మనసిచ్చి రమ్మంటే... మసి చేసి పొమ్మంది!

నా వయసు ముప్ఫై ఒకటి. జీతం డెబ్భై వేలు. ఇది బాగున్నా ‘ఇంకా పెళ్లి కాలేదు’ అనే ట్యాగ్‌లైన్‌ మాత్రం...

Published : 22 Oct 2016 01:34 IST

మనసిచ్చి రమ్మంటే... మసి చేసి పొమ్మంది!

  నా వయసు ముప్ఫై ఒకటి. జీతం డెబ్భై వేలు. ఇది బాగున్నా ‘ఇంకా పెళ్లి కాలేదు’ అనే ట్యాగ్‌లైన్‌ మాత్రం నాతో సహా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. అందుకే సంబంధాల కోసం వెతుకులాట మొదలెట్టా. త్వరలోనే నేను కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి ఓ మ్యాట్రిమోనీలో తారసపడింది. ఏదో కంపెనీలో హెచ్‌ఆర్‌ విభాగంలో పనిచేస్తోందట. ‘నలుగురం ఆడపిల్లలం. ఐదేళ్ల కిందటే అమ్మ పోయింది. మేం కట్నం ఇచ్చుకోలేం’ అంది సూటిగా. ఆ ముక్కుసూటితనమే నాకు నచ్చింది.
అభిరుచులు, ఆసక్తులు పంచుకున్నాం. ‘కార్లలో తిరగాలి’, ‘స్టార్‌ హొటెళ్లొ తినాలి’, ‘ఇంగ్లండ్‌లో స్థిరపడాలి’ ఇలా చెప్పుకొచ్చేది. ‘మంచి జీతమే కదా.. కారెందుకు లేదు?’, ‘ఇల్లు ఎప్పుడు కొంటున్నావ్‌?’ అనడిగేది. తనలా హైరేంజ్‌లో ఆలోచించడం తప్పేమనిపించలేదు. కొలీగ్స్‌కి తన ఫొటో చూపిస్తే ‘ఇంత 

అందమైన అమ్మాయా? కాకిముక్కుకు దొండపండులా ఉంది’ అన్నారు. గర్వంగా ఫీలయ్యా. పైసా కట్నం అక్కర్లేదంటే కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పారు ఆ అమ్మాయి నాన్న.
కొన్నాళ్లకే మీరు, అండీ వదిలేసి ‘ఏరా’ అనేది. కాబోయే పెళ్లామే కదాని మురిసిపోయా. ‘రేయ్‌ బక్కోడా.. నాకోసం ఎలాగైనా లావవు’ ఆర్డరేసిందోసారి. వెంటనే జిమ్‌లో చేరా. నైట్‌ షిఫ్ట్‌లు.. హాస్టల్‌ భోజనం.. నావల్ల కాలేదు. నెలలో మరింత పీలగా మారా. నేనసలే అందంగా ఉండను. తనేమో అప్సరస. ఇలా ఉంటే నచ్చుతానో, లేదోననే భయం మొదలైంది. అడిగితే ‘పిచ్చిమొద్దూ.. నన్ను నీలా ఇష్టపడేవాళ్లు ఎవరూ దొరకరు. నిన్ను కాకుండా ఇంకెవర్ని చేసుకుంటా?’ అంది.
రోజులు గడుస్తున్నాయి. తనకి ఫోన్‌ చేస్తే అప్పుడప్పుడు ఎంగేజ్‌ వచ్చేది. గంటలకొద్దీ. అడిగితే ఇంతెత్తున లేచేది. ‘ఏంటి ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడొద్దా? నా స్నేహితురాలి లవర్‌ మోసం చేశాడు. అంతా కలిసి అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం’ అందోసారి. నమ్మబుద్ధి కాలేదు. మర్నాడు ఫోన్‌ చేసి ‘కాబోయే పెళ్లాన్ని నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు డియర్‌’ అంటూ ప్రేమగా మాట్లాడింది. పడిపోయా. గంటలకొద్దీ ఎంగేజ్‌ వచ్చినపుడు ఇలాగే ఏదో చెప్పి కూల్‌ చేసేది.
సర్‌ప్రైజ్‌ చేద్దామని ఓసారి చెప్పకుండా వాళ్లింటికెళ్లా. చిరునామా, బైక్‌ నెంబర్‌.. అన్నీ తప్పే. ఫోన్లో నిలదీస్తే బయటికెళ్లా.. ఆఫీసులో ఓ ఉద్యోగి కేసులో ఇరుక్కుంటే పోలీస్‌స్టేషన్‌లో ఉన్నా అంటూ ఏవేవో పొంతన లేని సమాధానాలు చెప్పింది. మూడ్రోజులు తిప్పాక తాపీగా ఆ ఇల్లు మారామంది. నాకు కోపం, అనుమానం వచ్చినప్పుడల్లా ‘నువ్వే నా ప్రాణం’, ‘యూ ఆర్‌ మై హీరో’ అని పొగిడి కరిగించేది.
ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కుటుంబసమేతంగా వాళ్లింటికెళ్లాం. ఫొటోలో కన్నా ఇంకా అందంగా ఉంది. తను నా సొంతం కాకపోతే బతుకే దండగనిపించింది. అప్పటికప్పుడే నచ్చిందని చెప్పేశా. తనేమో ఏమీ చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టి నరకం చూపించింది. మూడోరోజు మ్యాట్రిమోనీ సైట్‌లో కనిపించింది. ‘ఇంకో మ్యాచ్‌ కోసం చూస్తున్నావా?’ అంటే ‘ఔను.. నువ్వూ వేరే అమ్మాయిని చూసుకో’ అంది నిర్మొహమాటంగా. నా గుండెలో తుపాకీ తూటాలా దిగిందా మాట. ఆరోజంతా ఏడ్చాను.
మొదట్నుంచే నేనంటే తనకిష్టం లేదు. కానీ నా జీతం, హోదా నచ్చాయి. నన్ను ఓ ‘ఆప్షన్‌’లా పెట్టుకొని ఇంకో కుర్రాడితో ప్రేమాయణం నడుపుతోంది. ఈవిషయం వాళ్ల దూరపు బంధువులే చెప్పారు. ఇది చాలదన్నట్టు మ్యాట్రిమోనీ సంబంధాలూ వెతుకుతోంది. ఇవేం తెలియని నేను పిచ్చివాడిలా తనపై ఆశలు పెంచుకున్నా. ఇంత జరిగినా తనపై ప్రేమ చంపుకోలేకపోతున్నా. ఈమధ్యే ఆమె పుట్టినరోజు గుర్తొచ్చి ఓ ఖరీదైన గడియారం పంపా. ‘ఫ్రెండ్‌గా నీ గిఫ్ట్‌ తీసుకుంటున్నా’ అని చెప్పి డబ్బుపై వ్యామోహాన్ని మరోసారి చాటుకుంది.
పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఆస్తిపరుడై ఉండాలనుకోవడం తప్పు కాదు. అత్యాశతో మనసులతో ఆడుకోవడమే నేరం. ఇప్పటికైనా తను తన ఆశకు హద్దులు గీసుకొని ఇంకొకరికి గుండెకోత మిగల్చొద్దని ఆశిస్తున్నా.

- కృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని