మాటలు మన్నించు...మనసును గమనించు!

అప్పుడు ఇంటర్‌. నాలో ఏం నచ్చిందోగానీ ఓ అమ్మాయి నన్ను తెగ ఫాలో అయ్యేది. ‘రేపు సాయంత్రంలోగా ప్రేమిస్తున్నానని చెప్పకపోతే....

Published : 02 Jul 2016 01:18 IST

మాటలు మన్నించు...మనసును గమనించు!

ప్పుడు ఇంటర్‌. నాలో ఏం నచ్చిందోగానీ ఓ అమ్మాయి నన్ను తెగ ఫాలో అయ్యేది. ‘రేపు సాయంత్రంలోగా ప్రేమిస్తున్నానని చెప్పకపోతే సూసైడ్‌ చేసుకుంటా’ అందోసారి. జడుసుకొని ఓకే చెప్పేశా. ఆ కొద్దిరోజులకే నా కష్టాలు తీర్చడానికి రాఖీ పండగొచ్చింది. ఆమె ఇంటికెళ్లి అందరిముందే రాఖీ కట్టమన్నా. చేసేదేంలేక కట్టింది. వారం తిరక్కముందే వేరే అబ్బాయితో తిరగడం మొదలెట్టింది. పట్టించుకోలేదు.డిగ్రీ పూర్తై ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నా. ఓరోజు ఓ అమ్మాయి ఫోన్‌ చేసింది. వరుసకు మరదలవువుతానంది. ఆ వంకతో తరచూ కాల్‌ చేసేది. క్యాజువల్‌గా మాట్లాడి అమ్మకిచ్చేవాణ్ని. తను మాత్రం నన్ను ప్రేమిస్తున్నానంది. లైట్‌ తీసుకున్నా. తర్వాత పైచదువుల కోసం సిటీకెళ్లా. అప్పట్నుంచి నేను చేస్తే తన ఫోన్‌ బిజీ వచ్చేది. ఆరా తీస్తే తను ఇంకో అబ్బాయితో ప్రేమలో పడిందని తెలిసింది. కొంచెం బాధేసింది.

‘మాదాపూర్‌లో కాంపిటీటివ్‌ ఎగ్జామ్‌ ఉంది. తీస్కెళ్లవూ?’ గోముగా అడిగింది అత్తయ్య కూతురు. నా లైఫ్‌లోకి వచ్చిన మూడో అమ్మాయి. సాయంత్రం తిరిగొస్తుంటే చదువు, ప్రేమ సంగతులు కూపీ లాగింది. స్వచ్ఛంగా ఉండాలనుకునేవాణ్ని కదా! అంతా చెప్పా. ‘నిన్ను కోల్పోయిన రెండో అమ్మాయి దురదృష్టవంతురాలు. నా ప్రేమను ఒప్పుకో. జీవితాంతం తోడుంటా’ అంది. ఆశ్చర్యమేసింది. కొద్దిరోజులు ఆలోచించా. వరుసైందీ, పైగా నా గురించి తెలిసిన అమ్మాయి. పచ్చజెండా వూపా. గెంతులేసింది.

సెలవుల్లో ఇంటికెళ్లా. ‘మీ అత్తయ్య కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించిందట. నాల్రోజుల్లో అతడితో పెళ్లి’ అంది అమ్మ. నాకు షాక్‌. పెళ్లి కూడా ఫిక్సయ్యాక ఇంక తనతో మాట్లాడ్డం వ్యర్థం అనిపించింది. తర్వాత తెలిసిందేంటంటే చాలాకాలం నుంచి అత్తయ్య కూతురు వేరే అబ్బాయిని ‘కూడా’ ప్రేమిస్తోందట. ఈ దెబ్బతో అమ్మాయిలపైనే నమ్మకం పోయింది.

కొన్నాళ్లకి బంధువుల పెళ్లికి వూరెళ్లా. చుట్టాలంతా ఓ అమ్మాయిని తెగ పొగుడుతున్నారు. తనే సీత. అందం, పెద్దలంటే గౌరవం చూపే అమ్మాయి. కుర్రాళ్ల వంక కన్నెత్తి చూడదు. రెండ్రోజులు గమనించాక వాళ్లు చెప్పింది నిజమేననిపించింది. తనే నా భార్యని ఫిక్సయ్యా. అన్నయ్య పెళ్లికార్డు ఇవ్వడానికి మళ్లీ ఆ వూరెళ్లా. ఏదో పనిమీద బయటికెళ్లిందట. కార్డు వెనకాల నా వివరాలు రాసి వాళ్లింట్లో ఇచ్చా. దాదాపు నెలకు నా ఎదురుచూపులు ఫలించాయి. కొత్త సంవత్సరం రోజున శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్‌ పంపింది. వెంటనే డయల్‌ చేశా. రిప్లై లేదు. ఆపై ఎన్నిసార్లు ప్రయత్నించానో లెక్కేలేదు.

చాన్నాళ్లకు కరుణించింది. మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ మొదలయ్యాయి. తర్వాత నా గతంతోపాటు మనసులోమాట కూడా చెప్పా. ‘నువ్వు ముందు మా అమ్మానాన్నలకు నచ్చాలి. వాళ్లు ఓకే అంటేనే మన పెళ్లి’ అంది నిర్మొహమాటంగా. కష్టపడి ప్రయత్నించి సీత అమ్మానాన్నల్ని ఇంప్రెస్‌ చేశా. వాళ్లింట్లో ఒకడిగా కలిసిపోయా. మా పరిచయమైన తన మొదటి పుట్టినరోజుకి వాళ్లూరెళ్లా. రాత్రి పన్నెండిటికి నేనే స్వయంగా తనతో కేక్‌ కట్‌ చేయించా. ఆరోజు తనే ‘ఐలవ్యూ సోమచ్‌’ అంది. మనస్ఫూర్తిగా తనని నా గుండెలకు హత్తుకున్నా.

కారణాలేంటో తెలియదు. తను ఫోన్‌ చేయడం తగ్గించింది. నేను చేస్తే ఎత్తదు. చాలారోజులు ఇదేవరుస. పాత అమ్మాయిలు గుర్తొచ్చారు. సీత కూడా అలాంటిదేమో? అనే అనుమానం మొదలైంది. ‘గాళ్స్‌ అంతా ఇంతేరా. వాడుకొని వదిలేసే రకం’ స్నేహితుల మాటలతో విచక్షణ కోల్పోయా. ఆవేశంతో నానా మాటలన్నా. ‘నా మీద నమ్మకం లేకపోతే నన్నొదిలెయ్‌’ అని ఒకే ఒక మాట అంది. కోపం, కసి. నేరుగా వాళ్లింటికెళ్లా. అనారోగ్యంతో ఉంది. ఇతర సమస్యలతో బాధ పడుతోందని తెలిసింది. ఇవన్నీ చెబితే నేను ఎక్కడ బాధ పడతానోనని కొన్నాళ్లుగా నన్ను దూరం పెడుతోందట. నిజం తెలిశాక సిగ్గుతో తలొంచుకున్నా.

ఉద్యోగరీత్యా ఇప్పుడు విదేశంలో ఉన్నా. నా మనసు మాత్రం సీత దగ్గరే ఉంది. తనకేమో నాపై అలక. అనుమానించానుగా... సహజమే! కానీ నా గతం నాతో ఆ పనిచేయించింది. మన్నించి క్షమిస్తే పెళ్లి బాజాలకు సిద్ధమవుతా.

- నితిన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని