వద్దు గురూ ఇలాంటి స్నేహాలు

చురుకైన, తెలివైన అమ్మాయిన్నేను. సొంతడబ్బా కాదిది. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరిదీ ఇదేమాట. పది వరకూ సొంతూళ్లొ చదివా. ఇంటర్ కరీంనగర్లో. ప్రతిభకుతోడు అందరితో సఖ్యంగా ఉండటంతో...

Published : 14 Jan 2016 12:55 IST

వద్దు గురూ ఇలాంటి స్నేహాలు


 చురుకైన, తెలివైన అమ్మాయిన్నేను. సొంతడబ్బా కాదిది. నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరిదీ ఇదేమాట. పది వరకూ సొంతూళ్లొ చదివా. ఇంటర్‌ కరీంనగర్‌లో. ప్రతిభకుతోడు అందరితో సఖ్యంగా ఉండటంతో కాలేజీలో నేనందరికీ ఇష్టం. రెండేళ్లు జాలీగా గడిచాయి. పైచదువులకోసం సిటీ బస్సెక్కక తప్పలేదు. అప్పుడైతే ఏడుపే.

క్లాసులో స్వీటీ బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మాది ఒకే క్లాసు, ఒకే బెంచీ. హాస్టల్‌ వేరే. అయితేనేం? ఎవరికి ఖాళీ ఉన్నా ఇంకొకరి గదిలో వాలిపోయేవాళ్లం. మమ్మల్నంతా ‘ఒకే గూటి పక్షులు’ అనేవాళ్లు. కొన్నాళ్లకి మేం ఒకే హాస్టల్‌ గదికి మారాం. అప్పట్నుంచి ఒకే తనువు, ఒకే మనసులా మెలిగేవాళ్లం.

వేసవి సెలవులిచ్చారు. స్వీటీని చూడకుండా, మాట్లాడకుండా ఉండటం నావల్ల కాలేదు. ఎప్పుడెప్పుడు కాలేజీ తెరుస్తారా అని ఎదురుచూశా. తను కనపడగానే పరుగెత్తి ఆనందంగా హత్తుకున్నా. కానీ స్వీటీ ఉలకదూ పలకదు. ఎదురుపడితే తల తిప్పుకునేది. నోరు తెరిస్తే మూతి ముడుచుకునేది. నిలదీస్తే ‘నువ్వంటే పిచ్చి పెంచుకుంటున్నా. ఇదిలాగే కొనసాగితే ఏమైపోతానో అని భయమేస్తోంది. అందుకే దూరంగా ఉంటున్నా’ అంది. ఆ సమాధానంతో నిజంగానే తను పిచ్చిదానిలా కనిపించింది. అయినా తమాయించుకొని ‘స్నేహంలో ఇవన్నీ భాగమే. ఎవరికేం కాదు. మునుపటిలా ఉండు’ అని నచ్చజెప్పా. ‘అయితే నేను చెప్పినట్టు వినాలి’ షరతు పెట్టింది. సరేనన్నా.

అప్పట్నుంచి ప్రత్యక్ష నరకం చూపించేది. ‘నువ్వు నాతోనే ఉండాలి. నాతోనే మాట్లాడాలి’ అనేది. ఎవరితోనైనా సన్నిహితంగా ఉంటే గొడవ, ఏడుపు. అమ్మాయిలైనా, అబ్బాయైనా. ఏం చేయాలో అర్థం కాకపోయేది. ఇంకొన్నాళ్లకైతే ఏకంగా బెదిరింపులకే దిగింది. అలాగని తనని వదల్లేను. కాదని వేరొకరితో మాట్లాడలేను. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని భయం. నా లవర్‌ నానీతో ఇవన్నీ చెప్పుకొని ఏడ్చేదాణ్ని.

స్వీటీని ఎలాగైనా మార్చాలని నా పాకెట్‌మనీతో ఓ సైకాలజిస్టు దగ్గరికి తీస్కెళ్లా. మనోవ్యాధి ముదిరిందన్నారు. వెంటనే చికిత్స ప్రారంభించాలనీ, పదివేలు ఖర్చవుతుందన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు. ఇక తను చెప్పినట్టే వినడం మొదలెట్టా. నా స్నేహితులందరికీ దూరమయ్యా. పోనీలే.. జీవితంలో ఒక్క బెస్ట్‌ఫ్రెండ్‌ అయినా మిగులుతుందని సర్దిచెప్పుకున్నా. ఇన్ని బాధలు అనుభవిస్తూనే బీటెక్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి బంగారు పతకం అందుకున్నా.

ఏడాది గడిచింది. ఇప్పుడు ఆ ఒక్కగానొక్క స్నేహితురాలూ నాతో లేదు. ఏమైందో తెలియదుగానీ మా చదువులయ్యాక నాతో మాట్లాడ్డం తగ్గించింది. ఈ గందరగోళంలో ఉండగానే నాకు నానీతో పెళ్లైంది. తర్వాత కొన్నాళ్లకు నేనే ఫోన్‌ చేశా. అవే పొడిపొడి మాటలు. ఆపై నాకు పాప పుట్టింది. అప్పుడే తన పెళ్లి కుదిరింది. రమ్మంటూ శుభలేఖ పంపింది. పాపకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో వెళ్లలేకపోయా. దాన్ని తప్పుగా అర్ధం చేసుకుందో లేక నాపై ద్వేషం పెంచుకుందో ఫోన్‌ నెంబర్‌ మార్చేసింది. జీమెయిల్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలు డిలీట్‌ చేసింది. అసలు తనను కలిసే, మాట్లాడే వీలు లేకుండా చేసింది. ఎందుకిలా చేసిందో? ఆ చిత్రమైన వైఖరేంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. తన కోసం నేను నా స్నేహితుల్ని వదులుకున్నా. చిన్నచిన్న ఆనందాలకు దూరమయ్యా. తన వెంటే ఉండి అనుక్షణం నరకం అనుభవించా. బహుమానంగా నన్నో శత్రువులా భావించి తనే కనుమరుగైంది. సంతోషంలో, ఆపదలో తోడుండేవారు నిజమైన స్నేహితులు. నాకు ఆపదలు తెచ్చిపెట్టినా తనే నా ఫ్రెండ్‌ అనుకున్నా. కానీ దారుణంగా మోసం చేసింది. ఇలాంటి స్నేహం విలువ తెలియనివాళ్ల కోసం ఎవరూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు.

- అనసూయ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని