పల్లవించవా...నా గుండెలో!

‘ఫేస్‌బుక్‌ ప్రేమలు, స్నేహాలన్నీ అబద్ధం. అదొక ­హా ప్రపంచం. అందులో మంచి కన్నా చెడే ఎక్కువ’...-మొదట్లో నేనూ ఇలాగే అనుకునేవాణ్ని. ఒకమ్మాయి నా అభిప్రాయం మార్చేసింది.

Published : 03 Sep 2016 01:15 IST

పల్లవించవా...నా గుండెలో!

‘ఫేస్‌బుక్‌ ప్రేమలు, స్నేహాలన్నీ అబద్ధం. అదొక ­హా ప్రపంచం. అందులో మంచి కన్నా చెడే ఎక్కువ’...-మొదట్లో నేనూ ఇలాగే అనుకునేవాణ్ని. ఒకమ్మాయి నా అభిప్రాయం మార్చేసింది.

ఓరోజు ఫేస్‌బుక్‌ తెరవగానే పల్లవి పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. ఓకే చేశా. ‘చదువుకుంటూనే ఓ స్వచ్ఛందసంస్థ తరపున పనిచేస్తున్నా. ఛాటింగ్‌ చేస్తూ విరాళాలు సేకరిస్తుంటా. మీ క్లాస్‌మేట్స్‌లో ఇద్దరు నా ఫ్రెండ్స్‌’ వివరాలందించింది. ‘తనది ఫేక్‌ అకౌంట్‌రా. తీపి మాటలు చెప్పి డబ్బులు గుంజే రకం’ అన్నారు సహాధ్యాయులు. ఎవరి మాట నమ్మాలో తెలీలేదు. ఛాటింగ్‌ మాత్రం కొనసాగేది.

వారం తిరక్కముందే నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. మాటలు వ్యక్తిగతంవైపు మళ్లాయి. ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌. ఐదు సబ్జెక్టులు మిగిలాయన్నా. ‘వ్వాట్‌... ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? కంప్లీట్‌ చేయకపోతే నీతో కట్‌’ అని బెదిరించింది. రోజూ కాలేజీకి వెళ్లు. కష్టపడి చదువు అనేది. పరీక్షలపుడు తెల్లవారుజామునే ఫోన్‌ చేసి నిద్ర లేపేది. పుస్తకం పట్టేదాకా వదిలేది కాదు. తన సొంత విషయాలూ పంచుకునేది.పల్లవి ప్రోద్బలంతో ఫైనలియర్‌తోపాటు సప్పీలు ఒకేసారి పూర్తి చేశా. తను డిగ్రీ పాసైంది. రెణ్నెళ్లు తిరక్కముందే తిరుపతిలో ఉద్యోగం వచ్చిందనే తీపి కబురు చెప్పింది. నేనూ ప్రయత్నాలు మొదలుపెట్టా. ఎక్కడ ఏ ఉద్యోగం ఉన్నా చెప్పేది. కొన్నింటికి తనే స్వయంగా దరఖాస్తు చేసేది. మేం సుదూరాన ఉన్నా మనసులు మాత్రం ఒకేలా ఆలోచించేవి.

తర్వాతేంటి? ఒకర్నొకరం చూసుకోవడం... సరదాలు... షికార్లు... ప్రేమ. ఇవన్నీ ముందే ­హించాం. పరిణతిగా ఆలోచించి ‘మనం అందరిలా కావొద్దు. ఇద్దరం బాగా స్థిరపడ్డాకే కలుద్దాం’ అని ఒట్టేసుకున్నాం.

ఏమైందో తెలియదు సడెన్‌గా తన నెంబర్‌ పనిచేయలేదు. నాలో ఆందోళన ఎక్కువైంది. పదకొండోరోజు ఫోన్‌ చేసి ‘మా పేరెంట్స్‌ యాక్సిడెంట్‌లో పోయారు. నేను అనాథనయ్యా’ ఏడుస్తూ చెప్పింది. నా గుండె తరుక్కుపోయింది. అంత బాధలో పల్లవి పక్కన లేనందుకు కుమిలిపోయా. ‘ఏకాకినయ్యానని బాధగా ఉంది రఫీ. నాకూ అమ్మానాన్నల దగ్గరికి వెళ్లాలనిపిస్తోంది’ అని ఏడ్చేది. పిరికి మాటలు మాట్లాడొద్దని ధైర్యం చెప్పేవాణ్ని. నాకుద్యోగం రాగానే వచ్చి కలుస్తానని చెప్పా. కానీ ఈలోపే వాళ్ల బాబాయ్‌ సలహాతో బెంగళూరు వెళ్తానంది. జాగ్రత్తలు చెప్పా. తర్వాత మా చెల్లి పెళ్లి కుదిరింది. తనతో చెబితే ఆర్థికసాయం చేస్తానంది. మీ బాబాయి ఒప్పుకుంటేనే వీలైనంత సర్దుబాటు చేయమన్నా. సరేనంది. ఆపై ఏ సమాధానం లేదు. ‘మా బాబాయి నీతో మాట్లాడొద్దు అన్నారు’ కొద్దిరోజుల తర్వాత ఓ మెసేజ్‌ పెట్టింది. పెళ్లి పనుల హడావుడిలో ఉండటంతో తర్వాత మాట్లాడొచ్చులే అనుకున్నా.

చెల్లి పెళ్లిలో నా ఫోన్‌ పోయింది. పల్లవి నెంబర్‌ అందులో మాత్రమే ఉంది. తన ఫేస్‌బుక్‌, మెయిల్‌కి మెసేజ్‌లు పెట్టా. జవాబు లేదు. ఫేస్‌బుక్‌లో మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ని అడిగితే వివరాలేం తెలియవన్నారు. తను చదివానని చెప్పిన కాలేజీకెళ్తే ఆ పేరుతో ఏ అమ్మాయి చదువుకోలేదన్నారు. నాకు షాక్‌. మోసపోయావ్‌ అన్నారు స్నేహితులు. నాకు మాత్రం తనవల్ల జరిగిన మంచే గుర్తొస్తోంది. తన వివరాలు తప్పు చెప్పి ఉండొచ్చుగాక. నా పట్ల చూపిన ప్రేమాభిమానాలు నకిలీవి కాదని ఇప్పటికీ నమ్ముతున్నా. ఆ ప్రేమతోనే ఏడాది దాటినా పల్లవినింకా వెతుకుతూనే ఉన్నా. అన్నట్టు... నేనిపుడు ఉద్యోగం సంపాదించి మంచి స్థానంలో ఉన్నా. తను నా ముందుకొస్తే గుండెలో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా.

- రఫీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని