ప్రేమను అడ్డగించా...పెళ్లికి పెద్దనయ్యా!

సాయంత్రం ఆరున్నరకి బొబ్బిలిలో ట్రెయిన్‌ ఎక్కా. జనంతో బోగీ కిక్కిరిసిపోయింది. సర్దుకునేలోపే తర్వాతి స్టేషనొచ్చింది. పద్మవ్యూహాన్ని ఛేదిస్తున్నట్టుగా ఓ కుర్రాడు జనాన్ని తప్పించుకుంటూ...

Published : 11 Jun 2016 02:12 IST

ప్రేమను అడ్డగించా...పెళ్లికి పెద్దనయ్యా!

సాయంత్రం ఆరున్నరకి బొబ్బిలిలో ట్రెయిన్‌ ఎక్కా. జనంతో బోగీ కిక్కిరిసిపోయింది. సర్దుకునేలోపే తర్వాతి స్టేషనొచ్చింది. పద్మవ్యూహాన్ని ఛేదిస్తున్నట్టుగా ఓ కుర్రాడు జనాన్ని తప్పించుకుంటూ వచ్చి నా పక్కనే నిలబడ్డాడు. కాసేపయ్యాక ఉబుసుపోక పలకరించా. మాటల్లో తెలిసింది తను మా దూరపు బంధువని.

ఆ కుర్రాడి బ్యాగులోంచి నీటిచుక్కలు కారుతున్నాయి. చెబితే బ్యాగు కిందికి దించి తెరిచాడు. లోపల తడి దుస్తులున్నాయి. అంతకన్నా అందులో ఉన్న అమ్మాయి దుస్తులు నన్నాకర్షించాయి. ఉత్సుకత ఆపుకోలేక ‘ఎవరిదా డ్రెస్‌?’ అన్నా. గాఢంగా నిట్టూర్చి ఫ్లాష్‌బ్యాక్‌ విప్పడం మొదలుపెట్టాడు.

‘ఇంటర్‌ అయ్యాక త్వరగా స్థిరపడొచ్చని ఐటీఐలో చేరాలనుకున్నా. దరఖాస్తు పత్రం కోసం విజయనగరంలోని ఓ కాలేజీకెళ్లా. ఆ పక్క కాలేజీలో ఆరోజు ఏయూ పీజీ ప్రవేశ పరీక్ష జరుగుతోంది. రంగురంగుల డ్రెస్సుల్లో సీతాకోకచిలకల్లా గుమిగూడిన అమ్మాయిలను చూస్తూ అక్కడే ఆగిపోయా. సరిగ్గా అప్పుడే ఓ అమ్మాయి చూపులు నన్ను తాకాయి. తదేకంగా నన్నే చూస్తోందామె. అందగత్తెకాదుగానీ తన మొహంలో ఏదో ఆకర్షణ. ధైర్యం చేసి తనదగ్గరికెళ్లా. ‘మీదేవూరు’ అంటూ మాట కలిపా. అయిదు నిమిషాల్లో ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం.

నా ఇంటర్‌, తన డిగ్రీ పూర్తయ్యాయి. అంటే ఆమె నాకన్నా మూడేళ్లు పెద్ద. మా అనుబంధానికి దీన్నో అడ్డంకిగా భావించలేదు. తను పీజీలో చేరింది. మా ఆనందాలకు హద్దే లేకుండా పోయింది. తరగతులు ఎగ్గొట్టి మరీ కలుసుకునేవాళ్లం. రోడ్లు, సినిమాలు, హోటళ్లు, పార్కులు... మేం తిరగని చోటు లేదు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదాని కొన్నిసార్లు తొందరపడ్డాం కూడా. తర్వాతేంటి? మావాళ్లెలాగూ పెళ్లికి ఒప్పుకోరు. అందుకే చెన్నై వెళ్లి అక్కడే ఓ గుళ్లొ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తను విశాఖపట్నంలో ట్రైన్‌ ఎక్కుతుంది. ఆమెకోసమే ఈ డ్రెస్‌’ సినిమా స్టోరీలా కథంతా వివరించాడు.

వాళ్లు ఇంట్లోంచి పారిపోతున్నారని నాకర్థమైంది. పైసా సంపాదన లేదు. అంతదూరం వెళ్లి ఎలా బతుకుతారు? ఒకవేళ పాపో, బాబో పుడితే? వూహించుకుంటేనే భయమేసింది. జీవితంపై అవగాహనలేని ప్రాయంలో తప్పు చేస్తున్నారనిపించింది. ఎలాగైనా వాళ్లని ఆపాలనుకున్నా. చాలాసేపు ఆలోచించాక నాకో ఉపాయం తట్టింది. ‘ఆ అమ్మాయి నాకు ముందే తెలుసు. నీలాగే తను ఇంకో ఇద్దరు కుర్రాళ్లతో తిరగడం చూశా’ అని అడ్డంగా అబద్ధమాడేశా. ఓ అమ్మాయి గురించి చెడుగా చెప్పడం తప్పే. కానీ ఆ క్షణంలో తప్పలేదు. నా మాట వినగానే ఆ కుర్రాడి మొహంలో రంగులు మారాయి. ‘నిజమే అన్నయ్యా. చాలాసార్లు తన ఫోన్‌ బిజీ వచ్చేది. బహుశా వాళ్లతో మాట్లాడేదేమో?’ అన్నాడు. నేను మరింత రెచ్చిపోయి కట్టుకథలల్లాను. ‘ఏదైనా తేడా వస్తే జైళ్లొ వేస్తార’ని భయపెట్టాను. బెదిరిపోయాడు. అమ్మాయి అక్కర్లేదంటూ వైజాగ్‌ రాకముందే దిగిపోయాడు.

ఆ కుర్రాడ్ని బహుశా జీవితంలో మళ్లీ కలవలేనేమో అనుకున్నా. కానీ కలిశాడు. నేనూహించని షాక్‌ ఇచ్చాడు. ఏడాదయ్యాక ఓరోజు మా ఇంటికొచ్చాడు. ‘అన్నయ్యా... మా పెళ్లికి రావాల’ంటూ ఓ శుభలేఖ చేతిలో పెట్టాడు. పెళ్లికూతురు తను ప్రేమించిన అమ్మాయే. నాకు దిమ్మతిరిగిపోయింది. ‘నువ్వు చెప్పినపుడు నీ మాటలే నిజమనుకున్నా. తర్వాత ఆలోచిస్తే నేను చూడంది నమ్మడం తప్పనిపించింది. నా ప్రేయసి ప్రేమలోనూ తేడా కనిపించలేదు. ఆపై నా అదృష్టంకొద్దీ ఓ మంచి పనిలో చేరా. పెద్దలూ పెళ్లికి ఒప్పుకున్నారు’ అంటూ సంతోషంగా చెప్పాడు. ఆ క్షణం నాలో ఒకింత సిగ్గు, ఒకింత గర్వం.

ఉద్దేశం ఏదైనా ఆరోజు నేను చేసినదాంతో ఆ ప్రేమికులిద్దరికీ మంచే జరిగింది. వాళ్లకు పెద్దల ఆమోదం దొరికింది. జీవితం గాడిలో పడింది. నేనలా చెప్పి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. అన్నట్టు వాళ్ల పెళ్లికి కూడా వెళ్లి కొత్తదంపతుల్ని ఆశీర్వదించా. కానీ వాళ్లు చెన్నై పారిపోవాలనుకున్నారనే విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు.

- రాము, వీరసాగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని