అమ్మాయికి చేరువయ్యా... అమ్మకి చేదయ్యా!

ప్రేమంటే ఒకర్నొకరు నచ్చడం కాదు. పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి ఒక్కటవడం కాదు. ప్రేమంటే పేగుబంధాన్ని....

Published : 02 Apr 2016 01:32 IST

అమ్మాయికి చేరువయ్యా... అమ్మకి చేదయ్యా!

ప్రేమంటే ఒకర్నొకరు నచ్చడం కాదు. పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి ఒక్కటవడం కాదు. ప్రేమంటే పేగుబంధాన్ని వదులుకోకపోవడం. పెళ్లంటే కొత్త బంధాల్ని కలపడం... ఇది తెలుసుకునేలోపే అనర్థం జరిగిపోయిందంటున్నాడో యువకుడు.

సంక్రాంతి పండక్కి నాన్నని కలవడానికెళ్లా. ఎవరైనా అత్తారింటికో బంధువులింటికో వెళ్తారుగానీ నాన్నని కలవడమేంటి అంటారా? ఔను... ఎందుకంటే అమ్మానాన్నలు ఎప్పుడో విడిపోయారు. నేను, చెల్లి అమ్మ దగ్గరే పెరిగాం. చిన్నప్పట్నుంచి మామయ్యే మా బాగోగులు చూశారు. అమ్మకి తెలియకుండా అప్పుడప్పుడు నాన్నని కలవడం నాకలవాటు. ఈసారీ అదే చేశా.

గేటు తీసి లోపలికెళ్తుంటే వాకిట్లో చుక్కలముగ్గు వేస్తున్న చక్కని చుక్క కనపడింది. తను నా మేనత్త కూతురు. ‘చూసుకుంటూ వెళ్లు బావా... ముగ్గు పాడవుతుంది’ అనడంతో మరోసారి తనని చూశా. ఈసారేంటో మరీ అందంగా కనిపించింది. ఇంట్లోకెళ్లి నాన్నతో మాట్లాడుతున్నా పదేపదే తన రూపమే గుర్తొస్తోంది. ఆ వూహల్లో ఉండగానే ‘బావా... స్వీట్‌’ అంటూ చేతిలో పాలకోవా పెట్టింది. ఏంటి స్పెషల్‌ అంటే నాకుద్యోగం వచ్చిందంది. ఓ ముక్క నోట్లో వేసుకొని ‘ఈ స్వీట్‌కన్నా బావా అన్న నీ పిలుపే తీయగా ఉంది’ అన్నా. సిగ్గులమొగ్గైంది. ఆపై ఇక చూడాలి. నేను కూర్చుంటే తను నిలబడటం... నేను తిన్నాకే తను భోంచేయడం... ఈసారేంటో తన ప్రవర్తన కొత్తగా ఉంది. నేనూ తన చుట్టే తిరిగేవాణ్ని. మూడ్రోజులు మూడు క్షణాల్లా గడిచాయి.

ఇంటికొచ్చాను. ఆ రాత్రి నిద్రపడితే ఒట్టు. కళ్లు మూసినా, తెరిచినా మరదలు గాయత్రినే. ఎన్నాళ్లొ ఆగలేకపోయా. ఓరోజు వాళ్ల నాన్నకు ఫోన్‌ చేసి ‘మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. తనంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మలా చూసుకుంటా’ అన్నా. వరుసైనోడ్ని, పైగా మంచి ఉద్యోగం. పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే ఓకే చెప్పారు. సంతోషంతో గాయత్రికి చెబితే ‘ఛీ పో... నన్ను అంతగా ఇష్టపడితే నాతో ఒక్కమాటైనా చెప్పవా?’ అని అలకపాన్పు ఎక్కింది. ప్రసన్నం చేసుకోవడానికి చాలానే కష్టపడ్డా. కొన్నాళ్లయ్యాక గాయత్రి ఉద్యోగంలో చేరడానికి సిటీకొచ్చింది. వెళ్లి కలిశాను. చేతిలో ఓ ఫొటో ఆల్బమ్‌ పెట్టింది. నేను వూరెళ్లినపుడు జాతరలో, గుడి, చేల దగ్గర దిగిన ఫొటోల తీపి జ్ఞాపకాలన్నీ అందులో ఉన్నాయ్‌.

ఉగాదికి వూరెళ్లా. నాకన్నా ముందే మా ప్రేమవిషయం అమ్మకి చేరింది. ‘వాళ్లతో మనకు చాలా గొడవలయ్యాయి. మనకు పొసగదు. మేమో, వాళ్లొ తేల్చుకో’ అన్నారు అమ్మ, మామయ్య, అమ్మమ్మలు. ఎప్పుడో జరిగిన గొడవల్ని మా ప్రేమతో ముడిపెట్టొద్దన్నా వినరే. ‘అత్తమ్మవాళ్లు ఒప్పుకునేదాకా ఎదురుచూద్దాం’ అంది గాయత్రి. ఆర్నెళ్లు ఇంటిమొహం చూడలేదు. అయినా అమ్మ నుంచి పిలుపు లేదు. మరోవైపు ‘మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, వేరే సంబంధం చూసుకొమ్మంటావా?’ అని మామయ్య ఒత్తిడి. ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇంటికెళ్లా. వాళ్లు పంతం వీడలేదు. నేనో నిర్ణయానికొచ్చా.

గాయత్రి కుటుంబసభ్యుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకున్నాం. హైదరాబాద్‌లో కాపురం. కొన్నాళ్లు గడిస్తే అమ్మ మనసు మారుతుందని నా ఆశ. కానీ ఆ అంచనా తప్పింది. మేం చేసినదాన్ని అవమానంగా భావించి కొద్దిరోజులు ఇంట్లోంచి బయటికి రాలేదట అమ్మ, అమ్మమ్మలు. భర్తతోపాటు కొడుకూ మోసం చేశాడని ఏడ్చిందట అమ్మ. చాలా తప్పు చేశాననిపించింది. తర్వాత వెళ్లి క్షమించమని అమ్మ కాళ్లపై పడిపోయా. నోరు విప్పలేదు. మొహం కూడా చూడ్డానికి ఇష్టపడలేదు. నిరాశగా తిరిగొచ్చా. కొన్నాళ్లకు చెల్లి పెళ్లని తెలిసి ఆశగా వెళ్లా. నన్నో అపరిచిత వ్యక్తిలా చూశారు. కన్నీళ్లతోనే అక్షింతలు వేసి తిరిగొచ్చా. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నాననే సంతోషం కన్నా నేనే ప్రాణం అనుకున్న అమ్మ నన్ను కాదనుకోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. కొన్నాళ్లు వేచి చూస్తే ఈ దుస్థితి తప్పేదేమో!

- సత్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని