కూతురి మనసు తెలుసుకోవేం నాన్నా!

కూతురు చిటికెనవేలు పట్టుకొని బుడిబుడి అడుగులు వేయిస్తూ మురిసిపోయేది నాన్న. గారాబం చేస్తూనే బాధ్యతలు నెరవేర్చేది నాన్న. కానీ మా నాన్నకి...

Published : 21 May 2016 01:15 IST

కూతురి మనసు తెలుసుకోవేం నాన్నా!

కూతురు చిటికెనవేలు పట్టుకొని బుడిబుడి అడుగులు వేయిస్తూ మురిసిపోయేది నాన్న. గారాబం చేస్తూనే బాధ్యతలు నెరవేర్చేది నాన్న. కానీ మా నాన్నకి నాన్న లక్షణాలే లేవు.

కన్నతండ్రి గురించి ఓ అమ్మాయి ఇలా చెప్పడం తప్పే. కానీ నాకు తప్పడం లేదు. ఇంట్లో అమ్మానాన్నలకు రోజూ గొడవలే. అమ్మ ఏడుస్తూ తరచూ అమ్మమ్మ వాళ్లింటికెళ్లిపోయేది. మొదట్లో నాకేం తెలిసేది కాదు. తర్వాత నాన్నకు వేరే మహిళలతో సంబంధాలున్నాయని అర్థమైంది. ఆ విషయం తెలిశాక ఆయనపై ఉన్న కాస్త గౌరవం పోయింది.

నేను చదువులో ఎప్పుడూ క్లాస్‌ ఫస్టే. అంతా మెచ్చుకునేవారు. నాన్న తప్ప. పైగా ‘బాగా చదివి ఎవర్ని ఉద్ధరిస్తావటా?’ వెటకారమాడేవారు. ఏడుపొచ్చేది. టెన్త్‌లో మండలం ఫస్ట్‌ వచ్చా. అప్పుడు మాత్రం చాలా సంతోషించారు. ‘నీ కూతురు చదువయ్యేదాకా సర్కారే చదివిస్తుందిక’ ఎవరో చెప్పారట నాన్నతో. అందుకే ఈ ప్రేమ.

ట్రిపుల్‌ఐటీలో ఉచితంగా సీటొచ్చింది. ఏడాది గడిచిందో లేదో ‘మా చెల్లి కొడుకుని పెళ్లి చేస్కో. చదువు సంగతి తర్వాత చూద్దాం’ బలవంతపెట్టారు నాన్న. నాకిప్పుడే పెళ్లి వద్దని ఏడ్చినా వినరే! ఇంటికెళ్లడమే మానేశా. నాపై కోపాన్ని అమ్మపై చూపేవారు. నానా చిత్రహింసలు పెట్టేవాడు. ‘మా గురించి పట్టించుకోకు. నువ్వు చదువుపై దృష్టి పెట్టి పెద్ద ఉద్యోగం సంపాదించాలి’ ప్రోత్సహించేది అమ్మ.

బీటెక్‌ పూర్తైంది. ఇంటికెళ్లడం ఇష్టంలేదు. ఉద్యోగం వెతుక్కునే సాకుతో సిటీకొచ్చాను. అక్కడే పరిచయమయ్యాడు శ్రీధర్‌. మొదట్లో మగాళ్లంతా మా నాన్నలాగే ఉంటారనుకున్నా. శ్రీధర్‌ని చూశాక ఆ అభిప్రాయం మారింది. తను అమ్మాయిలతో ప్రవర్తించే తీరు, చూపించే ఆప్యాయత నన్ను కట్టిపడేసేవి. పైగా అతడిది మా సామాజికవర్గమే అని తెలిశాక అభిమానం స్థానంలో ప్రేమ మొదలైంది. నాలుగైదుసార్లు వాళ్లింటికెళ్లా. శ్రీధర్‌ అమ్మానాన్నలూ నాపై విపరీతమైన అభిమానం చూపించేవారు. శ్రీధర్‌ నన్ను ఇష్టపడుతున్నాడని తెలిశాక సొంత కోడలిలాగే చూడ్డం మొదలుపెట్టారు. శ్రీధర్‌ కుటుంబం మా కుటుంబానికి పూర్తి వ్యతిరేకం. వాళ్ల ఇల్లు అనుబంధాల పొదరిల్లులా ఉండేది. కొన్నాళ్లకు తన గైడెన్స్‌తోనే నాకు ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది.

సెలవులకు వూరెళ్లా. నాన్న పాతపాటే పాడారు. మేనత్త కొడుకుని పెళ్లాడమని. ఇంకా నాన్చడం నాకిష్టం లేదు. శ్రీధర్‌తో ప్రేమ విషయం చెప్పా. అతడ్నే పెళ్లాడతానన్నా. ప్రేమ పేరెత్తగానే ఇంతెత్తున లేచారు. కన్నకూతురని చూడకుండా అనరాని మాటలన్నారు. మాటలు పడ్డాను. నిర్ణయం మాత్రం మార్చుకోలేదు. మౌనవ్రతం చేశా. ప్రేమగా అడిగా. కన్నీరు పెట్టుకున్నా. ఆయనది పాషాణ హృదయం కదా. కరగలేదు. అన్ని మార్గాలూ మూసుకుపోయాక ఆఖరి అస్త్రం ప్రయోగించా. ‘నేను మేజర్‌ని. నా ప్రేమను ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్లిపోతా’ అని బెదిరించా. పరువు గుర్తొచ్చిందేమో! ఇక చేసేదేం లేక చివరికి అయిష్టంగానే ఒప్పుకున్నారు.

మాకు పెళ్లి చేయడం నాన్నకు ఇప్పటికీ ఇష్టం లేదు. అయినా త్వరలోనే శ్రీధర్‌తోనే నా జీవితం ముడిపడబోతోంది. కన్నతండ్రిని విలన్‌ని చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రాలేదు. బాధ్యత మర్చిపోయిన తండ్రులు కనీసం కూతుళ్ల మనసునైనా అర్థం చేసుకోవాలని విన్నవిస్తున్నా.

- స్వప్న

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని