ప్రేమల్ని వదిలేయండి... పెద్దల్ని కాదు!

లేత ప్రాయంలో ఓ అమ్మాయి ప్రేమలో పడింది. కన్నవాళ్లను ఎదిరించి గడప దాటింది. ఇప్పుడు తన పరిస్థితేంటి?

Published : 08 Oct 2016 01:10 IST

ప్రేమల్ని వదిలేయండి... పెద్దల్ని కాదు!

లేత ప్రాయంలో ఓ అమ్మాయి ప్రేమలో పడింది. కన్నవాళ్లను ఎదిరించి గడప దాటింది. ఇప్పుడు తన పరిస్థితేంటి?

పొగడ్తలు తేనె పూసిన కత్తుల్లాంటివి. నొప్పి తెలియకుండానే గుండెల్లోకి దిగబడతాయి. ‘నీ అందం ముందు హీరోయిన్లూ దిగదుడుపే. నీ అంత తెలివి, ధైర్యం ఉన్న అమ్మాయిని నేనింతవరకు చూడలేదు’ శ్రీకాంత్‌ చెప్పినపుడు ముచ్చటేసింది. అలాంటి పొగడ్తలకే నేనూ పడిపోయా. తన మాట వింటే నాకు పూనకమొచ్చేది. అతడి చూపు సోకితే తనువు పులకించేది. ఇంటర్‌, డిగ్రీల్లో తరగతులకి హాజరైన రోజులకన్నా అతడి వెంట షికార్లకు వెళ్లిన రోజులే ఎక్కువ.

పెళ్లైన మూడేళ్లకే నాన్న వదిలేస్తే నన్ను చంకనేసుకొని పుట్టింటికొచ్చేసింది అమ్మ. నేనే సర్వస్వం అనుకుంది. కానీ ఎంతైనా ఒంటరిది కదా.. మగాళ్ల వేధింపులు మొదలయ్యాయి. ఈ సమాజంలో ఒంటరిగా బతకలేవని అమ్మని కష్టపడి ఒప్పించి రెండోపెళ్లి చేశారు తాతయ్య. మారుతండ్రి పిల్లల్ని చిత్రహింసలు పెడతాడు.. ఏమాత్రం ప్రేమ చూపరు.. బాధ్యతలుండవు.. ఇలా అనుకునేదాన్ని. నేనూహించినట్టు ఆయనేం లేరు. నన్ను సొంత కూతురిలానే చూసుకునేవారు. అయినా ఎందుకో ఆయన్ని తండ్రిగా అంగీకరించలేకపోయా.

‘నువ్వొకర్ని ఇష్టపడటం నేను కాదనను తల్లీ.. కానీ నువ్వు ఎంచుకున్న వ్యక్తి సరైనోడు కాదు. తనకి బాధ్యతలు తెలియవు. అందుకే అతడ్ని మర్చిపో’ అందోసారి అమ్మ. ఎప్పుడు పసిగట్టిందోమరి నా ప్రేమని. అప్పటికే పీకల్దాకా శ్రీకాంత్‌ మైకంలో ఉన్న నాకు తల్లిదండ్రుల మాటలు చెవికెక్కలేదు. మా మధ్య మాటల యుద్ధం జరిగింది. ‘నీ సుఖం నువ్వు చూసుకొని రెండోపెళ్లి చేసుకున్నావ్‌. నాకు నచ్చిన వ్యక్తిని నేను పెళ్లాడ్డం తప్పా?’ అనాలోచితంగా అనేశా. కన్నీళ్ల పర్యంతం అయ్యింది అమ్మ. నేనేం పట్టించుకోకుండా గడప దాటేశా.

‘కులం కట్టుబాట్లు తెంచుకొని వచ్చేశావ్‌ సెభాష్‌’ అన్నారు స్నేహితులు. వాళ్లే మా పెళ్లికి పెద్దలయ్యారు. ఏడాది నా కొంగు వదల్లేదు శ్రీకాంత్‌. కానీ ప్రేమ కడుపు నింపదుగా! తనది చిన్న ఉద్యోగం.. పైగా బద్ధకం. అద్దె కట్టడానికే నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఇంట్లో ప్రతి సరుక్కీ కొరతే. తప్పనిసరై నేనూ చిన్న కొలువులో చేరా. అప్పట్నుంచి మొదలైంది నాకు టార్చర్‌. పచారీ కొట్టు.. కూరలబ్బాయి.. ఆఫీసు.. ఏ మగాడితో మాట్లాడినా తప్పే. ఈ బాధల్లోనే నాకో పాప పుట్టింది. బంధువులు రారు. బాధలొస్తే కన్నీళ్లు తుడవడానికి ఎవరూ లేరు. ఆయనకైతే నాపై పూర్తిగా మోజు తీరింది. పనిచేయడానికి బద్ధకించేవాడు. పొద్దంతా పాత స్నేహితురాళ్లతో కాలక్షేపమే.

నేను పనిచేస్తేనే నాకు, పాపకి తిండి. చంకన పాపతో రోజు పదిగంటలు కష్టపడుతున్నా. నాకీ శాస్తి జరగాల్సిందే. చిన్నప్పుడు నాన్న వదిలేస్తే పొత్తిళ్లలో పెట్టుకొని పుట్టింటికి చేరింది అమ్మ. మగాళ్ల వంకర చూపులు.. బంధువుల హేళనలు భరించింది. చిరిగిన చీరలు కట్టుకొని నాకు అడక్కముందే అన్నీ కొనిపెట్టింది. నేనేం చేశాను? అమ్మ గుండెలమీద తన్ని బయటికొచ్చేశాను. ప్రేమ మైకంలో కుటుంబం పరువు తీశాను. నేనీ శిక్ష అనుభవించాల్సిందే.

ప్రేమించడం.. పెద్దల్ని ఎదిరించడం.. మొదట్లో హీరోయిజంలాగే ఉంటుంది. కానీ జీవితం సినిమా కాదు. కష్టసుఖాల్లో ఒకరి తోడు లేకుండా, పెద్దవాళ్ల ప్రేమాప్యాయతలు పొందకుండా బతకడం చాలా కష్టం. ప్రేమికులారా.. వీలైతే పెద్దల్ని ఒప్పించే పెళ్లిపీటలెక్కండి. లేదంటే ప్రేమనే వదిలేయండి.

- ఓ అభాగ్యురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని