ప్రేమతో.. నో చాటింగ్‌! నో టాకింగ్‌!

మరదలిపై మనసు పడ్డాడో బావ. మాటలు కలిపినా కలవడం కుదరదంది మరదలు. పట్టుపడితే చిత్రమైన షరతు పెట్టింది. ఏంటది? అబ్బాయి మాటల్లోనే....

Published : 16 Jul 2016 01:17 IST

ప్రేమతో.. నో చాటింగ్‌! నో టాకింగ్‌!

మరదలిపై మనసు పడ్డాడో బావ. మాటలు కలిపినా కలవడం కుదరదంది మరదలు. పట్టుపడితే చిత్రమైన షరతు పెట్టింది. ఏంటది? అబ్బాయి మాటల్లోనే.

‘వన్‌ ఇయర్‌ నాతో మాట్లాడొద్దు. చాట్‌ చేయొద్దు. అలా చేస్తే నేనే వచ్చి నిన్ను కలుస్తా’ మరదలి మాట నా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. అది తలచుకున్నప్పుడల్లా మనసును మెలిపెట్టే బాధ. ఏడాది తనతో మాట్లాడకుండా ఎలా ఉండాలా అని. చెప్పలేనంత సంతోషం కూడా. సంవత్సరం గడిస్తే తను నాకు దక్కుతుందని.
డిగ్రీ దాకా నేనూ అందరిలాంటోడినే. చదువంతా ఇంటికి దూరంగానే సాగింది. కో-ఎడ్‌ కాకపోవడంతో అమ్మాయిలతో పెద్దగా మాట్లాడింది లేదు. చదువయ్యాక పోలీసు కావాలనే లక్ష్యంతో కోచింగ్‌ తీసుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో నాకో మరదలు ఉందని తెలిసింది. తనువంతా ఉద్వేగం. ఏవో గొడవలతో మామయ్య కుటుంబానికి, మాకు రాకపోకల్లేవ్‌. ఇప్పుడు తన గురించి తెలియగానే చూడాలి, కలవాలనే ఉబలాటం. తన నోటి నుంచి ‘బావా’ అనే పిలుపు వినాలనే తపన.సిటీలో బీటెక్‌ చదివేది తను. కలుసుకోవడం ఎలా అనుకుంటుంటే ఫేస్‌బుక్‌ దారి చూపింది. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెడితే మర్నాడే ఆమోదించింది. ‘ఎక్కడుంటావ్‌? ఏం చేస్తావ్‌?’ ప్రశ్నలు సంధించా. అంతే వేగంగా స్పందించింది. నేను తన బావనని చెప్పలేదు. అన్నట్టు మా ఇద్దరి బ్లడ్‌ గ్రూప్‌, పుట్టినవారం, నచ్చిన ఆట, ఇష్టదైవం... అన్నీ ఒకటే. పేర్లూ కలిశాయి. ఇవన్నీ చెబుతుంటే నోరెళ్లబెట్టేది. ‘ఇన్ని ఎలా తెలుసుకున్నావ్‌? నాపై నీకంత ఆసక్తి ఎందుకు?’ అనడిగిందోసారి. ఇదే మంచి ఛాన్స్‌. ‘ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ గురించి ప్రతి చిన్న విషయం నాకు ముఖ్యమే’ అన్నా. ‘సారీ... నేను ప్రేమించట్లేదుగా’ ఒక్కమాటతో గాలి తీసేసింది. బాధ నుంచి తేరుకుంటూనే నేను నీ బావనని చెప్పా ఆఖరి అస్త్రంగా. అయినా తను పట్టించుకుంటేగా!

తను చిన్నచూపు చూస్తేనేం... నేనొదులుతానా? ఫ్రెండ్‌ సాయంతో తన ఫొటో సంపాదించా. ఫర్వాలేదు... అందంగానే ఉంది. అడక్కముందే నా ఫోటోని పంపా. ఫోన్‌నెంబరూ జత చేశా. మర్నాడే ‘హాయ్‌’ అంటూ మెసేజ్‌. నా ఆనందానికి అవధుల్లేవ్‌. ‘ఫోన్‌ నెంబర్‌ ఇచ్చావు... ఫొటో కూడా పంపొచ్చుగా’ అన్నా ఏమీ ఎరుగనట్టే. ఆ ఛాన్స్‌ లేదు. ఇంకోసారి అడగొద్దంది.

తనకి సెలవులిచ్చారట. చెప్పకుండానే ఇంటికెళ్లిపోయింది. విషయం తెలిసి చాలా బాధపడ్డా. మాటమాత్రమైనా చెప్పొద్దా? అదే అడిగితే ‘నీకు చెప్పాలని ఏమైనా రూల్‌ ఉందా? నా ఇష్టం. మా నాన్న ఇష్టం’ అంది. నేనెంతో తల్లడిల్లిపోతుంటే తనకి అంత నిర్లక్ష్యమా? ‘ఇంకెప్పుడూ నీ గురించి అడగను. జీవితంలో డిస్ట్రబ్‌ చేయను. గుడ్‌బై’ అన్నా కోపంతో. ‘థాంక్స్‌, బై’ తన సమాధానం. కానీ రెండ్రోజులకు మించి తనతో మాట్లాడకుండా ఉండలేకపోయా. కాళ్లబేరానికెళ్లా. ‘సరేలే... ఇంకోసారి పోజు కొట్టకు’ అంది. మనసు కుదుటపడింది.

రోజూ చాట్లాడుకుంటున్నాం. కుదిరినపుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. ఇంతేనా? మరదల్ని కలవాలని కోరికగా ఉండేది. తనేమో కుదరదనేది. నాకు పట్టుదల పెరిగిపోయేది. ‘నన్ను కలవాల్సిందే. దాని కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం’ అన్నానోసారి ఆవేశంగా. అదిగో అప్పుడే ఏడాదివరకు మాట్లాడొద్దు, చాటింగ్‌ చేయొద్దనే షరతు పెట్టింది. అలా చేస్తే స్వయంగా వచ్చి కలుస్తానంది. ఇప్పటికి ఆర్నెళ్లు పూర్తయ్యాయి. బాధగా. నా ప్రియమైన ప్రేమకోసం ఇంకో ఆర్నెళ్లు ఎదురుచూస్తూనే ఉంటా. తీయనైన బాధతో.

- రామ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని