అలుసు చేసి... మనసు మూసి!

‘కాలంతోపాటూ అభిప్రాయాలూ మారిపోతుంటాయి. అలా మార్చుకోనివాడు మనిషే కాదు’. ఎక్కడో చదివినట్టు గుర్తు. ఇది నాకూ వర్తిస్తుందని...

Published : 04 Jun 2016 01:29 IST

అలుసు చేసి... మనసు మూసి!

‘కాలంతోపాటూ అభిప్రాయాలూ మారిపోతుంటాయి. అలా మార్చుకోనివాడు మనిషే కాదు’. ఎక్కడో చదివినట్టు గుర్తు. ఇది నాకూ వర్తిస్తుందని వూహించలేకపోయా.

ఎందుకో తెలియదు. మొదట్నుంచీ నాకు మగాళ్లంటే చిరాకు, కోపం, భయం. ప్రేమ వూసులు మొదలయ్యే కౌమారంలోనూ నా అభిప్రాయం మారలేదు. టెన్త్‌, ఇంటర్‌, బీటెక్‌ సెకండియర్‌ పూర్తయ్యాయి. ఆ తర్వాతే ఓ మిరకిల్‌ జరిగింది. అందుక్కారణం చైతూ. మొదటిచూపులోనే తను బాగా నచ్చేశాడు. ముఖ్యంగా అతడి నవ్వు. నన్నేదో శక్తి ఆవహించినట్టు కొద్దినిమిషాలు అతడ్నే చూస్తుండిపోయా. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌.. ఆకర్షణ.. పేర్లేవైనా పెట్టుకోవచ్చుగాక. చైతూ నాకు నచ్చేశాడు. మొదటిసారి ఒకబ్బాయికి దగ్గర కావాలనే ఉబలాటం మొదలైంది నాలో. రోజులు వారాల్లోకి మారాయి. చైతూని చాటుమాటుగా గమనించడం నాకలవాటైంది.

‘ఎన్నాళ్లీ నిరీక్షణ?’ నిలదీసిందోరోజు నా మనసు.

నెంబర్‌ కనుక్కొని కాల్‌ చేశాను. మాట పెగల్లేదు. ‘హాయ్‌.. నేను పూజిత. ఎలా ఉన్నావ్‌? చదువు బాగా సాగుతోందా?’ కష్టమ్మీద మూడు ముక్కలు మాట్లాడా. తనూ పెద్దగా స్పందించలేదు. ఆపై మళ్లీ పాత కథే. చూపుల్తోనే సరిపెట్టుకోవడం. ఐదారు నెలలయ్యాక మళ్లీ మాట కలిపా. ఈసారి మాత్రం బాగా ప్రిపేరయ్యా. యోగక్షేమాలయ్యాక ‘నీ నవ్వు బాగుంటుంది. నీతో మాట్లాడ్డం నాకిష్టం’ అన్నా ధైర్యంగా. ఓ అమ్మాయి అలా అంటే ఏ అబ్బాయైనా ఎగిరి గంతేయాలి. కానీ గురుడిలో కదలిక లేదు. ‘థాంక్స్‌’ చెప్పి ఫోన్‌లో ఎర్ర మీట నొక్కేశాడు. నా మనసు నొచ్చుకుంది. బహుశా నేను చెప్పిన విధానం బాగా లేదేమో అనుకొని ఎసెమ్మెస్‌ పెట్టా. ‘నువ్వంటే ఇష్టం. నీతో మాట్లాడాలని ఉంది’ అంటూ. రోజంతా ఎదురుచూసినా సమాధానం లేదు. కన్నీళ్లు పొంగుకొచ్చాయి.

తనతో ఇంకోసారి మాట్లాడొద్దనుకున్నా నావల్ల కాలేదు. పుట్టినరోజు, పండగ, ప్రత్యేక సందర్భం ప్రతిసారీ పిచ్చిదానిలా తనకు ఫోన్‌ చేస్తూనే ఉండేదాన్ని. వెంటపడుతున్నానని చులకనయ్యానేమో? ‘అస్తమానం ఫోనెందుకు చేస్తున్నావ్‌? ఇంకోసారలా చేయకు. చిరాగ్గా ఉంది’ అనేశాడోసారి. ఏడుపాగలేదు. ఎంత గింజుకున్నా తనవైపు నుంచి స్పందన లేదు. అయినా మనసు మారదే! ఓసారి ఫ్రెండ్‌ ఫోన్‌ నుంచి చేశా. అపరిచితురాలిలా మాట్లాడా. బాగానే స్పందించాడు. నేను హ్యాపీ. కానీ అదే నా కొంప ముంచింది. నా స్నేహితురాలు చైతూ నెంబర్‌ సేవ్‌ చేసుకొని నాకు తెలియకుండా పరిచయం పెంచుకుంది. ప్రేమాయణం మొదలుపెట్టింది.

‘నీ ఫ్రెండ్‌ని నాతో పరిచయం పెంచుకొమ్మని నా నెంబర్‌ ఇచ్చావటగా. ఇప్పుడు తనంటేనే నాకిష్టం. ఆమెని లవ్‌ చేస్తున్నా. ఇంకోసారి నాకు ఫోన్‌ చేయకు’ అని చైతూ నాకు వార్నింగ్‌ ఇచ్చాడు. నా గుండె పగిలింది.

‘మీ ఫ్రెండ్‌, నేను ఫలానా చోట కలుసుకున్నాం’, ‘రేపు కలిసి సినిమాకెళ్తున్నాం’ అంటూ కావాలనే మెసేజ్‌లు పంపేవాడు. చదువుతుంటే ఏడుపొచ్చేది. ఇంకా తన వెంటపడటంలో అర్థం లేదనిపించింది. అతడిపై ప్రేమ చంపుకొని డ్రాప్‌ అయ్యాను. నెంబర్‌ మార్చేశాను.

మూడేళ్లు గడిచాయి. ఓరోజు ఒక కొత్త నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘హాయ్‌ ఎలా ఉన్నావ్‌?’ అవతలివైపు చైతూ. యోగక్షేమాలడిగాను. తను ఏడవడం మొదలెట్టాడు. నాకేం అర్థం కాలేదు. ‘నీ ఫ్రెండ్‌ నన్ను మోసం చేసింది. వాడుకొని వదిలేసింది’ బావురుమన్నాడు. కాసేపు నిశబ్దం. తర్వాత ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అనడిగాడు. నవ్వాలా? ఏడవాలా? అర్థం కాలేదు. ‘చెప్పు పూజితా.. చేస్కుంటావా?’ మళ్లీ రెట్టించి అడిగాడు. ఏడుపూ, నవ్వూ కలగలిసి నా కళ్లు వర్షించడం మొదలెట్టాయి. కానీ అతడి ప్రపోజల్‌కి మాత్రం నేనొప్పుకోలేదు. ఎందుకంటే పదిరోజుల కిందటే నాకు పెళ్లైంది.

- పూజిత (పేర్లు మార్చాం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని