ఇద్దరు అమ్మాయిల మధ్య...ఏకాకి!

మామిడి తోరణాలు.. బంధువుల హడావుడి.. ఇల్లంతా సందడిగా ఉంది. తెల్లారితే మరదలితో పెళ్లి. కళ్ల ముందు మెదులుతున్న కలర్ఫుల్ జీవితాన్ని వూహించుకుంటున్నా.

Published : 14 Jan 2016 13:37 IST

ఇద్దరు అమ్మాయిల మధ్య...ఏకాకి! 


మామిడి తోరణాలు.. బంధువుల హడావుడి.. ఇల్లంతా సందడిగా ఉంది. తెల్లారితే మరదలితో పెళ్లి. కళ్ల ముందు మెదులుతున్న కలర్‌ఫుల్‌ జీవితాన్ని వూహించుకుంటున్నా. ఇంతలో అనుకోని ఉపద్రవం. పెళ్లి పనుల్లో ఉండాల్సిన మామయ్య తన కూతుర్ని కిడ్నాప్‌ చేశానంటూ ఇంటి మీదకు గొడవకొచ్చాడు. నాకేం అర్థం కాలేదు. నాక్కాబోయే భార్యని నేనెందుకు కిడ్నాప్‌ చేస్తా? అదే అడిగా. ‘నువ్వూ.. నీ గర్ల్‌ఫ్రెండ్‌ కలిసి చేశారీపని’ మరో మాట తూలాడు. వెంటనే స్రవంతికి ఫోన్‌ కలిపా. లౌడ్‌స్పీకర్‌ ఆన్‌ చేశా. ‘నీ మరదలెవరు? తనతో నాకేం పని? ఇలా అడగడానికి నీకేమైనా బుద్ధుందా’ తిట్టి మరీ ఫోన్‌ పెట్టేసింది. ఆఖరికి తెలిసిందేంటంటే ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని నా మరదలే ఓ ఫ్రెండ్‌ ఇంట్లో దాక్కుందట. ఇది తెలియగానే నేను షాక్‌. అసలిదంతా ఎందుకు జరిగిందంటే నా కథంతా మీకు తెలియాల్సిందే.

మరదలు పుట్టగానే నాకు పెళ్లాం పుట్టిందన్నారు పెద్దవాళ్లు. అచ్చం సినిమాల్లోలాగే. వాళ్ల అభీష్టాన్నే మా ప్రేమగా మార్చుకున్నాం. అలకలు.. గిల్లికజ్జాలు.. ఒకరిపై ఒకరికి చచ్చేంత అభిమానం.. బాల్యం నుంచి యవ్వనం దాకా మా మధ్య ముడిపడ్డ ముచ్చట్లెన్నో. అంతలా.. ప్రాణంలా ప్రేమించిన అమ్మాయిలో ఒక్కసారిగా వూహించని మార్పు. ఉద్యోగం కోసం తను పుణె వెళ్లొచ్చింది. నాకు టార్చర్‌ మొదలైంది. ‘బావా.. నిన్ను పెళ్లి చేసుకున్నవాళ్లెవరూ రెణ్నెళ్ల కంటే ఎక్కువ రోజులు కాపురం చేయలేరు’ అందోపూట. వేళాకోళమనుకున్నా. ఆపై దగ్గరికెళ్తే మొహం తిప్పుకునేది. పలకరిస్తే కళ్లెర్రజేసేది. మరదలి తీరు చిరాకు తెప్పించేది. తిరిగెళ్లాక కూడా అదేవరుస. ఫోన్‌ చేయదు. చేస్తే తీయదు. విసిగిస్తున్నానని ఫోన్‌ నెంబరే మార్చేసింది. తన మాట నా చెవిన పడక దాదాపు పిచ్చివాణ్నయ్యా.

మోడు వారుతున్న జీవితంలోకి వసంతంలా వచ్చింది స్రవంతి. గాయపడ్డ మనసుకి మంచి మాటలతో మందేసింది. దగాపడ్డ మనిషికి ప్రేమ పంచింది. ‘తన కోసం నువ్వెందుకు వెంపర్లాడటం.. నిన్ను కాదన్నందుకు తనేడవాలిగానీ’ అంటూ వూరడించింది. నా గతం తెలిసీ ప్రపోజ్‌ చేసింది. రెండేళ్లు మేం లవర్స్‌ అన్న విషయం ఎవరికీ తెలియనంత పద్ధతిగా ప్రేమించుకున్నాం.

ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగానికి ఎంపికయ్యా. మరదలితో పెళ్లికి రాయబారం పంపాడు మామయ్య. నేనంటే తనకిష్టం లేదు.. ఈ పెళ్లెలాగూ జరగదనుకుంటూ వాయిదాలు వేశా. సమయం చూసి స్రవంతితో నా ప్రేమ విషయం చెప్పాలనేది ప్లాన్‌. అయితే అనూహ్యంగా మరదలు పెళ్లికి ఒప్పుకుంది. ‘నువ్వూ ఒప్పుకోకపోతే మేం ఆత్మహత్య చేసుకుంటాం’ బెదిరించారు కన్నవాళ్లు. నా ప్రమేయం లేకుండానే ముహుర్తం పెట్టేశారు.

ఉద్యోగంలో చేరడానికి చెన్నై వెళ్లా. మరోవైపు పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇంకా నాన్చితే నష్టమని జరిగిందంతా స్రవంతికి చెప్పా. నీదే నిర్ణయమన్నా. నేనూహించని మాట చెప్పింది. ‘ముహుర్తాలు పెట్టుకున్నారుగా.. ఇక స్నేహితుల్లా విడిపోదాం’ అంది. ఆ షాక్‌ నుంచి కోలుకోక ముందే మరదలి మెసేజ్‌. ‘స్రవంతి ఎవరు? తనకూ నీకూ సంబంధమేంట’ని. కోపంతో మా లవ్‌స్టోరీ చెప్పేశా. నన్నిష్టపడనిదానివి నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావని నిలదీశా. తప్పు చేశానంది. అన్నీ మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకుందామంది. చేసేదేం లేక నేనూ రాజీకొచ్చా. కానీ నావల్ల స్రవంతి నష్టపోయిందనే అపరాధభావం కుంగదీసేది. తన కోసమే హైదరాబాద్‌ వచ్చేశా. కెరీర్‌ పరంగా, ఆర్థికంగా తోడు నిలిచా. పరోక్షంగా తనకో మంచి సంబంధం కుదిర్చా. ముగ్గురికీ ఆమోదయోగ్యమైన కొత్త జీవితం మొదలు కాబోతోందనే భరోసా కలిగింది నాలో.

అంతా ఓకే అనుకుంటుంటే ఇదిగో ఈ పెళ్లికూతురు జంప్‌. నా లవర్‌ని పెళ్లాడటానికి నువ్వెవరని స్రవంతి అడగటంతోనే అలా చేశానంది మరదలు. సామరస్యంగా విడిపోదామన్న మాజీ ప్రేయసి ఇలా చేస్తుందనుకోలేదు. ఏదేమైనా నా పెళ్లి పెటాకులైంది. పరువు గంగ పాలైంది. నేనే అందరిలో చెడ్డవాడిగా మిగిలిపోయా. ఇద్దరమ్మాయిల్ని ప్రేమించి, ఒక్కరితో జీవితం పంచుకోవాలనుకున్నా ఆ ఇద్దరి చంచల మనస్తత్వంతో ఏకాకిగా మిగిలిపోయా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని