అక్కా అంటూనే ముంచేశాడు!

అక్కా అని ఆప్యాయతగా పిలిస్తే అమ్మలా ఆదరించింది. బాగు పడతాడని వెలకట్టలేని సాయం చేసింది. కానీ... ఆ నమ్మకద్రోహి ఏం చేశాడు? 'ఉషా త్వరగా తయారవ్వు. ఆసుపత్రిలో ఉన్న..

Published : 14 Jan 2016 12:46 IST

అక్కా అంటూనే ముంచేశాడు!


అక్కా అని ఆప్యాయతగా పిలిస్తే అమ్మలా ఆదరించింది. బాగు పడతాడని వెలకట్టలేని సాయం చేసింది. కానీ... ఆ నమ్మకద్రోహి ఏం చేశాడు?
'ఉషా త్వరగా తయారవ్వు. ఆసుపత్రిలో ఉన్న నా ఫ్రెండ్‌ని చూసొద్దాం'... శ్రీవారి కేకతో కంగారు మొదలైంది. 'సీరియసేం లేదులే. చిన్న జబ్బే' నా గాబరా గమనించి ఆయనే చెప్పడంతో వూపిరి పీల్చుకున్నా. నా మనస్తత్వమే అంత. నా అన్నవాళ్లు కష్టాల్లో ఉంటే తట్టుకోలేను. మావారూ అంతే.

పలకరింపులయ్యాయి. పండ్ల సంచి ఆయన చేతిలో పెట్టి లేవబోతుంటే పక్కబెడ్ నుంచి ఒక్కసారిగా అరుపులు, కేకలు. ఒళ్లంతా కాలిన ఓ అమ్మాయి దీనంగా అరుస్తోంది. బయటికొస్తుంటే ఆమె తాలూకు బంధువులు కనిపించారు. మనసు కలుక్కుమంది. ఉండబట్టలేక మీ అమ్మాయికేమైందనడిగా. 'దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంటే ప్రమాదవశాత్తు అంటుకుంది' ఏడుస్తూనే చెప్పారు ఆమె అన్నావదినలు. అమ్మానాన్నలు లేరట. చాలా పేద కుటుంబం. ఇప్పటికే చికిత్సకు చాలా ఖర్చైందట. చెల్లెలి కోసం ఆ అన్నయ్య పడుతున్న తపన చూసి నా కళ్లు చెమర్చాయి. ఐదువేలు వాళ్ల చేతిలో పెట్టి అక్కణ్నుంచి కదిలాం.

రెణ్నెళ్త్లెంది. 'నేనండీ ప్రసాద్‌ని. ఆరోజు మీరు మాకు సాయం చేశారు. మా చెల్లి పూర్తిగా కోలుకుంది. మీ మేలు మర్చిపోలేం. మరోసారి థాంక్స్' అన్నాడు ఫోన్ చేసి. తర్వాత అప్పుడప్పుడు పలకరించి యోగక్షేమాలు అడిగేవాడు. అభిమానం కురిపించేవాడు. అతడి మాటల్లో నిజాయతీ కనిపించేది. ఓసారి నేనే ఇంటికి ఆహ్వానించా. తర్వాత రాకపోకలు పెరిగాయి. నన్ను అభిమానంతో 'అక్కా' అనేవాడు. పిల్లలు మామయ్యా అంటూ తనచుట్టే తిరిగేవారు. చిన్నచిన్న పనులుంటే క్షణాల్లో చేసిపెట్టేవాడు ప్రసాద్. రక్తం పంచుకు పుట్టిన అక్కా తమ్ముడిలా మా బంధం బలపడింది.
ఏడాది గడిచింది. 'అక్కా నేనో చీటీ పాడా. హామీ సంతకం పెట్టవా?' అన్నాడోరోజు. ట్రావెల్స్ వ్యాపారం పెడతాడట. రెండ్రోజులు ఆలోచించాం. మేం ఆదుకుంటే వాళ్ల కుటుంబం బాగుపడుతుంది. మా చేతి అన్నం తిన్నవాడు మోసం చేయడనే భరోసాతో సంతకం పెట్టా. కొద్దిరోజులకే ఇంకో లారీ కొనాలన్నాడు. ఈసారి మావారి వంతు. ఏడాదిపాటు చీటీ డబ్బులు బాగానే కట్టాడు. ఆ తర్వాతే మొదలైంది మమ్మల్ని నిలువునా ముంచే కార్యక్రమం. రోజూ ఇంటికొచ్చేవాడు వారం రోజులుగా పత్తా లేడు. ఫోన్ కూడా చేయలేదు. మనసేదో కీడు శంకించింది. వాళ్లింటికి పరుగెత్తాం. 'రెండ్రోజుల కిందటే కుటుంబమంతా వేరే వూరెళ్లిపోయారుగా' పక్కింటివాళ్ల మాటతో మా గుండెలు బద్ధలయ్యాయి.

పదిరోజులు ఇంట్లో మౌనవ్రతం. ఏం చేయాలో తెలియలేదు. ప్రసాద్ బంధువులిళ్లకెళ్లాం. 'ప్రసాద్ పారిపోయాడా? తనలాంటివాడు కాదే?' మమ్మల్నే ఎగాదిగా చూశారు. తనే వస్తాడని కొండంత ఆశతో ఎదురుచూశాం. నెలలు, ఏళ్లు గడిచినా రాలేదు. డబ్బులు కట్టమంటూ నోటీసులు మాత్రం వచ్చాయి. అప్పులు చేసి, నగలు తాకట్టు పెట్టి పది లక్షలు చెల్లించాం. ఆ పీడ వదలడానికి నాలుగేళ్లు పట్టింది.

మనిషి కష్టాల్లో ఉంటే సాటి మనిషిగా స్పందించాం. ఆప్యాయత చూపుతున్నాడని ఆదుకోవాలనుకున్నాం. అదే మా కొంప ముంచింది. ఇప్పుడు ఎవరికైనా రూపాయి సాయం చేయాలన్నా మనసొప్పడం లేదు. మంచితనానికైనా హద్దుండాలి అని మా పెద్దలంటుండేవాళ్లు. అప్పుడర్థం కాలేదు. ఇప్పడు అనుభవంలోకి వచ్చింది. ఇలాంటి ప్రసాద్‌లు కాచుకొని ఉంటారు జాగ్రత్త.

 
- ఉషారాణి, తిరుపతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని