మారాను నేను... మన్నించు నన్ను!

నా అనుభవం చదివాక చాలా మందికి నాపై అసహ్యం వేయొచ్చు. కొందరు జాలి చూపొచ్చు. కానీ మీరు నాలా ఉండొద్దన్నదే నా కోరిక అంటున్న ఓ యువకుడి అంతరంగం ఇది...

Published : 23 Jul 2016 01:59 IST

మారాను నేను... మన్నించు నన్ను!

నా అనుభవం చదివాక చాలా మందికి నాపై అసహ్యం వేయొచ్చు. కొందరు జాలి చూపొచ్చు. కానీ మీరు నాలా ఉండొద్దన్నదే నా కోరిక అంటున్న ఓ యువకుడి అంతరంగం ఇది...

నేను దినేశ్‌. చదువు, అందంలోనే కాదు... అమ్మాయిల్ని ఆకర్షించి నా చుట్టూ తిప్పుకోవడంలోనూ ఫస్టే. ఇలా చేయడం తప్పని నేనెపుడూ ఫీల్‌ కాలేదు. పైగా నా టాలెంట్‌కి గర్వపడేవాణ్ని.

డిగ్రీ పూర్తై పీజీలో చేరా. నా టార్గెట్‌ అమ్మాయిలే. ఇంతలో తులసి పరిచయమైంది. తను అందరికన్నా భిన్నం. ఇవ్వడమేగానీ తీసుకోవడం తెలియదు. ‘నేనింతవరకు ఏ అమ్మాయి మొహం చూడలేదు’ అంటే నమ్మేసింది. ‘నువ్వంటే నాకు ప్రాణం’ అనగానే గుండెలపై వాలిపోయింది. తన నిస్వార్థ ప్రేమ చూసి ఒక్కోసారి నాకే ఆశ్చర్యమేసేది. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అనుకునేవాణ్ని. ఏదేమైనా తులసితోనే ఏడడుగులు నడవాలని ఫిక్సయ్యా. కానీ మనం మారాలనుకున్నా మన అలవాట్లు మారనివ్వవు. పాత గాళ్‌ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు, మీటింగ్‌లు చాటుమాటుగా కొనసాగుతూనే ఉండేవి.

పీజీ పూర్తైంది. పెద్దల్ని ఒప్పించి తులసిని పెళ్లాడా. మూణ్నెళ్లు సాఫీగానే సాగింది సంసారం. తర్వాతే మొదలయ్యాయి లుకలుకలు. కొడుకు కట్నం కోసం ఆశ పడ్డ నాన్న ఉత్తి చేతులతో వచ్చిన కోడల్ని సహించేవాడు కాదు. ఇది కాకుండా ఓ పాత స్నేహితురాలితో సరస సంభాషణలు చేస్తూ పట్టుబడ్డా. భార్య దేన్నైనా సహిస్తుందిగానీ భర్త ఇంకొక అమ్మాయితో సన్నిహితంగా ఉండటం తట్టుకోలేదని అప్పుడే అర్థమైంది. అమాయకురాలు అపరకాళిక అయ్యింది. తన ముందు దోషిగా నిలబడ్డం నాకేమాత్రం నచ్చలేదు. ‘నా భార్య నన్ను అనుమానిస్తోంది’ అంటూ అమ్మానాన్నలతో అడ్డంగా అబద్ధం ఆడేశా. అసలే తనపై కడుపుమంటతో ఉన్నవాళ్లు అనుమానించే పెళ్లాన్ని వదిలించుకొమ్మని ఉచిత సలహా ఇచ్చారు.

గొడవలు ముదురుతుండగానే పాప పుట్టింది. కొత్త బాధ్యతలు తలకు మించిన భారమయ్యాయి. సుఖపడాల్సిన వయసులో ఒక్కసారిగా వచ్చిపడ్డ కష్టాల్ని తట్టుకోలేకపోయా. ఇవన్నీ భరించలేక పిరికివాడిలా తులసికి దూరంగా పారిపోయా. నీతో నాకేం సంబంధం లేదని చెప్పేశా. తనూర్కోలేదు. నాపై కేసు పెట్టి కోర్టుకీడ్చింది. కన్నవాళ్లూ మొహం చాటేశారు. విధిలేక మళ్లీ తనతోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడైనా తప్పు తెలుసుకుంటే నా జీవితం వేరేలా ఉండేది.

పరువు తీసిందని పెళ్లాంపై పగ పెంచుకున్నా. ‘అయిందేదో అయిపోయింది. ఇప్పట్నుంచైనా బాగుందాం’ అని బతిమాలేది. నేను వింటేగా! ‘నీతోనే ఉంటా. కానీ బతికినంతకాలం నీతో కాపురం చేయను’ అని శపథం చేశా. మళ్లీ నా పాత జీవితంలోకి వెళ్లిపోయా. ఇదేంటని అడిగితే తిట్టేవాణ్ని, కొట్టేవాణ్ని. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా మారుతుందట. ఎన్నాళ్లని నన్ను భరిస్తుంది తను. ‘మీకు నచ్చినట్టుగా మీరుండండి. మారమని అడగను. నేనూ మీతో మాట్లాడను’ అందోరోజు. ఒకే ఇంట్లో ఒంటరులమయ్యాం.

ఏడేళ్లు గడిచాయి. నేను చేసిన పాపం ఫలితమేమో కొన్ని కారణాలతో నా ఉద్యోగం వూడింది. తల్లిదండ్రులు, తమ్ముడి దగ్గరికెళ్తే ‘ఏరి కోరి పెళ్లి చేసుకున్న పెళ్లాం ఉందిగా. మమ్మల్నెందుకు సాయం అడుగుతున్నావ్‌?’ అనేవారు. ఇప్పుడు నా భార్యే ఉద్యోగం చేస్తూ నన్ను, పాపని పోషిస్తోంది. మానసికంగా, శారీరకంగా తనని ఎంతో హింసించినా నాకు మాత్రం ఏ లోటూ లేకుండా చూసుకుంటోంది. కానీ మౌనం తప్ప మా మధ్య మరేం లేవు. కొద్దిరోజుల్లోనే నా పరిస్థితి, నా భార్య గొప్పదనం అర్థమైంది. పూర్తిగా మారిపోయాను. ‘తప్పు చేశా. మునుపటిలా కలిసి మెలిసి ఉందాం’ అని బతిమాలా. ఒప్పుకోలేదు. ‘ఇంతకాలం నీవల్ల నాకే సుఖం దక్కలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు? పాప కోసమే బతుకుతున్నాను. అలాగే బతకనివ్వు’ అంది. కానీ తను తప్పకుండా మారుతుందనే ఆశతోనే బతుకుతున్నా.

ప్రేమించడబడటం ఒక గొప్ప వరం అంటారు. తులసి నన్ను ప్రేమించినంతకాలం నాకు ఆ విలువ తెలియలేదు. విలువ తెలిసే సమయానికే ఆమె మనసు విరిగింది. నా జీవితం నాలాంటి భర్తలకు కనువిప్పు కావాలి.

- దినేశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని