ఆన్‌లైన్‌ ప్రేమ.. ఆశయాన్ని చిదిమేసింది

బాగా చదవాలి.. మంచి జాబ్ కొట్టాలి.. ఇదీ నా లక్ష్యం. మొదట్నుంచీ సరదాలు, ప్రేమలకు దూరంగా ఉన్నా. ఫలితం.. బీటెక్లో ప్రాంగణ నియామకానికి ఎంపికయ్యా. చేరడమే తరువాయి. కలకు అడుగు దూరంలో నేను.

Published : 14 Jan 2016 12:53 IST

ఆన్‌లైన్‌ ప్రేమ.. ఆశయాన్ని చిదిమేసింది 


బాగా చదవాలి.. మంచి జాబ్‌ కొట్టాలి.. ఇదీ నా లక్ష్యం. మొదట్నుంచీ సరదాలు, ప్రేమలకు దూరంగా ఉన్నా. ఫలితం.. బీటెక్‌లో ప్రాంగణ నియామకానికి ఎంపికయ్యా. చేరడమే తరువాయి. కలకు అడుగు దూరంలో నేను.

ఖాళీగా ఉన్నానని ఓరోజు ఫేస్‌బుక్‌ తెరిచా. ఓ అబ్బాయి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌. అందంగా ఉన్నాడు. మంచి ఉద్యోగం. బుద్ధిమంతుడనుకొని ఓకే చేశా. ‘హాయ్‌.. ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు’ మర్నాడే సందేశం. నేనూ స్పందించా. పలకరించే తీరు, మాటల్లో మర్యాద నన్నాకట్టుకున్నాయి. ఎప్పుడూ ఏ కుర్రాడ్నీ పట్టించుకోని నేను తన మెసేజ్‌ కోసం ఎదురుచూసే స్థాయికి చేరా.

చాటింగ్‌ మాటల్లోకి మారింది. తన గొంతు వినకపోతే ప్రాణం పోయేది. తనూ అంతే ఆపేక్ష చూపేవాడు. ఇదిలా కొనసాగుతుండగానే ‘నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా’ అన్నారు నాన్న. ఆలస్యం చేయలేదు. మనోహర్‌తో పరిచయం, ప్రేమ అన్నీ చెప్పేశా. ఒకర్నొకరు నేరుగా చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ప్రేమేంటని ఆశ్చర్యపోయారు. అమ్మతో ప్రతీది పంచుకునేదాన్ని. ప్రేమ విషయం దాచినందుకు చాలా నొచ్చుకుంది. అయినా వాళ్లేం నాపై అరవ లేదు. బంధించలేదు. వాళ్లకి నేనంటే ప్రాణం. ‘సరే.. తను, తన కుటుంబం మంచిదైతే పెళ్లికి ఒప్పుకుంటాం’ అన్నారు. అంతా అనుకూలంగా ఉండాలని ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో.

వారమయ్యాక ప్రేమ ఫలితాలొచ్చాయి. నాకు ప్రతికూలంగా. ‘అబ్బాయి ఓకే. అతడి కుటుంబ వివరాలే బాగా లేవు’ అన్నారు నాన్న. ఆధారాలూ చూపారు. నా నోట మాట లేదు. ‘నాక్కొంచెం సమయం ఇవ్వండి. ఏది మంచో, ఏది చెడో తెలుస్తుంది’ అంటే ఒప్పుకున్నారు. జరిగిందంతా మనోహర్‌కి వివరించా. నాకోసం పోరాడుతున్నావ్‌. నువ్‌ నా పాలిట ప్రేమదేవతవన్నాడు. అతడిపై ప్రేమ రెట్టింపైంది. కానీ ఎన్నిరోజులు గడిచినా మావాళ్లు కోరినట్టు అతడి కుటుంబం గురించి మంచి ఆధారం చూపలేకపోయా.

అన్నీ అనుకూలంగా ఉంటే అమ్మానాన్నలు మా ప్రేమను ఆశీర్వదించేవాళ్లే. నాకాదృష్టం లేదు. నేనూ కన్నవాళ్లని గౌరవించాల్సిందే! ‘మనోహర్‌.. నన్ను మర్చిపో. నేను నీ జీవితంలోకి రాలేదనుకో’ అని మెయిల్‌ పెట్టా. బాధ దిగమింగుకుంటూనే. ఈ సమయంలోనే శిక్షణకు రావాలంటూ కంపెనీ నుంచి పిలుపు. వెళ్లా. ‘ప్లీజ్‌ ఒక్కసారి మాట్లాడు’ అంటూ తన నుంచి వరుస మెసేజ్‌లు, మెయిళ్లు. బాధతో పనిపై దృష్టిపెట్టలేకపోయా. అయినా ఏం చేయలేని దుస్థితి. ఈలోపు ఓ విదేశీ సంబంధం వచ్చింది. నాలోనూ స్వార్ధం ప్రవేశించింది. ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పా. ముహుర్తాలు పెట్టుకునే సమయానికి ఎక్కువ కట్నం ఇస్తున్నారని అతడు మరో అమ్మాయికి తాళి కట్టాడు. చాలా ఫీలయ్యా. ఆ బాధ చాలదా అన్నట్టు శిక్షణలో పరీక్షలు క్లియర్‌ చేయలేదని ఆఫీసు నుంచి వెనక్కి పంపారు. ఈసారి దుఃఖం ఆగలేదు. ఈ బాధ నుంచి తేరుకోకముందే అమ్మానాన్నలు మరో సంబంధం తెచ్చి పెళ్లి చేశారు.

చదువయ్యేదాకా నా జీవితం నా చేతుల్లోనే ఉండేది. ఎప్పుడైతే ఫేస్‌బుక్‌కి అతుక్కుపోయానో అప్పట్నుంచే వూహించని మలుపులు తిరిగింది. ఏదేమైనా నావల్ల ఒకరు నష్టపోయారనే బాధ ఇప్పటికీ వెంటాడుతోంది. అందుకే అతడ్ని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. ‘మనోహర్‌.. ప్రేమించడానికి రెండు మనసులు చాలు. ఆ ప్రేమ ఫలించి ఇద్దరు ఒక్కటవ్వాలంటే మాత్రం రెండు కుటుంబాలూ కలవాల్సిందే. నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్లు ఏడిస్తే నేను సుఖంగా ఉండలేను. అందుకే అలా చేయాల్సి వచ్చింది’.

ఫ్రెండ్స్‌.. empty mind is devils workshop అంటారు. ఫలిస్తుందో, లేదో తెలియని ఆన్‌లైన్‌ ప్రేమ కోసం కెరీర్‌ని పణంగా పెట్టకండి. ఉన్న సమయాన్ని ప్రతిభ పెంచుకోవడానికి ఉపయోగించండి. నేనలా చేసి ఉంటే నా స్వప్నం నెరవేరేదే. నా మాట వింటారని ఆశిస్తున్నా.

- కిరణ్మయి (పేర్లు మార్చాం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు