బైక్‌ కలిపింది మా ఇద్దరినీ!

క్లాస్‌మేట్‌ పెళ్లి కోసం వూరెళ్తున్నా. సిటీ దాటుతుండగా పార్కింగ్‌ చేసిన బండికి తాళం వేయలేదనే సంగతి గుర్తొచ్చి గుండె జల్లుమంది.....

Published : 13 Aug 2016 01:31 IST

బైక్‌ కలిపింది మా ఇద్దరినీ!

క్లాస్‌మేట్‌ పెళ్లి కోసం వూరెళ్తున్నా. సిటీ దాటుతుండగా పార్కింగ్‌ చేసిన బండికి తాళం వేయలేదనే సంగతి గుర్తొచ్చి గుండె జల్లుమంది. అసలే మోజు పడి కొన్న కొత్త పల్సర్‌. ఇన్సూరెన్స్‌ కూడా లేదు. వెంటనే ఫ్రెండ్‌కి ఫోన్‌ చేశా. ‘నిన్ననే వూరెళ్లాన్రా’ వాడి మాటతో డీలా పడిపోయా. ‘ఓసారి నా ఫ్రెండ్‌కి కాల్‌ చెయ్‌. హెల్ప్‌ చేస్తాడు’ అంటూ ఓ నెంబరిచ్చాడు. ప్రాణం లేచొచ్చింది.

క్షణం ఆలస్యం చేయకుండా ఫోన్‌ కలిపా. ‘హలో.. ఎవరు?’ అందో అమ్మాయి గొంతు. ఫ్రెండ్‌ ఫ్రెండ్‌ భార్యో, చెల్లినో అనుకొని విషయం చెప్పా. ఇక్కడ అలాంటి పేరుతో ఎవరూ లేరంది. ఏదో వంకతో మాటలు కలిపే ఇడియట్స్‌ ఎక్కువయ్యారంటూ తిట్టింది. అసలే బాధలో ఉన్న నాకు తన మాటలు చిరాకు తెప్పించాయి. బండి నెంబర్‌ చెప్పి ‘నీతో సోది మాట్లాడ్డానికి ఫోన్‌ చేయలేదు. డౌట్‌ ఉంటే వెళ్లి చెక్‌ చేస్కో. ముందు మర్యాదగా మాట్లాడ్డం నేర్చుకో’ అంటూ దులిపేశా. తప్పుడు నెంబర్‌ ఇచ్చిన ఫ్రెండ్‌నీ వాయించా.

‘మా ఇల్లు బస్టేషన్‌ దగ్గరే. తమ్ముడు వెళ్లి బైక్‌కి తాళం వేశాడు. వూరొచ్చాక కీ తీస్కెళ్లొచ్చు’ ఓ గంటయ్యాక మెసేజ్‌ పంపిందా అమ్మాయి. థాంక్స్‌తోపాటు ముందు జరిగిందానికి సారీ చెప్పా. మర్నాడు స్నేహితుడి పెళ్లి ఘనంగా జరిగింది. సాయంత్రం ఆలస్యం కావడంతో ఆ రాత్రే తిరిగొద్దాం అనుకున్నా కుదరలేదు. తర్వాతరోజు ఉదయం బస్సు దిగగానే నేరుగా ఆఫీసుకెళ్లిపోయా. మర్నాడు నా వీక్లీ ఆఫ్‌. కొన్ని పండ్లు కొనుక్కొని అమ్మాయి చెప్పిన అడ్రెస్‌కి వెళ్లా. గుమ్మంలోనే ఎదురొచ్చింది. సమంతలా అందంగా లేకపోయినా కాజల్‌లా పెద్దకళ్లతో ఆకట్టుకునేలా ఉంది. అప్పుడప్పుడు బుగ్గల్లో సొట్టలుపడి ఆకర్షణీయంగా కనపడుతోంది. ‘ఇంకాస్త ముందొస్తే బాగుండు. మావాళ్లతో కలిసి గుడికెళ్లేదాన్ని’ మొహం చిట్లిస్తూ చెప్పింది. సారీ చెప్పి పండ్ల కవర్‌ చేతికిస్తుంటే ‘ఇలాంటి ఫార్మలిటీసేం అక్కర్లేదు. మీరు దయచేస్తే నేను బయటికెళ్తా’ కొట్టినట్టే చెప్పింది.

గదికొచ్చాక రోజంతా తన ఆలోచనలే. ఆపై అప్పుడప్పుడు ఫోన్లు, మెసేజ్‌లు చేసేవాణ్ని. ఎప్పుడో ఓసారి బదులిచ్చేది. ఓసారి ప్రేమ, పెళ్లిపై అభిప్రాయం అడిగా. ‘అమ్మానాన్నల్ని కష్టపెట్టే ప్రేమ నాకు నచ్చదు. వాళ్లు చెప్పిన అబ్బాయినే పెళ్లాడతా’ అంది. ఆ మాటతో ఆమెపై మరింత ప్రేమ పెరిగిపోయింది. తర్వాత ఏమైందో తెలియదుగానీ కొద్దిరోజులకే నాతో మాట్లాడ్డం మానేసింది. తట్టుకోలేకపోయా. ఓరోజు నేరుగా వాళ్లింటికెళ్లా. బైక్‌ హారన్‌ కొడితే బయటికొచ్చింది. సంతోషంతో చేతులూపుతూ హాయ్‌ చెప్పా. కొరకొరా చూసి ‘గెటౌట్‌’ అనేసి లోపలికెళ్లిపోయింది. నా మొహం మాడిపోయింది.

ఆ రాత్రే ఫోన్‌ చేసింది. నీకు సాయం చేయడమే తప్పైందంటూ మొదలుపెట్టింది. ‘ఆరోజు నువ్వు మా ఇంటికొచ్చినపుడు పక్కింటివాళ్లు చూసి నాన్నకి చెప్పారట. తర్వాత మనం అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం గమనించి తప్పుగా అర్థం చేసుకున్నారు. పరువు తీస్తున్నావ్‌ అని నాన్న బాధ పడ్డారు’ అని ఏడుస్తూ చెప్పింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. తర్వాత బాగా ఆలోచించాక ఓ నిర్ణయానికొచ్చా.

‘ఈరోజే నాకు పెళ్లిచూపులు. దయచేసి ఇంకోసారి ఫోన్‌ చేయొద్దు. మా ఇంటి వైపు రావొద్దు’ ఓ పొద్దునే తన సందేశం. నవ్వుతూ సరేనన్నా. ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ పెళ్లిచూపుల కుర్రాడ్ని నేనేనని. తను నాకిష్టమైన అమ్మాయి. పెద్దలంటే గౌరవం. సాయం చేసే గుణముంది. ఎవరికైనా ఇంతకన్నా ఏం కావాలి? పైగా మా సామాజికవర్గమే. అమ్మానాన్నల్ని ఒప్పించి వాళ్లతో మాట్లాడించా. నా గురించి ఆరా తీసి ఓ వారమయ్యాక వాళ్లూ ఓకే అన్నారు. ఈ ఎపిసోడ్‌లో అందరికన్నా ఆశ్చర్యపోయింది మాత్రం ఆ అమ్మాయే. పెళ్లిచూపులు సక్సెస్‌ అయ్యాయి. ఈనెల చివరి వారంలో మా పెళ్లి. మీరంతా ఆశీర్వదించండి. అన్నట్టు నా జీవితాన్ని ప్రేమ తీగలా అల్లుకోబోతున్న అమ్మాయి పేరు లత.

- సతీశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని