అమ్మానాన్నా... ఆశీర్వదించరూ!!

చిన్ననాటి నేస్తం లావణ్య పెళ్లి. చలువ పందిళ్లు, మామిడి తోరణాలు, సన్నాయిమేళాలతో సందడిగా ఉంది. కాసేపట్లో ముహూర్తం. ఇంతలో పెళ్లిపందిట్లో...

Published : 26 Nov 2016 01:06 IST

అమ్మానాన్నా... ఆశీర్వదించరూ!!

చిన్ననాటి నేస్తం లావణ్య పెళ్లి. చలువ పందిళ్లు, మామిడి తోరణాలు, సన్నాయిమేళాలతో సందడిగా ఉంది. కాసేపట్లో ముహూర్తం. ఇంతలో పెళ్లిపందిట్లో కలకలం. మొత్తం కట్నం ఇవ్వలేదని వరుడి తండ్రి గొడవ పడుతున్నాడు. ‘సమయానికి డబ్బులు అందలేదు. వారంలో సర్దుబాటు చేస్తా’ అని నా ఫ్రెండ్‌ నాన్న మొత్తుకున్నా వినట్లే. సినిమా సీన్‌ గుర్తొచ్చింది. అప్పుడొచ్చాడొకతను. ‘సరేనండీ.. ఇప్పుడే పోలీసులకు ఫోన్‌ చేస్తా. వాళ్లొచ్చి మీరు అడిగినంతా ఇస్తారు’ అన్నాడు. ‘ఏంటి బెదిరిస్తున్నావా?’ అవతలి మనిషి గద్దింపు. ‘నిజమే. పెళ్లికి ముందే ఇలా రచ్చ చేస్తున్నారు. పెళ్లయ్యాక మా అమ్మాయి పరిస్థితేంటి? ఇప్పుడే ఏదో ఒకటి తేల్చేసుకుందాం’ ఆవేశంగా వాదిస్తున్నాడు. క్షణాల్లో పెద్దలంతా పోగయ్యారు. వాదోపవాదాలు, చర్చలయ్యాక పెళ్లి తంతు మొదలైంది.

తను లావణ్యకు మేనమామ వరుస. మేముండే సిటీలోనే ఉద్యోగం చేస్తున్నాడట. అతడి ధైర్యాన్ని మెచ్చుకుందామని ఫోన్‌ కలిపా. ‘అంతమంది పెద్దవాళ్లున్నా భలే మాట్లాడారు. హ్యాట్సాఫ్‌’ అన్నా. ‘వయసుదేముంది? మంచిపనికి ఎవరో ఒకరు అడుగు ముందుకేయాలిగా’ అన్నాడు. సమాజం.. అవినీతి.. నిరుద్యోగం.. రాజకీయాలపై పదినిమిషాలు ఆపకుండా లెక్చరిచ్చాడు. రవి మాటలు భలే నచ్చేవి. అవి వినడానికైనా అప్పుడప్పుడు పలకరించేదాన్ని. ‘గురజాడలా.. ఎప్పుడూ సమాజం గురించే చెబుతావ్‌. ఇంతకీ నువ్వు కట్నం లేకుండా పెళ్లి చేసుకోగలవా?’ సరదాగా అడిగానోసారి. ‘తప్పకుండా. ఒప్పుకుంటే నిన్నే చేసుకుంటా’ అన్నాడు. గుండెలదిరాయి. ‘సీరియస్‌గానే చెబుతున్నా. మన పరిచయం అయిన దగ్గర్నుంచీ నిన్ను గమనిస్తున్నా. నీదీ నాలాంటి మనస్తత్వమే. అందుకే నువ్వంటే నాకిష్టం. ఆలోచించు’ అన్నాడు మరోసారి.

నాన్నది గుమాస్తా ఉద్యోగం. తాహతుకు మించి నన్ను, చెల్లిని చదివించారు. నేనింకా ఉద్యోగప్రయత్నాల్లోనే ఉన్నా. ఈ పరిస్థితుల్లో రవి ప్రపోజల్‌కి ఒప్పుకుంటే నాన్నకు పెద్ద భారం దిగినట్టే. కానీ ఫోన్లో అభిప్రాయాలు పంచుకోవడం తప్ప మేం ఎప్పుడూ కలుసుకోలేదు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు. అదే అడిగా. ‘పెళ్లిచూపుల పేరుతో పదినిమిషాలు మాట్లాడుకొని ముక్కూమొహం తెలియని అమ్మాయి, అబ్బాయి ఒక్కటవడం లేదా?’ ప్రశ్నించాడు. నా దగ్గర సమాధానం లేదు. కన్నవాళ్లదే తుది నిర్ణయమన్నా.

వారం తిరక్కముందే మా ఇంటికొచ్చాడు. ‘మీ అమ్మాయంటే నాకిష్టం. తనకీ నేనన్నా ఇష్టమే. పైసా కట్నమొద్దు. మాకు పెళ్లి చేయండి’ నాన్నతో సూటిగా చెప్పేశాడు. నాన్న రవిని నానా మాటలన్నారు. ‘ఒకబ్బాయిని ప్రేమించి, పెళ్లి నిర్ణయం కూడా తీసుకునేంత పెద్దదానివయ్యావా?’ అంటూ నన్నూ తిట్టారు. రవి ఎన్నిసార్లు ప్రయత్నించినా మావాళ్లు ఒప్పుకోలేదు. పైగా చాలా అవమానించారు. ఆఖరికి నేనే ఓ నిర్ణయానికొచ్చా. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అన్నా రవితో. నా బలవంతంతో సరేనన్నాడు. మేం అడుగు బయటపెట్టాం. స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నాం. పెద్దకూతురు చనిపోయిందనుకున్నారు కన్నవాళ్లు. కంటికిరెప్పలా చూసుకుంటూ నాకు ఆ బాధ తెలియకుండా చూశాడు రవి.

కొన్నాళ్లకు చెల్లి ఉద్యోగం కోసం సిటీకొచ్చిందని తెలిసింది. నన్ను, చెల్లిని ఒప్పించి రవి తనను మా ఇంటికి తీసుకొచ్చాడు. ఓ బ్యాంకింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించాడు. అవసరమైనప్పుడల్లా డబ్బులిచ్చాడు. అన్నీ అమ్మానాన్నలకు తెలియకుండానే. ఏడాది తిరక్కముందే చెల్లి క్లర్క్‌ ఉద్యోగానికి ఎంపికైంది. మాకు చెప్పలేనంత సంతోషం. ‘అక్కాబావలు లేకుంటే నాకీ ఉద్యోగం వచ్చేదే కాదు’ అందట నాన్నతో. తర్వాత అన్ని విషయాలూ చెప్పేసింది. ముందు కోప్పడ్డా నాన్నలోనూ మార్పు మొదలైందని చెప్పింది.

ఈసారి వూరెళ్లొచ్చిన చెల్లి మాకో తీపికబురు చెప్పింది. నా పేరు వింటేనే మండిపడే నాన్న నా పెద్దకూతురు గుర్తొస్తుందని ఎవరితోనో చెప్పారట. ‘మా అల్లుడు బంగారం’ అంటూ రవినీ మెచ్చుకున్నారట. అప్పట్నుంచి నా కాలు నిలవడం లేదు. మూడేళ్ల నా ఎదురుచూపులు ఫలించినట్టే అనిపిస్తోంది. ఎంతైనా ఆరోజు కన్నవాళ్లని కాదని రవితో వెళ్లిపోవడం నా తప్పే. అమ్మానాన్నలను క్షోభపెట్టిన నేను వారి కాళ్లను నా కన్నీళ్లతో కడిగి నాన్న గుండెల్లో ఒదిగిపోవాలనిపిస్తోంది. ఆరోజు కోసం ఎదురుచూస్తున్నా.

- స్వాతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని