చిన్న వస్తువైనా ఇంట్లోకి తేకూడదనుకొనే మేం... మీ జీవితంలోకి ఇంకొకరిని  ఎలా తెస్తాం?

* మా అభిమానం, మా గౌరవానికి ఇబ్బంది లేకుండా మీ ప్రేముంటే ఎందుకు కాదంటాం? కులం, మతం, ఆస్తి, అంతస్తులు సంగతెలా ఉన్నా... మా పిల్లలు సంతోషంగా ఉండాలనేది మా ఏకైక లక్ష్యం. మరి దాన్ని సమాధాన పరచండి. అంతేగానీ ఏదో కోప్పడ్డామని ఇంట్లోంచి వెళ్లిపోతే ఎలా? జీవితంలో ఎలాంటి భరోసా లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలా? మేం ఏమైపోవాలి...? మా ప్రేమ ఏమైపోవాలి?

యువత పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు ప్రేమను వద్దనే అవకాశం ఉండదు. మరి యువత ఇలా ఎందుకు చేయడం లేదు? పెద్దలను ఒప్పించాల్సిందిపోయి. వారిని నొప్పిస్తున్నారు. వారి పెంపకాన్ని సమాజం ఎత్తిచూపేలా ప్రవర్తిస్తున్నారు.

పెద్దలూ అంతే... తమ జీవిత భాగస్వామిని ఎంచుకొనే స్వేచ్ఛ యువతకు ఉందని గ్రహించలేకపోతున్నారు. ఇంతకాలం ప్రేమను పంచిన తమను కాదని ఇంకొకరి  ప్రేమ కావాలని ఎందుకు కోరుతున్నారో తర్కించుకోలేకపోతున్నారు. తట్టుకోలేక హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు.

ప్రేమ మీద పెద్దలకు ఎందుకు నమ్మకం లేకుండా పోతోంది? ప్రేమ పెళ్లి చేసుకుంటే వారికి ఎందుకు ఆగ్రహం వస్తోంది? పిల్లలను తొలుస్తున్న ప్రశ్నలివి.

పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లిళ్లు చేసుకోలేరా? ఒప్పుకునేంత వరకూ వేచి ఉండలేరా? పెద్దల మెదళ్లలో రేగుతున్న ప్రశ్నలివి.

ప్రణయ్‌ హత్యోదంతం, మాధవిపై హత్యాయత్నం నేపథ్యంలో ఈ ప్రశ్నలు మరింత పదునెక్కి... ప్రతీ ఒక్కరి మనసును కలచివేస్తున్నాయి. ఈ సందర్భంలో... కొంతమంది యువత,  తల్లిదండ్రులతో ‘ఈతరం’ మాట్లాడింది. వారి మనసుల్లోని భావాలను  అక్షరీకరిస్తే...!

* ప్రవీణ్‌, ప్రత్యూష ఇంజినీరింగ్‌లో ప్రేమించుకున్నారు. తొందరపడలేదు. తల్లిదండ్రులను ఎదిరించలేదు. చదువు విజయవంతంగా పూర్తిచేశారు. పీజీలు చేశారు. మంచి  ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు. మతాలు వేరైనా... వారి అప్రోచ్‌ నచ్చి పెద్దలు పెళ్లికి ఒప్పుకొన్నారు.

* ప్రవీణ్‌, ప్రత్యూషలది తెలిసీతెలియనీ వయసు కాదు. చదువులు పాడు చేసుకోలేదు. ఎలా బతుకుతారోనన్న భయం తల్లిదండ్రులకు లేకుండా చేయగలిగారు. ప్రేమను  పెళ్లిగా మార్చుకొని జీవితాన్ని పూలబాటగా చేసుకున్నారు.

* భార్గవ్‌, భారతి డిగ్రీ చదువుతూ ప్రేమించుకున్నారు. భార్గవ్‌ వాళ్లది దిగువ మధ్య తరగతి. భారతి స్థితిమంతురాలే. ఇద్దరూ కలిసి బయట తిరుగుతుంటే పెద్దలకు విషయం తెలిసింది. మందలించారు. ఇద్దరినీ దూరంగా ఉంచారు. అయినా వీరు సహనం కోల్పోలేదు. ఎలాగైనా కష్టపడి చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత  ఇంట్లో చెప్పాలనుకున్నారు. భార్గవ్‌ గ్రూప్స్‌లో మంచి ఉద్యోగం సాధించాడు. అప్పుడు వెళ్లి ఇంట్లో అడిగారు. భారతి ఇంట్లో అడ్డుచెప్పడానికి ఏమీ లేక పోయింది.

* ప్రేమ ఇంట్లో తెలిసిపోయి వారు అడ్డగిస్తున్నారని ఆవేశానికి గురికాలేదు భార్గవ్‌, భారతి. ఇంట్లోంచి వెళ్లిపోవడం లాంటి పనులు చేయలేదు. పెద్దలతో గొడవలకు  దిగలేదు. ఓర్పుతో ప్రేమనూ, జీవితాన్ని నిలబెట్టుకున్నారు.   - ప్రేమ సఫలం చేసుకోవడానికి ఇలా ఎన్నో మార్గాలున్నాయి.

ఒక వేదిక అవసరం

పిల్లల మీద ఆశలన్నీ పెట్టుకుంటారు తల్లిదండ్రులు. వారు తమ మాట కాదనకూడదని అనుకుంటారు. వారికి అలివికాని ప్రేమను పంచుతారు. ఒక్కసారిగా పిల్లలు ప్రేమ విషయంలో ఎదిరిస్తే... తట్టుకోలేరు. తమను ధిక్కరిస్తున్నారని ఆవేశపడిపోతారు. తమ అధికారాన్ని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పిల్లలకు ఇవి నచ్చక  ఇంట్లోంచి వెళ్లిపోవడం, పెళ్లి చేసుకోవడం... లాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది తల్లిదండ్రుల్లో మరింత అసహనాన్ని పెంచుతుంది. అదే నేరాలకు దారితీస్తుంది. పిల్లలకు ఓర్పు లేకపోవడం, జీవితభాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ పిల్లలకు ఉందని పెద్దలు గుర్తించకపోవడం వల్ల సమస్యలు మరింత జఠిలంగా మారతున్నాయి.  ఇలా కాకుండా ఉండటానికి ప్రేమకు సంబంధించి తమ సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక ఉండాలి. యువతైనా, పెద్దలైనా ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు... ఆ వేదికను ఆశ్రయించే వెసులుబాటు కల్పించాలి. అప్పుడు పరిష్కారాలు దొరికే అవకాశాలున్నాయి.

- డా. వీరేందర్‌, సైకాలజిస్ట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని