అనురాగంలో అపశృతి!

ఇద్దరక్కలు, పెద్దబావ, వాళ్ల బావలతో ఇల్లంతా సందడిగా ఉంది. రారా పెళ్లికొడకా అన్నారు బావకి బావ నేనింట్లో అడుగు పెడుతుంటే. విషయం అర్థమైంది. కొద్దిరోజులుగా నన్నో ఇంటివాడ్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వాళ్లు

Published : 14 Jan 2016 13:40 IST

అనురాగంలో అపశృతి! 


ద్దరక్కలు, పెద్దబావ, వాళ్ల బావలతో ఇల్లంతా సందడిగా ఉంది. ‘రారా పెళ్లికొడకా’ అన్నారు బావకి బావ నేనింట్లో అడుగు పెడుతుంటే. విషయం అర్థమైంది. కొద్దిరోజులుగా నన్నో ఇంటివాడ్ని చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వాళ్లు. ఇప్పుడేదో సంబంధం తెచ్చినట్టున్నారు. ‘అమ్మాయిని చూడాల్సిన పన్లేదు. మీరే అన్నీ మాట్లాడేయండి’ అన్నా నవ్వుతూ. మనస్ఫూర్తిగా నా మంచి కోరే బంధువులపై నమ్మకంతో.

నా విషయానికొస్తే బీఈడీ పూర్తైంది. ప్రైవేటు స్కూళ్లొ ఉపాధ్యాయుడిగా చేస్తూనే ఎమ్మెస్సీ చదువుతున్నా. నేను ఓకే అన్నా నన్ను చూడాలన్నారు వాళ్లు. వెళ్లాం. అమ్మాయి సిగ్గులమొగ్గైంది. అన్నీ కుదిరి ముహుర్తం పెట్టేసుకున్నాం. నేనైతే ప్రత్యేకంగా తనకో ముత్యాలహారం ఇచ్చా. ఆపై ఫోన్లో కబుర్లు, బైక్‌పై షికార్లు. ముద్దూముచ్చట్లకు కొదవేలేదు. వారంలో పెళ్లనగా అమ్మాయి మేనత్త పిలిచింది. ‘బాబూ ఓసారి నీ సర్టిఫికెట్స్‌ తీసికొచ్చి చూపించు’ అంది ఆర్డరేస్తున్నట్టు. అడిగిన పద్ధతేం బాగోలేదు. పీకల్దాకా కోపమొచ్చినా, గొడవొద్దని ఆమె చెప్పినట్టే చేశా.

పెళ్లి ఘనంగా జరిగింది. అప్పగింతలవేళ అందరమ్మాయిల్లా ఏడవకుండా నవ్వుతూనే ఉంది నా భార్య. మేళం వాళ్లతో సహా అంతా వింతగా చూశారు. ‘కొందరైతే మీది లవ్‌ మ్యారేజీనా’ అనడిగారు. నాపై ప్రేమతో అలా ప్రవర్తిస్తుందనుకున్నా. రెండోరోజు మరో ట్విస్టు ఇచ్చింది. ప్రతి మగాడు తన జీవితంలో ఉత్కంఠగా ఎదురుచూసే రోజది. కానీ నా తొలిరాత్రి కాస్తా కాళరాత్రిలా మారింది. ప్రేమగా దగ్గరికెళ్తే విసురుగా తోసింది. మురిపెంగా మాట్లాడితే కసురుతూ మొహం తిప్పుకుంది. మూడ్రోజులూ అదే తంతు. చిన్నపిల్లని సర్దుకుపోయా. వారాలు మారినా సీన్‌ మారలేదు. ఓరోజు గట్టిగా నిలదీశా. ‘మా మేనత్త ఇలాగే చేయమంది’ అనేసరికి నిర్ఘాంతపోయా. రాన్రాను నాలో చిరాకు, కోపం ఎక్కువయ్యాయి. అది చూసైనా మారాలిగా! వూహూ.. పైగా ‘నువ్వేమైనా అంటే అత్త దగ్గరికెళ్తా’ అని బెదిరించేది. ఓసారి అదే నిజం చేసింది. చిన్న మాటన్నానని గడప దాటబోయింది. ఆపడానికి ప్రయత్నిస్తే నాపైనే చేయి చేసుకుంది.

సంబంధం కుదిర్చిన అన్నయ్యని తీస్కొని వెళ్లా. ‘ఇష్టం లేని పెళ్లి చేశారు. తను రాదు’ నిర్లక్ష్యంగా చెప్పింది వాళ్లత్త. ఎవరు బలవంతం చేశారు? ఎందుకు చేశారు? మరి పెళ్లి కాకముందు నాతో సంతోషంగా ఉన్న రోజుల మాటేంటి? దేనికీ సమాధానం లేదు. ఓపిక నశించి కొన్నాళ్లకి పంచాయతీ పెట్టించాం. ‘తాగొచ్చి కొడుతున్నాడు. అందుకే వెళ్లను’ అంటూ అడ్డంగా అబద్ధం ఆడేసింది నా పెళ్లాం. టీ, కూల్‌డ్రింక్‌ అలవాటు లేని నన్ను అందరిముందూ తాగుబోతుని చేసింది. అయినా పట్టించుకోకుండా రమ్మని బతిమాలా. విన్లేదు. నెల్లాళ్ల నిరీక్షణ ఫలించలేదు. విడాకులు తీస్కొమ్మన్నారు సన్నిహితులు. కానీ మనిషిగా ఆలోచించా. నా బాధంతా తన, తనవాళ్ల గురించే. మామయ్య అత్తమ్మని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. బామ్మర్ది చిన్నప్పుడే చదువాపేసి టీకొట్టు పెట్టుకొని డబ్బులు కూడబెట్టి అక్క పెళ్లి చేశాడు. దూరపు బంధువని మా బావ వాళ్ల బావ కూడా ఆర్థికసాయం చేశాడు. ఇప్పుడు మేం విడిపోతే వాళ్లందరి పరిస్థితేంటి? ఇవేం ఆలోచించదే! దీనంతటికీ కారణం వాళ్ల మేనత్తే. మా పెళ్లపుడు పసుపుకుంకుమల కింద ఇస్తానన్న భూమి ఇవ్వలేదని కక్ష కట్టి అలా చేయిస్తోందట. ఆమె చెప్పుడు మాటలలతో నా భార్య ఆడించినట్టల్లా ఆడుతోంది. ఈ మనసులో మాట చదివాకైనా తను మారుతుందనీ, నా చెంతకొస్తుందని ఆశిస్తున్నా.

- సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని