చెలి గేలిచేసింది... జీవితం గెలిచేసింది!

మనసుపడ్డ అమ్మాయికో ముద్దుపేరు పెట్టుకున్నాడు. కొన్నాళ్లు చాట్లాటలయ్యాక ఐలవ్యూ చెప్పాడు.

Published : 26 Mar 2016 02:12 IST

చెలి గేలిచేసింది...జీవితం గెలిచేసింది!

మనసుపడ్డ అమ్మాయికో ముద్దుపేరు పెట్టుకున్నాడు. కొన్నాళ్లు చాట్లాటలయ్యాక ఐలవ్యూ చెప్పాడు. అప్పటిదాకా బాగానే స్పందించిన అమ్మాయి ఖఠాఠ్‌... నీకేం అర్హతలున్నాయని ప్రేమించాలి?’ అంది. ఆ మాటను ఛాలెంజ్‌గా తీసుకున్న కుర్రాడు ప్రభుత్వోద్యోగం సంపాదించాడు. తర్వాతేంటి?

మ్మా, నేను... జీవితం సాగిపోవడానికో చిన్న ఉద్యోగం. ఇదీ నా ప్రపంచం. జాలీగా గడిచిపోతున్న సమయంలో తన పరిచయం వూహించని మలుపులకు కారణమైంది. ఫేస్‌బుక్‌ ద్వారా నా జీవితంలోకి వచ్చింది ఆమె. వరుసకు బంధువులమ్మాయే. ముద్దుగా ఖస్టార్‌’ అని పిలిచేవాణ్ని.

ఖహాయ్‌ ఎలా ఉన్నావ్‌? ఏం చేస్తున్నావ్‌?’ అంటూ ఓరోజు తెలియని నెంబర్‌ నుంచి మెసేజ్‌. కొద్దిరోజుల దాగుడుమూతలయ్యాక ఖనేను నీ స్టార్‌ని’ అంది. తనపై మొగ్గలా ఉన్న ప్రేమ పువ్వులా వికసించింది. ఉదయం నాలుగుతో మొదలై అర్ధరాత్రైనా మామధ్య సందేశాల వరద పోటెత్తుతూనే ఉండేది. ఖనా గురించి అసలు ఏమనుకుంటున్నావ్‌?’ ఉరుములేని పిడుగులా అడిగిందోసారి. ఇదే మంచి ఛాన్స్‌. ఖనువ్వుంటే నాకిష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అనేశా. మౌనమే తన సమాధానం. ఆపై ఎఫ్‌బీ చాటింగ్‌, మెసేజ్‌లు అన్నీ బంద్‌. ఆమె మనసులో నాకు స్థానం లేదని అర్థమైంది.

 ఒకరు వద్దంటే వదిలే రకం కాదు నేను! రోజూ తన కాలేజీ చుట్టూ చక్కర్లు కొట్టేవాణ్ని. పిలుపొస్తుందనే ఆశతో. కొన్నాళ్లయ్యాక వచ్చింది. కానీ వాళ్ల అమ్మనుంచి. ఖమా అమ్మాయిని సతాయిస్తున్నావట. ఇంకోసారలా చేస్తే బాగుండదు’ అని బెదిరిస్తూ. కోపం, కసి పెరిగాయి. ఖనేనంటే ఎందుకిష్టం లేదు? అసలు నాలో ఏం తక్కువ?’ ఓసారి నేరుగా అడిగా. దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. ఖచదువు, ఉద్యోగం, ఆర్థికపరిస్థితి ఎందులో నువ్వు నాకంటే ఎక్కువ? అసలు నీలో ప్రేమించడానికి ఏం ఉంది?’ అని. బాగా ఆలోచిస్తే తను చెప్పిందే నిజమనిపించింది.

పోటుగాడిలా పోటీ పరీక్షల పుస్తకం అందుకున్నా. ఏడాది బాగానే కష్టపడ్డా. అవతలి వాళ్లు నాకన్నా ఎక్కువ చదివారేమో! ఫలితాల్లో నా పేరు లేదు. కాళ్లావేళ్లాపడి పాత కొలువులోనే చేరా. కానీ ప్రతిక్షణం గుర్తొచ్చేది. తను అన్నమాటలే మనసుని ఈటెల్లా గుచ్చేవి. ఆ బాధ, నేనేం సాధించలేననే అపనమ్మకం... వెరసి విఫల ఆత్మహత్యా యత్నం చేశా. అప్పుడే కుటుంబసభ్యులు నాపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అర్థమైంది. ఖనువ్వు ఉద్యోగం చేయకపోయినా ఫర్వాలేదు. ఇలాంటి పిచ్చిపనులు చేయొద్ద’ని ఏడ్చారు. తప్పు చేశాననిపించింది.

తర్వాతేంటి? నేను ఎదగాలి! కానీ... మళ్లీ ఆ అమ్మాయిని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నాల్లో పడిపోయా. సీతారాముల్ని కలిపిన ఆ ఆంజనేయుడి కాయిన్‌ను నా ప్రేమ గుర్తుగా పంపా. లంకాదహనం మా ఇంట్లో జరిగింది. ఖఇంకోసారి ఇలాంటి పిచ్చివేశాలేస్తే జైళ్లొ ఉంటావ్‌’ ఉరిమింది వాళ్లమ్మ. గొడవ పెద్దది కాకుండా అక్క రాయబారం నడిపింది. ఖపాపం అమ్మాయి... వదిలెయ్‌రా. ముందు తను కోరుకున్నట్టు నిన్ను నీవు నిరూపించుకో’ అంది. దగ్గరుండి ప్రోత్సహించింది. కోచింగ్‌కి సాయం చేసింది. ఈసారి కచ్చితంగా ఏదో సాధించి తీరాలనే కసి నా మనసులోకి ప్రవేశించింది.

మావాళ్ల ఆశీర్వాదం... నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఏడాదయ్యాక నాకు ప్రభుత్వోద్యోగం దక్కింది. నేను గెలిచాను అని తనకి చెప్పాలనుకున్నా. ఒక కొత్త సిమ్‌ కొని నాపేరు చెప్పకుండా ఖనాకు ఉద్యోగం వచ్చింది’ అని మెసేజ్‌ పంపా. తను పసిగట్టేసింది. ఖఆల్‌ ది బెస్ట్‌. నేనూ అమెరికన్‌ కంపెనీలో చేరా’ అని రిప్లై ఇచ్చింది. ఇదే అదనుగా మళ్లీ తన వెంటపడాలని మాత్రం ప్రయత్నించలేదు. తనకు తానుగా నా చేయి అందుకోవాలని కోరిక.

తెలిసో తెలియకో తనకి స్టార్‌ అని పేరు పెట్టుకున్నా. ఆకాశంలో మెరిసే నక్షత్రంలా ఉంటుందని. కానీ ఆ స్టార్‌ని ఎప్పటికీ చేరలేనని చాన్నాళ్ల తర్వాత అర్థమైంది. ఏదేమైనా నన్ను మార్చిన తనకి ధన్యవాదాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు