ప్రేమాటలో గెలిచి ఓడాను

‘నేను అందంగా ఉంటా. పద్ధతైన అమ్మాయిని’... ఈ మాట గొప్పకోసం చెప్పుకోవడం లేదు. చాలామంది నాతో చెప్పిందే.

Published : 10 Dec 2016 01:26 IST

ప్రేమాటలో గెలిచి ఓడాను

‘నేను అందంగా ఉంటా. పద్ధతైన అమ్మాయిని’... ఈ మాట గొప్పకోసం చెప్పుకోవడం లేదు. చాలామంది నాతో చెప్పిందే. ఆ పేరు కాపాడుకోవడానికి ప్రేమనే త్యాగం చేసి ఇప్పుడు వగస్తున్నా.

రోజులో ఒక్క పూటైనా పస్తులుండేంత పేదరికం మాది. అయినా పరువుకు ప్రాణమిచ్చే కుటుంబం. బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి మా కష్టాల్ని గట్టెక్కించాలనుకునేదాన్ని. ఆర్థిక ఇబ్బందులు ఆ కలను చిదిమేశాయి. మంచి ఉద్యోగం, మనసున్న అబ్బాయి పెళ్లాడితే బావుణ్ను అనే ఆశ మొదలైంది. దేవుడు నా మొర ఆలకించాడు.

ఓసారి ఫ్రెండ్‌ని కలవడానికెళ్లా. వాళ్ల అన్నయ్య ఎదురుపడ్డాడు. నేవీలో ఉద్యోగమట. ‘మా చెల్లితో ఏం పని?’, ‘ఏమైనా చెప్పమంటావా?’ అనడిగాడు. వచ్చిన పని చెప్పా. మర్నాటి నుంచే నా వెంటపడటం గమనించా. పట్టించుకోలేదు. ఇంకోసారలా చేయొద్దని వార్నింగ్‌ ఇచ్చా. విన్లేదు. తన తీరు ఇబ్బందిగానే ఉన్నా లోలోపల గమ్మత్తుగా ఉండేది. నేనూ మెల్లిగా మాట కలిపా. కొన్నాళ్లకు ముంబయిలో ఉన్న బంధువులింటికి వెళ్లాల్సి వచ్చింది. చెప్పగానే తల్లడిల్లిపోయాడు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్‌?’, ‘నిన్ను చూడకుండా నేనుండగలనా?’ అంటుంటే నాపై ఇంత అభిమానం పెంచుకున్నాడా? అనిపించింది. రైలెక్కేముందు స్టేషనుకొచ్చాడు. రైలు కనుమరుగయ్యేంతవరకూ నన్నే చూస్తుండిపోయాడు. అక్కడికెళ్లాక రోజూ తనే గుర్తొచ్చేవాడు. అతడి మాటలు, నాకు దగ్గరయ్యేందుకు చేసే ప్రయత్నాలే గుర్తొచ్చేవి. కొన్నాళ్లకు ఓ లెటర్‌ వచ్చింది. నాతో మాట్లాడాలని ఎంతగా తపించిపోతోందీ... నా అడ్రెస్‌ కనుక్కోవడానికి తనెంత కష్టపడిందీ రాశాడు. కళ్లు చెమర్చాయి. వూరి నుంచి వస్తూనే అతడి గుండెలపై వాలిపోయా. ‘మనం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుందాం’ అన్నాడు. నన్ను మొదటిసారి చూసినరోజు దగ్గర్నుంచి ఎంత ప్రేమ పెంచుకున్నాడో చెప్పాడు. నాలోని మంచీచెడూ విడమర్చి వివరించాడు. పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టాలో చెప్పాడు. ‘మీ నుంచి పైసా కట్నం ఆశించను. అవసరమైతే నేనే ఎదురు కట్నమిచ్చి నిన్ను నాదాన్నిగా చేసుకుంటా’ అంటుంటే ఒళ్లంతా గర్వంతో పులకించింది. దుర్భర పేదరికంలో ఉన్న అమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలి?

మా పెళ్లికి వాళ్లింట్లో ఓకే. మా అమ్మానాన్నలకి చెప్పే ధైర్యం లేక తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నా. ఈలోపే జరిగిందో అనర్థం. ఓరోజు బయటికెళ్లి వచ్చిన అమ్మ బాధగా నాతో ఓ విషయం చెప్పింది. ‘చిన్నప్పుడు నీతో కలిసి చదువుకున్న గీత ఒకబ్బాయితో వెళ్లిపోయిందే’ అని. గీత ప్రేమ సంగతి నాకు తెలుసు. అది చెప్పకుండా ‘పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకుంటే ఇంతదూరం వచ్చేదే కాదుగా’ అన్నా ఏమీ ఎరగనట్టే. ఆ విషయాన్నే పొడిగించి మా ప్రేమ సంగతి చెప్పాలని నా ప్లాన్‌. ‘నోర్ముయ్‌... కన్నవాళ్ల గురించి ఆలోచించని కూతురు ఓ మనిషేనా? నువ్వేగనక ఇలాంటి పనిచేస్తే మేం ఉరేసుకొని చచ్చేవాళ్లమే’ అంది కోపంగా. అమ్మానాన్నలది అన్నంతపనీ చేయగల కఠిన మనస్తత్వం. చెప్పకనే వారి నిర్ణయం చెప్పేశారు. నాకిక ఏ దారీ కనిపించలేదు. రకరకాలుగా ఆలోచించా. వాళ్లని ఒప్పించలేను. నన్నిష్టపడ్డవాడు కట్నం వద్దన్నా అతడి తల్లిదండ్రులకు నాపై కోపం ఉంటుందనిపించింది. ఇందర్ని బాధ పెట్టడం... ఇలాంటి పరిస్థితుల్ని ఎదిరించడం నావల్ల కాదనిపించింది. మర్నాడే తనని కలిసి మన పెళ్లి జరగదని చెప్పేశా. ఈ మాట చెబుతుంటే ప్రాణం విలవిల్లాడింది. తనూ క్షోభకు గురవుతాడని తెలుసు. అయినా నాకు వేరే దారి కనిపించలేదు. ప్రేమించడానికి రెండు మనసులు చాలు... పెళ్లికి రెండు కుటుంబాల ఆమోదం కావాలని అనుభవపూర్వకంగా అర్థమైంది. నేను తీసుకున్న నిర్ణయం నన్ను జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది.

- సౌమ్య (పేర్లు మార్చాం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని