ప్రపోజ్‌ చేస్తే...పాపను చూపించింది!

చదువు లేకున్నా సర్దుకుపోతా... ఆస్తి లేకున్నా అడ్జస్టవుతా... అమ్మాయి మాత్రం అప్సరసలా ఉండాలి. ఇదీ కాబోయే భార్య విషయంలో నా పంతం. ఆ కలల రాణికోసం ఇంటర్‌ నుంచి .....

Published : 23 Apr 2016 00:55 IST

ప్రపోజ్‌ చేస్తే...పాపను చూపించింది!

దువు లేకున్నా సర్దుకుపోతా... ఆస్తి లేకున్నా అడ్జస్టవుతా... అమ్మాయి మాత్రం అప్సరసలా ఉండాలి. ఇదీ కాబోయే భార్య విషయంలో నా పంతం. ఆ కలల రాణికోసం ఇంటర్‌ నుంచి ఎంటెక్‌ దాకా ఎంతోమంది అమ్మాయిల వెంటపడ్డా. ఛీత్కరింపులు, చిరుగొడవలు, కొన్ని ప్రేమ వరకూ వెళ్లి ఆనక బ్రేకప్‌లు... అన్నీ జరిగాయి. చిటికెనవేలు అందుకునే చిన్నది మాత్రం దొరకలా!

సీన్‌ కట్‌ చేస్తే నేనిప్పుడో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆఫీసులో కనీసం పదిమంది అందగత్తెలైనా ఉంటారు. వాళ్లు అటూఇటూ తిరుగుతుంటే క్యాట్‌వాక్‌ చేస్తున్న మోడళ్లే కనిపించేవారు. అందులో ఎవర్ని ఎంచుకోవాలో తెలీక నేను సతమతమవుతుంటే నా మగ కొలీగ్స్‌ మాత్రం శిరీష పేరు తెగ పలవరించేవారు. ఎవరీ శిరీష అంటే నాకన్నా కొంచెం సీనియర్‌. మరీ అందగత్తేం కాదు. మరి ఎందుకింత ఫాలోయింగ్‌ అని ఆరా తీస్తే చాలా విషయాలే తెలిశాయి. తను కొలీగ్స్‌కి పనిలో సాయం చేస్తుంది. అవసరాల్లో ఉన్నవాళ్లకి డబ్బులిస్తుంది. అన్నింటికీ మించి అందరితో ఇట్టే కలిసిపోతుంది. అందుకే బోయ్‌ నుంచి బాస్‌ దాకా అందరికీ తనంటే ఇష్టం.

కొద్దిరోజుల్లోనే నేనూ శిరీష మంచితనానికి ఫిదా అయ్యా. నా అదృష్టమో మరేంటో, ఆఫీసులో అందరి సీట్లు మార్చడంతో నేను తన పక్కనే చేరా. ఇంకేం... పక్కనే జోష్‌ మిషన్‌. తనతో మాట్లాడుతుంటే సమయమే తెలిసేది కాదు. రాన్రాను నేనెంతగా మారిపోయానంటే ఆర్నెళ్లలోనే తనే నా డ్రీమ్‌గాళ్‌ అనుకునేంత.

నాది లవ్వే. మరి తనదేంటి? ఆ మాటే అడిగి పెళ్లాడతానన్నా. ‘ప్రపోజల్‌ నెంబర్‌ ఎయిట్‌’ అంది. హో... పోటీ తీవ్రంగానే ఉందని అర్థమైంది. అయినా సిన్సియర్‌గా ప్రయత్నిస్తూనే ఉన్నా. ఇంకో ఆర్నెళ్లు గడిచాయి. ఓరోజు తన ఫోన్‌. ‘రేపు సాయంత్రం మనం ఫలానా రెస్టరెంట్‌లో కలుద్దాం’ అని. ‘యాహూ’ ఉన్న చోటే గెంతేశా. చక్కగా ముస్తాబై తను చెప్పినచోటికి పల్సర్‌ బైక్‌పై వెళ్లా. ఐదు నిమిషాలయ్యాక వచ్చింది. ఓ పాపతో సహా. నా క్వశ్చన్‌మార్క్‌ మొహం చూసి తనే నోరు విప్పింది. ‘ఈ పాప నా కూతురు. నువ్వు నాకు భర్తవి కావాలంటే ముందు తనకి తండ్రివి కాగలవా? అంత దమ్ముందా?’ అంది. నాకంతా అయోమయం. ‘నువ్వు విన్నది కరెక్టే. నేను నా భర్తతో విడిపోయా’ అనడంతో సీన్‌ పూర్తిగా అర్థమైంది. కాస్త టైమివ్వు అని బయటికి నడిచా.

‘ఇంటర్‌ అయ్యాక బావతో పెళ్లైంది. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత పాత లవర్‌తో సంబంధం కొనసాగించేవాడు. పద్ధతి మార్చుకొమ్మన్నా విన్లేదు. నీకిష్టంలేకపోతే నువ్వెళ్లిపోవచ్చని ఆఫరిచ్చాడు. పుట్టింటికొచ్చేశా. తర్వాతే పాప. చదువూ కొనసాగించా’ రాత్రి ఫోన్‌చేసి క్లుప్తంగా వివరాలన్నీ చెప్పింది. నా కళ్లు చెమర్చాయి. ఎప్పుడూ చలాకీగా ఉండే తన జీవితంలో ఇంత విషాదమా అని ఆశ్చర్యమేసింది. జీవితంలో మొదటిసారి ఒకమ్మాయి అందం గురించి కాకుండా మనసు, పరిస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టా. దాదాపు వారం రోజుల తర్వాత ఓ నిర్ణయానికొచ్చా.

నాన్న నా బెస్ట్‌ఫ్రెండ్‌. సలహా అడిగా. ‘చాలా రిస్కు తీసుకుంటున్నావ్‌. మరోసారి ఆలోచించు. కానీ నువ్వే నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు’ అన్నారు. అమ్మ ముందు వద్దన్నా కష్టపడి ఒప్పించాను. తర్వాత శిరీష చెప్పినట్టే మేం సింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్నాం. ‘మా పాప’ సాక్షిగా. ఇప్పుడు నన్నంతా ‘నిజమైన హీరో’ అంటున్నారు. నాకు మాత్రం నా డ్రీమ్‌గాళ్‌ దొరికింది. ప్లస్‌ అందమైన మనసుతో సహా. అమ్మానాన్నలకు అణకువైన కోడలు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని