ప్రేమ శక్తినిచ్చింది... బ్రేకప్‌ని భరించమంది!

పదోతరగతి పరీక్ష. మనసులో ఒకటే టెన్షన్‌. పరీక్ష ఎలా రాస్తానో అని కాదు. హాలులో ఒకమ్మాయి తదేకంగా నన్నే చూస్తుండటంతో.

Published : 03 Dec 2016 02:05 IST

ప్రేమ శక్తినిచ్చింది... బ్రేకప్‌ని భరించమంది!

దోతరగతి పరీక్ష. మనసులో ఒకటే టెన్షన్‌. పరీక్ష ఎలా రాస్తానో అని కాదు. హాలులో ఒకమ్మాయి తదేకంగా నన్నే చూస్తుండటంతో. నేనూ కళ్లప్పగించా. కాసేపయ్యాక మా చూపులు మాటలయ్యాయి. ‘నీ నెంబర్‌ ఇస్తావా?’ అంది చివరి పరీక్ష రోజున. నేను హ్యాపీ. ఫోన్లు మొదలయ్యాయి. తనను ముద్దుగా ‘చిన్నీ’ అనేవాణ్ని. ‘నువ్వెంతా? నీ వయసెంత? మా అమ్మాయికే ఫోన్‌ చేసి కబుర్లు చెబుతావా? ఇంకోసారిలా చేస్తే జైళ్లొ ఉంటావ్‌’ చిన్ని మేనమామ బెదిరించాడు. గుండెలదిరాయి. తనని మర్చిపోవాలనుకున్నా. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె నా వూహల్లోంచి కనుమరుగవసాగింది.

ఇంటర్లో చేరా. ఆశ్చర్యంగా చిన్ని అదే కాలేజీలో కనిపించింది. మళ్లీ మాటలు షురూ. ఆపై జంటపక్షుల్లా విహరించేవాళ్లం. మా సంగతి వాళ్లింట్లో తెలిసేసరికి ఇంటర్‌ పూర్తైంది. మమ్మల్ని విడదీయాలని తనని హైదరాబాద్‌ కాలేజీలో చేర్పించారు. అయితేనేం... చిన్ని అక్కడికెళ్లగానే మొదటి ఫోన్‌ నాకే చేసింది. దూరమైనా మామధ్య ప్రేమ తగ్గలేదు. మేం టచ్‌లో ఉన్న సంగతి మళ్లీ తెలిసిపోయింది. తనని చదువు మాన్పించేస్తాం అని బెదిరించారు. నావల్ల తన జీవితం పాడవ్వొద్దని ‘ఇకపై మీ అమ్మాయికి ఫోన్‌ చేయను, కలవన’ని మాటిచ్చా. ‘నావల్ల కావడం లేదురా. నీ దగ్గరికొచ్చేస్తున్నా’ రెండోరోజే చిన్నీ గోల. హ్యాపీనే.. కానీ మనసులో భయం. నాది చిన్న ఉద్యోగం. తనని కలవడానికెళ్తేనే అప్పులు చేయడం... తీర్చడానికి కూలి పనులు చేసే పరిస్థితి. అలాంటిది తను నా దగ్గరికొస్తే ఎలా? ‘ముందు బాగా చదువుకో. ఈలోపు నేను మంచి ఉద్యోగం సంపాదిస్తా. తర్వాత మనల్ని ఆపేవాళ్లుండరు’ నచ్చజెప్పా. అప్పట్నుంచి ప్రతిక్షణం మా జీవితం గురించే ఆలోచించా. ఓ ఫ్రెండ్‌ సలహాతో మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌గా చేరా. రోజూ వందలకిలోమీటర్లు ప్రయాణం... అర్ధరాత్రుళ్లదాకా పని. ఎంత కష్టమైనా తనకోసం భరించా. రెండేళ్లలో ఓ స్థాయికి చేరుకున్నా. ఇంత బిజీలోనూ వీలైనపుడు ఫోన్‌... వీకెండ్‌లో కలుసుకోవడం కొనసాగేవి.

చదువైపోగానే చిన్నికి ఉద్యోగమొచ్చింది. మా ఆనందాలకిక అడ్డేముంది? పెద్దల్ని ఒప్పిస్తామనే ధీమాతో అన్ని హద్దులు దాటాం. ఇదిలా కొనసాగుతుండగానే ‘మా బావతో నా పెళ్లి చేస్తాం అంటున్నారు. తను కూడా నాకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏం జరుగుతుందో ఏమో?’ పిడుగులాంటి వార్త చెప్పిందోరోజు. నా మనసేదో కీడు శంకించింది. మీ పేరెంట్స్‌తోనే డైరెక్టుగా పెళ్లి విషయం మాట్లాడతానన్నా. రేపు, మాపంటూ వాయిదా వేయించేది. ఓపిక నశించి మీ ఇంటికే వస్తున్నానన్నా. ‘రావద్దు... నువ్వు మా ఫ్యామిలీకి సరిపోవు. మన ప్రేమకు ఇంతటితో ముగింపునిద్దాం’ అంది. కలలో కూడా వూహించని మాట. మనసు మూగగా రోదిస్తుంటే ‘ఇందులో ఎవరి బలవంతం లేదు. నేనే ఆలోచించి ఈ మాట చెబుతున్నా. మనిద్దరికి సెట్‌ కాదు’ అంటూ మరో వాగ్బాణం నా గుండెలో దించింది.

నువ్వే ప్రాణమంది. జీవితాంతం కలిసి ఉందామని బాసలు చేసింది. చివరికి ఒక్కమాటతో ఎనిమిదేళ్ల ప్రేమని నిట్టనిలువునా కూల్చేసింది. ఒక్కసారిగా ఇంత మార్పెలా? పైగా మన తిరుగుళ్ల సంగతేంటి... మన ప్రేమ విషయం మీ ఆయనకు తెలిస్తే ఎలా? అనడిగితే ఏమందో తెలుసా? ‘తనకి అన్నీ చెప్పేశాను. నన్నర్థం చేసుకొనే నా చేయి అందుకోబోతున్నాడు’ అంది. ఇంత ఘోరమా? తను నా సొంతం కాదనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేపోతున్నాను. ప్రతిక్షణం పాత జ్ఞాపకాలతో కుమిలిపోతుంటే ‘నీకేంట్రా మగాడివి. తనకు లేని బాధ నీకెందుకు? మర్చిపో’ అంటున్నారు ఫ్రెండ్స్‌. ఔను.. నేను మగాడినే.. కానీ మనసున్నవాడిని. అందుకే నాకీ టార్చర్‌. ఏదేమైనా తను నన్ను కాదనుకుంది. కష్టాల సుడిగుండంలోకి తోసేసింది. అయినా భరిస్తా. తనవల్లే కష్టాలను భరించే శక్తి సంపాదించా. ఇప్పుడూ భరిస్తూనే ఉంటా. ఎందుకంటే నేను నిజమైన ప్రేమికుడిని. మోసగాణ్ని కాదు. హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ చిన్నీ.

- ఓ అభాగ్యుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని