ప్రేమను పంచి...వేదన మిగిల్చి...

‘ప్రేమంటే ఏంటి?’ నూనూగు మీసాల వయసులో అమాయకంగా అడిగా నేను.....

Published : 19 Nov 2016 01:38 IST

ప్రేమను పంచి...వేదన మిగిల్చి...

‘ప్రేమంటే ఏంటి?’ నూనూగు మీసాల వయసులో అమాయకంగా అడిగా నేను. ‘పిచ్చోడా.. రుచి చూడటానికి అది హల్వా కాదు.. ఒక్క మాటలో చెప్పడానికి సూక్తి కాదు. అదో తీయని అనుభూతి. ఫీలవ్వాలంతే’ వయసులో పెద్దవాడైన ఫ్రెండ్‌ చెప్పాడు. నాకూ ప్రేమలో పడాలనే కోరిక మొదలైంది. డిగ్రీ వరకూ అబ్బాయిల కాలేజీల్లోనే చదవడంతో ప్రేమ వేదన రెట్టింపైంది.

ఉద్యోగం లేదనో.. డబ్బుల్లేవనో చాలామంది ప్రేమికులు విడిపోవడం చూశా. నా ప్రేమ అలా ఉండొద్దనుకున్నా. దానికి ఏకైక మార్గం మంచి ఉద్యోగం సంపాదించడం. ఎంసీఏలో చేరా. పక్కనే పదులకొద్దీ అందమైన అమ్మాయిలు. తపోభంగం కలిగించే దేవకన్యల్లా. చలించకుండా రెండేళ్లు చదువే లోకంగా గడిపా. ప్రాంగణ నియామకాల్లో ఓ పెద్ద కంపెనీకి ఎంపికయ్యా.

కొలువు దొరికింది.. ఇక కలే మిగిలింది. శిక్షణ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టా. అదేం చిత్రమో.. నా మనసుకు నచ్చినవాళ్లు ఒక్కరూ ఎదురుపడలేదు. పోస్టింగ్‌ బెంగళూరులో అన్నారు. ప్రేమ బెంగ మొదలైంది. అయినా తప్పదుగా! వెళ్లి రిపోర్ట్‌ చేశా. బాస్‌ స్టాఫ్‌కి పరిచయం చేస్తుండగా ‘గుడ్‌ మార్నింగ్‌ సర్‌’ అందో అమ్మాయి కోకిల స్వరంతో. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సంప్రదాయంగా చీరకట్టులో వచ్చింది. తననే నోరెళ్లబెట్టి చూస్తుంటే ‘షీ ఈజ్‌ సరిత. యువర్‌ టీం లీడర్‌’ వివరాలందించారు బాస్‌. తను తెలుగమ్మాయని తెలియగానే నేను వెతుకుతున్న ప్రపంచం కళ్లముందుకు వచ్చినట్టు అనిపించింది.

తనకోసమే అందరికన్నా ముందే ఆఫీసులో వాలిపోయేవాణ్ని. తెలుగు మా సాన్నిహిత్యానికి పాస్‌పోర్ట్‌లా పనిచేసింది. టీ బ్రేక్‌, లంచ్‌.. ఎక్కడికైనా కలిసే వెళ్లేవాళ్లం. ‘రాజ్‌.. నువ్వొచ్చాక.. ఎంత హాయిగా ఉందో తెలుసా? సొంతింట్లో ఉన్నట్టుంది’ అనేది. నేను హ్యాపీ. కొన్నాళ్లకి తెలిసింది తను నాకన్న పెద్దని. డిసప్పాయింట్‌ అయినా ‘అంజలి సచిన్‌ కన్నా పెద్దది కాదా? కోహ్లీ అనుష్కకన్నా చిన్నే కదా’ అని సర్దిచెప్పుకున్నా.

రోజులు క్షణాల్లా గడుస్తున్నాయ్‌. ఇంకా నాన్చడం నావల్ల కాలేదు. ‘ఇద్దరికీ మంచి ఉద్యోగాలున్నాయి. నాకు నీపై పీకల్దాకా ప్రేమ ఉంది. మనం పెళ్లాడితే తప్పేంటట?’ ఓరోజు అడిగేశా. బదులివ్వలేదు. ఫోన్‌ చేసినా స్పందించలేదు. టెన్షన్‌లో ఉండగా ‘ఐ లవ్యూ రాజ్‌’ అంటూ మెసేజ్‌ చేసింది. పాదాలు గాల్లో.. మనసు వూహల్లో తేలింది. ఆపై అన్నీ హ్యాపీడేసే. సినిమాలు, షాపింగ్‌, వీకెండ్‌ టూర్లు.. రెండేళ్లు ఏ అవకాశాన్నీ వదల్లేదు మేం.

పక్కవీధికెళ్లినా నాతో చెప్పి వెళ్లే తను ఈసారి చెప్పకుండానే వూరెళ్లింది. ఫోన్‌ చేయదు.. చేస్తే తీయదు. నరకం అనుభవించా. మూడోరోజు తనే చేసింది. నేను ఆతృతగా అడిగిన ఏ ప్రశ్నకూ బదులివ్వలేదు. ‘నాకు పెళ్లి కుదిరింది. తను అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇక నన్ను మర్చిపో’ ఒకేమాట చెప్పి పెట్టేసింది. ఏం విన్నానో కాసేపటిదాకా అర్థం కాలేదు. అర్థమయ్యేలోపే కన్నీళ్లతో నా చొక్కా తడిచింది. పదేళ్ల కల నిట్టనిలువునా కూలిపోయింది.

ఆమె మాట నాలో ఎన్నో ప్రశ్నలు మిగిల్చింది. చెప్పలేనంత వేదన రగిల్చింది. వేరే పెళ్లి ఆలోచన ఉన్న తను నన్నెందుకు ప్రేమించింది? ఇంట్లోవాళ్లు ఒప్పుకోని పరిస్థితే ఉంటే నాతో ఒక్కమాటైనా చెప్పలేదేంటి? ఇది నమ్మించి మోసం చేయడం కాదా? ఈ ప్రశ్నలకు జవాబివ్వడానికి తనిక్కడ లేదు. నేనొక్కడినే ఒంటరిగా మిగిలా. ఆఫీసులో కుర్చీ, క్యాంటీన్‌, క్యాబిన్‌.. ఏది చూసినా తనే గుర్తొచ్చేది. ఆమెతో గడిపిన జ్ఞాపకాలు ముళ్లులా గుచ్చేవి. ఆ బాధ అనుభవించడం నావల్ల కాలేదు. బాస్‌ని బతిమాలి హైదరాబాద్‌ వచ్చేశా. ఇప్పుడు తను నాకు ఒక తీపి గతం. చేదు భవిష్యత్తు. ప్రశ్నార్థకంలా మిగిలిన జీవితం.

- రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని