ఆ రాక్షసుడి నుంచి అలా తప్పించుకున్నాం

మంగినపూడి సాగరతీరం... సాయంత్రం వేళ. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు ఒడ్డుకు చేరుతూ మా పాదాలను తాకుతూ కవ్విస్తున్నాయి. అస్తమించే సూర్యుడు ఇక సెలవంటూ ముఖం చాటేస్తున్నాడు. కారుచీకటి కమ్ముకొస్తోంది. సరిగ్గా ఇదే దృశ్యం పన్నెండేళ్ల కిందట జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాలు గుర్తు చేసుకుంటే మా వెన్నులో వణుకొస్తోంది.

Published : 25 Dec 2016 16:27 IST

ఆ రాక్షసుడి నుంచి అలా తప్పించుకున్నాం

మంగినపూడి సాగరతీరం... సాయంత్రం వేళ. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు ఒడ్డుకు చేరుతూ మా పాదాలను తాకుతూ కవ్విస్తున్నాయి. అస్తమించే సూర్యుడు ఇక సెలవంటూ ముఖం చాటేస్తున్నాడు. కారుచీకటి కమ్ముకొస్తోంది. సరిగ్గా ఇదే దృశ్యం పన్నెండేళ్ల కిందట జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాలు గుర్తు చేసుకుంటే మా వెన్నులో వణుకొస్తోంది.

అప్పుడప్పుడే కాలేజీకి గుడ్‌బై చెప్పిన రోజులవి. ‘చదువైపోయిందిగా... ఏదైనా ఉద్యోగం చూసుకోరా’ అందరి ఇళ్లలో ఇదే పోరు. మేం పట్టించుకుంటేగా! పొద్దంతా క్రికెట్‌ ఆడి.. రాత్రి పార్టీ చేసుకొని.. ఏదో సినిమాకి చెక్కేద్దాం అనుకునేవాళ్లం.

డిసెంబరు 25, 2004. వూరంతా క్రిస్మస్‌ సంబరాల్లో ఉంది. అదేరోజు మా అభిమాన హీరో సినిమా విడుదలైంది. మొదటిరోజే సినిమా చూడకపోవడం మాకు పరువు సమస్య. ఎవరెవరినో బతిమాలాం. మొత్తానికి మా ప్రయత్నం ఫలించింది. సెకండ్‌షో... విజయవాడ నవరంగ్‌ థియేటర్‌లో. సినిమా చూసి ఎముకలు కొరికే చలిలో బైక్‌లు, కార్లతో రోడ్డు మీద విన్యాసాలు చేసి ఓ ఫ్రెండ్‌ ఇంటికి చేరాం.

డిసెంబరు 26. అందరి ఇళ్లలో ఆగకుండా ల్యాండ్‌లైన్‌ ఫోన్లు మోగుతున్నాయి. ‘మీ అబ్బాయి ఎలా ఉన్నాడు?’, ‘ఏం కాలేదు కదా?’ వాకబులు. ఫోన్‌ పెట్టేస్తూ అమ్మానాన్నలు గాబరా పడుతున్నారు. అంతా అయోమయం. 26 తెల్లవారుజామున ఓ రాక్షసుడు ప్రకృతి రూపంలో విలయతాండవం చేశాడట. 30 మంది ప్రాణాల్ని బలిగొన్నాడని వార్త. ఈ విషయం మాకు తెలియదు. ఇప్పుడున్నట్టు అప్పట్లో 24 గంటల న్యూస్‌ ఛానెళ్లు పెద్దగా లేవాయే! రాత్రి ఓ స్నేహితుడి ఇంట్లో కునుకు తీసి ఉదయం ఇళ్లు చేరుకుంటే మా అమ్మానాన్నలు మమ్మల్ని గుండెలకు హత్తుకున్నారు. ఏదైనా పనిచేయమంటూ నిత్యం బూతులు తిట్టేవాళ్లు ‘నువ్వు మాకు దక్కావు చాలురా’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అందరి ఇళ్లలో ఇదే సీన్‌.

నిజానికి ఆరోజు మేం వెళ్లాల్సింది సెకండ్‌ షోకి కాదు ఫస్ట్‌ షోకి. ఫస్ట్‌ షో సినిమా చూసి కాసేపు పడుకొని లేచి మంగినపూడి బీచ్‌కెళ్లి సన్‌రైజ్‌ బాత్‌ చేయాలనేది మా ప్లాన్‌. పౌర్ణమి కదా... పుణ్యం కలిసొస్తుందనే ఆశ. సెకండ్‌ షో టికెట్లు మాత్రమే ఉన్నాయని తెలియడంతో మా ప్లాన్‌ మారింది. బోలెడు సమయం, అందుబాటులో కారు ఉండటంతో ముందే మంగినపూడి బీచ్‌కి వెళ్లాం. అలుపెరుగకుండా ఆటలాడాం. సూర్యుడు వీడ్కోలు తీసుకుంటుంటే కదల్లేక కదల్లేక అక్కణ్నుంచి కదిలాం. రెండున్నర గంటల్లో థియేటర్‌ చేరి కేరింతల మధ్య మా అభిమాన హీరో సినిమా చూశాం.

సీన్‌ కట్‌ చేస్తే... 26 ఉదయం ఆ రాక్షసుడు జనంపై నిర్దయగా విరుచుకుపడ్డాడని తెలిసింది. ఫస్ట్‌ షో టికెట్లు దొరికి ఉంటే ఆచూకీ లేకుండా పోయిన వాళ్లలో మేమూ ఉండేవాళ్లం. 26 ఉదయం సముద్ర స్నానానికి వెళ్తాం అని ఇళ్లలో చెప్పేశాం. సినిమా టికెట్లు దొరకకపోవడంతో మా ప్లాన్‌ మారింది. అదే మా ప్రాణాలు దక్కడానికి, మా ఇళ్లల్లో అందరూ ఆందోళన పడి, ఆనక మమ్మల్ని హత్తుకోడానికి కారణం. ఇంతకీ ఆ రాక్షసుడి పేరేంటో తెలుసా? సునామీ! ఆ రోజు మేం గడిపిన క్షణాలు, తదనంతర విలయం గుర్తొస్తే ఇప్పటికీ ఒంట్లో జలదరింపే.

- శివకుమార్‌, సుమంత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని