ప్రేమ చేయిచ్చింది! స్నేహం చేదోడైంది!

పరిచయానికి ఫేస్‌బుక్‌... బాతాఖానీకి వాట్సాప్‌... బయట కలుసుకోవడానికి పార్కులు, రెస్టరెంట్లు... నేటి కుర్ర స్నేహాలకు కొలమానం ఇది!

Published : 30 Apr 2016 01:25 IST

ప్రేమ చేయిచ్చింది! స్నేహం చేదోడైంది!

పరిచయానికి ఫేస్‌బుక్‌... బాతాఖానీకి వాట్సాప్‌... బయట కలుసుకోవడానికి పార్కులు, రెస్టరెంట్లు... నేటి కుర్ర స్నేహాలకు కొలమానం ఇది! కానీ ఈ హైటెక్‌ యుగంలోనూ ఉత్తరాలతో చెలిమి చేసేవారుంటారా? కానీ మా స్నేహం అలాంటిదే. - శ్రీనివాస్‌
గాయత్రి... ఈ పేరు వింటేనే నాకు గొప్ప ఆప్యాయత గుర్తొస్తుంది. మా అక్క వాళ్లింటిదగ్గరే తనుండేది. ‘ఆ అమ్మాయి చాలా పద్ధతైన పిల్లరా. పెద్దలంటే గౌరవం’ అడక్క ముందే ఆమె గురించి చాలా సార్లు చెప్పేది అక్క. ఆ మాటల ప్రభావమేమో గాయత్రిని చూడకుండానే అభిమానం పెంచుకున్నా.

నచ్చిన అమ్మాయికి దగ్గరవ్వాలనుకోవడం సహజమే కదా! అక్కాబావలకు తెలియకుండా గాయత్రి కాలేజీకి వెళ్లా. దొంగచాటుగా తనని గమనించా. ఫర్వాలేదు అందగత్తే. నన్ను నేను పరిచయం చేసుకోవడమెలా? ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, తన స్నేహితులు... చాలా దారులే కనిపించాయి. కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. భాషపై నాక్కొంచెం అభిమానం ఎక్కువ. పుస్తకాలు బాగా చదువుతా. అందుకే తనతో ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నానో వివరిస్తూ ఉత్తరం రాశా. ఒకటి.. రెండు.. ఐదు.. నా అంతరంగ భావాల్ని అక్షరాలుగా పేర్చి లేఖలు పంపా. అవతలివైపు నుంచి సమాధానం లేదు. అయినా నా నమ్మకం సడలలేదు. నా ఆలోచనలు తనకు కచ్చితంగా నచ్చుతాయనిపించింది. కాస్త ఆలస్యంగానైనా నా అంచనా నిజమైంది. ‘మీరెవరో నాకు తెలియదు. కానీ మీ అక్షరంలో నిజాయతీ ఉంది. మీ ఆలోచనలు నాలాగే ఉన్నాయి’ అంటూ జవాబిచ్చింది. ఉత్తర ప్రత్యుత్తరాల వేగం పెరిగింది.

చేతి రాతల్ని నోటిమాటలుగా మార్చాలనిపించింది. కలుద్దాం అంటే 'ఓస్‌... దానికేం భాగ్యం’ అంది. గాయత్రిని కలిసి మాట్లాడాక తనకన్నా తన ఆలోచనలు, భావాలు మరింత అందంగా ఉన్నాయనిపించింది. ఖాళీ సమయాల్లో పిల్లలకు ట్యూషన్లు చెబుతా. స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేస్తా’ అంటుంటే ఇలాంటి అమ్మాయి నా ఫ్రెండ్‌ అని చెప్పుకోవడం గర్వంగా ఉండేది. మేం తరచూ కలిసేవాళ్లం. చాలా విషయాలు చర్చించుకునేవాళ్లం. అందులో వ్యక్తిగత విషయాలకన్నా సమాజ ప్రస్తావనే ఎక్కువ. బాధలు, కష్టాల్లో ఉన్నపుడు ఒకరికొకరం ఓదార్చుకునేవాళ్లం.

మాది కేవలం స్నేహమే. అందులోనే అనిర్వచనీయమైన ఆనందాన్ని వెతుక్కునేవాళ్లం. కానీ మా సాన్నిహిత్యాన్ని ఈ సమాజం మరోలా అర్థం చేసుకుంది. సన్నిహితులే మమ్మల్ని ‘ప్రేమ పక్షులు’ అన్నారు. స్నేహం పేరుతో రొమాన్స్‌ చేస్తున్నారని ఎగతాళి చేశారు. మేమేంటో మాకు తెలుసు. ఎవర్నీ పట్టించుకోలేదు. రాన్రాను అపార్థం చేసుకున్నవాళ్లే నిజం తెలుసుకున్నారు.

కొన్నాళ్లకు నాకింకో అమ్మాయి పరిచయమైంది. పరిచయం త్వరలోనే ప్రేమ బాట పట్టింది.‘నీతో జీవితం పంచుకోవాలనుంది’ నా మనసులో మాట తను చెప్పింది. నా సంతోషానికి పట్టపగ్గాల్లేవ్‌. ఇక ఆమెతోనే నా జీవితం అనుకున్నా. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నా. ‘నాకు ఇంకో అబ్బాయి దొరికాడు. నువ్వు వేరే అమ్మాయిని చూసుకో’ ఓరోజు బాంబు పేల్చింది. నా గుండె పగిలింది. బాధతో దాదాపు పిచ్చివాడినయ్యా. అప్పుడు గాయత్రే నాకు తోడుగా నిలిచింది. తన చల్లని మాటలతో కుంగుబాటు నుంచి బయటికి తీసుకొచ్చింది.

జీవితాంతం తోడుంటానన్న ప్రేమ అర్థాంతరంగా నన్నొదిలి వెళ్లింది. మధ్యలో పరిచయమైన స్నేహం మాత్రం కడదాకా తోడుంటానంటోంది. అందుకే నా దృష్టిలో ప్రేమకన్నా స్నేహమే గొప్పది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ స్నేహాన్ని వదలొద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని