అందరు అమ్మలూ ఆప్యాయత పంచరు!

అమ్మంటే అనురాగం పంచుతుంది. కానీ ఓ అమ్మ మాత్రం అందుకు భిన్నం. అయినా అమ్మని క్షమిస్తూనే తనో మంచి అమ్మలా ఉంటానంటోంది ఓ కూతురు.

Published : 12 Nov 2016 01:46 IST

అందరు అమ్మలూ ఆప్యాయత పంచరు!

మ్మంటే అనురాగం పంచుతుంది. కానీ ఓ అమ్మ మాత్రం అందుకు భిన్నం. అయినా అమ్మని క్షమిస్తూనే తనో మంచి అమ్మలా ఉంటానంటోంది ఓ కూతురు.

నా తొమ్మిదో తరగతిలో అక్కకో సంబంధం వచ్చింది. ‘నేనిప్పుడే పెళ్లి చేసుకోను. ఏఎన్‌ఎమ్‌ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం చేస్తా’ తెగేసి చెప్పింది అక్క. ఆ సంబంధం నాకు కట్టబెట్టారు. వద్దని చెప్పే ధైర్యం, తెలివితేటలు లేవు.

మొదటిరోజే మొదలయ్యాయి వెతలు. అత్తగారిది గంపెడు కుటుంబం. వెట్టిచాకిరీ చేయలేక నా లేత చేతులు బొబ్బలెక్కేవి. మా ఇంటికెళ్తానని రోజూ ఏడ్చేదాన్ని. నాపై జాలి కలిగిందో.. విసుగు చెందారో.. కొన్నాళ్లకే మా ఇంట్లో వదిలేశారు. తీసుకెళ్లడానికి మళ్లీ రాలేదు. ‘మీ ఆయనేడీ?’, ‘ఇక్కడే ఉండిపోతావా ఏంటీ’ ఇరుగుపొరుగుల సూటిపోటి మాటలు మొదలయ్యాయి. అమ్మ అవమానంగా ఫీలయ్యేది. ఓరోజు పిన్నిని తోడిచ్చి నన్ను మా మెట్టినింటికి పంపింది. మళ్లీ ఎందుకొచ్చావని చేయి చేసుకున్నారు మా ఆయన. వెనక్కి వచ్చేశా. చదువుకోవచ్చని నేను సంబరపడితే శనిలా దాపురించానని అమ్మ తిట్టేది.

అక్క ఫ్రెండ్‌ దగ్గర ఉండి చదువుకునేది. నేనూ అక్క చదివే కాలేజీలోనే చేరా. రోజూ తనకి ఇంటి నుంచి లంచ్‌బాక్స్‌ తీసుకెళ్లేదాన్ని. ఆ క్రమంలోనే పరిచయమయ్యాడు నరేశ్‌. తిట్లు, ఛీత్కరింపులే నిత్యకృత్యమైన నాకు అతడి మాటలు వేసవిలో పన్నీటి జల్లులా తోచాయి. ఏ కష్టమొచ్చినా తనతో చెప్పుకునేదాన్ని. ఓదార్చి సాయం చేసేవాడు. మా సాన్నిహిత్యం అమ్మకి తెలిసింది. తనతో మళ్లీ కనిపిస్తే కాళ్లు విరిచేస్తానంది. అమ్మకి మళ్లీ కనిపించొద్దని మేం ఇంటికి దూరంగా వెళ్లిపోయాం. స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమకు గుర్తుగా నాలుగేళ్లలో ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.

మా చిరునామా ఎలా కనుక్కుందోగానీ ఓరోజు మా ఇంట్లో ప్రత్యక్షమైంది అమ్మ. ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడింది. ఎంతైనా అమ్మ అమ్మేకదా! తనని చూడగానే కన్నీళ్లు పొంగుకొచ్చాయి. గట్టిగా హత్తుకొని తనివితీరా ఏడ్చా. మేం కలిసిపోవడం నరేశ్‌కి నచ్చలేదు. ‘మీ వాళ్లకు దూరంగా ఉండు’ అన్నాడు. నేనొప్పుకోలేదు. గొడవలు మొదలయ్యాయి. ఆర్పాల్సిన అమ్మ ఆజ్యం పోసింది. ‘ఇలాగైతే కష్టం. నేను విడాకులిస్తా’ అన్నాడు తను. ‘పంతం నీ ఒక్కడికేనా? నీ ఇష్టమైంది చేసుకో’ అన్నా మూర్ఖంగా. మేం విడిపోయాం. ఇద్దరు పిల్లల్ని చంకనేసుకొని పుట్టింటికి చేరా.

ఇంటికి రాగానే అమ్మ ప్రేమ మాయమైంది. మళ్లీ ఛీత్కరింపులు.. అవమానాలు. తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్‌నంటూ ఒకతను రోజూ మా ఇంటికొచ్చేవాడు. అమ్మ వయసే. తను రాగానే అమ్మ బయటికెళ్లిపోయేది. తను మాటల్లో పెట్టి నన్ను ఎక్కడెక్కడో తాకాలని ప్రయత్నించేవాడు. అతడి దుర్బుద్ధి తెలిశాక వారించా. తను మరింత రెచ్చిపోయి పశుబలం చూపేవాడు. ఓసారి అమ్మతో అంతా చెప్పేశా. ‘ఫర్వాలేదు.. తనేం చేసినా భరించు. నిన్ను జీవితాంతం భరిస్తాడు’ అంది. ‘ఛీ ప్రపంచంలో ఇలాంటి తల్లులు ఉంటారా? అని అమ్మపై అసహ్యమేసింది. అమ్మ అండతో నన్ను రోజూ వేధించేవాడు.

ఓసారి బాగా ఆలోచించా. అమ్మకెలాగూ నాపై ప్రేమ లేదు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా.. ఈ సమాజం వంకరచూపులు తప్పాలన్నా నాకో తోడు కావాలి. వయసులో చాలా తేడాలున్నా తనని భర్తగా స్వీకరించా. పెనం మీంచి పొయ్యిలా పడినట్టైంది నా పరిస్థితి. తనకి నా శరీరం మాత్రమే కావాలి. బాధ్యతలు పట్టవు. పైగా నాపై విపరీతమైన అనుమానం. రోజూ నరకం చవిచూస్తున్నా.

వూహ తెలిసిన దగ్గర్నుంచీ నాకన్నీ కష్టాలే. నా వెతలన్నింటికీ కారణం అమ్మే. అయినా ఫర్వాలేదు.. నేను అమ్మని ద్వేషించను. పోరాడుతూనే ఉంటాను. మా అమ్మలాంటి అమ్మలా కాకుండా నా కూతుళ్లు నన్ను మంచి అమ్మలా భావించేలా బతుకుతూనే ఉంటాను.

- మౌనిక (పేర్లు మార్చాం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని