మరదళ్లతో ఆడిన మనసాట!

‘హాయ్‌ బావా... ఎలా ఉన్నావ్‌... బాగా చదువుతున్నావా?’ ఎన్నడూ చేయని మరదలు అఖిల (పేరు మార్చాం) ఫోన్‌. ఆ షాక్‌ నుంచి తేరుకొని ‘ఫైన్‌...

Published : 14 Jan 2017 01:11 IST

మరదళ్లతో ఆడిన మనసాట!

‘హాయ్‌ బావా... ఎలా ఉన్నావ్‌... బాగా చదువుతున్నావా?’ ఎన్నడూ చేయని మరదలు అఖిల (పేరు మార్చాం) ఫోన్‌. ఆ షాక్‌ నుంచి తేరుకొని ‘ఫైన్‌... ఇంట్లో అంతా కులాసాయేనా?’ మాట కలిపా. నాలుగైదుసార్లు రెండువైపులా మా ఫోన్లు ముచ్చట్లాడాక ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అందోరోజు సడెన్‌గా. వేరొకరైతే ఎగిరి గెంతేసేవారే. కానీ నేను రాణితో పీకల్లోతు ప్రేమలో ఉన్నా. తనూ వరుసకి మరదలే. అందుకే కావాలనే అఖిలని దూరం పెట్టా. తనకు విషయం అర్ధమై ఫోన్‌ చేయడం మానేసింది. అన్నట్టు నా గుండెల్నిండా రాణినే ఉన్నా ఏనాడూ నోరు తెరచి ఆ మాట చెప్పలేదు.

కొన్నాళ్లకి అఖిల పెళ్లైంది. కనీసం శుభలేఖ కూడా ఇవ్వలేదు. అంత కోపం నాపై. ఏదైతేనేం తన పెళ్లితో నా మనసుకి ప్రశాంతత. ఇక నా ప్రేమ విషయం రాణితో చెప్పేయడమే. కానీ ఎలా? ఈ వూగిసలాటలో ఉండగానే రాణే కలిసింది. ‘బావా నీకో విషయం చెబుతా. ఏమనుకోవుగా?’ అంది సంశయిస్తూ. చెప్పమన్నా. ‘నీది అందరి మంచి కోరుకునే మనస్తత్వం. నీతోనే జీవితం పంచుకోవాలనిపిస్తోంది. ఏమంటావ్‌?’ అంది. ఆకలితో ఉన్నవాడికి ఇష్టమైన బిర్యానీ పెడితే వద్దంటాడా? మూడు పార్కులు... ఆరు ఐలవ్యూలతో సాఫీగా సాగిపోతోంది మా ప్రేమ.

ఆర్నెళ్లయ్యాక అఖిల ఫోన్‌. ‘ఎలా ఉన్నావ్‌?’ అనగానే బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టింది. నాకేం అర్ధంకాలేదు. తేరుకొని తను విషయం చెప్పేసరికి నాకూ ఏడుపాగలేదు. కొద్దిరోజుల కిందటే తన భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడట. ‘నువ్వు నా ప్రేమని ఒప్పుకొని ఉంటే నాకీ ఏడుపు తప్పేదే’ అంటుంటే నా గుండె కలుక్కుమంది. ఆ వారమే తనని పరామర్శించడానికి అమ్మానాన్నలతో వెళ్లా. మమ్మల్ని చూడగానే అత్తయ్య సహా అంతా ఏడ్చారు. కాసేపయ్యాక దూరపు బంధువొకాయన వచ్చి ‘పాపం చిన్నవయసులో దానికి ఎంత కష్టమొచ్చింది? నువ్వు వరసైనోడివే కదా. పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నిలబెట్టరా’ అన్నాడు. ఆయనపై పీకల్దాకా కోపమొచ్చింది. ‘ఇలాంటి టైంలో మాట్లాడాల్సిన మాటలా ఇవి. తర్వాత చూద్దాంలే’ అంటూ అక్కణ్నుంచి కదిలా.

ఎలా మొదలైందో తెలీదుగానీ నేను అఖిలకి దగ్గరవుతున్నాననే ప్రచారం బయల్దేరింది. అది నా ప్రేమను కాల్చేయకముందే సర్దుకోవాలని విషయమంతా రాణికి చెప్పేశా. అంతా విని ఓ నిట్టూర్పు విడుస్తూ ‘పాపం కదా... పోనీలే తనకోసం మన ప్రేమ త్యాగం చేద్దామా?’ అంది రాణి. కోపంతో తనకి ఫుల్‌ కోటింగ్‌ ఇచ్చేశా. అయినా నన్ను ఒప్పించే ప్రయత్నం మానదే! ఏం చేయాలో తెలియక అమ్మానాన్నలకి చెప్పా. ఇంతకుముందే వాళ్లు మా పెళ్లికి ఒప్పుకున్నారు. పైగా రాణంటే వాళ్లకి చాలా ఇష్టం. ‘నీకు నచ్చింది చెయ్‌రా. కానీ మనసులో ఒకర్ని పెట్టుకొని ఇంకొకర్ని ఎలా పెళ్లాడతావ్‌?’ సందేహంలోనే సమాధానం చెప్పారు.

అఖిల దుస్థితికి నాకూ ‘అయ్యోపాపం’ అనిపిస్తుంది. కానీ నా మనసు నిండా రాణినే ఉంటే ఏం చేయగలను? ఇది తెలుసుకోకుండా ‘అఖిలతో పెళ్లెపుడు?’ అనడిగేవారంతా. ఇంకా ఆలస్యం చేయడం భావ్యం కాదనిపించింది. నేరుగా వెళ్లి అఖిల అమ్మానాన్నల్ని కలిశా. రాణితో నా ప్రేమ విషయం చెప్పేసి వచ్చా. వాళ్లర్ధం చేసుకున్నారు. కాసేపటికే నా ఫోన్‌ మోగింది. అవతలివైపు అఖిల. నా గుండెల్లో ఒకటే దడ. ‘ఔను బావా.. నేనే అనవసరంగా నీపై ఆశలు పెంచుకున్నా. నువ్‌ రాణిని చేసుకోవడమే కరెక్ట్‌. నేనెప్పుడూ మీ మధ్యకు రాను’ అంది. హమ్మయ్య అనుకున్నా. ఆపై కొన్నాళ్లకే నాకుద్యోగం రావడం, రాణితో పెళ్లి చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మేం హ్యాపీ. అప్పుడప్పుడు అఖిల గుర్తొస్తేనే మనసు భారంగా ఉంటుంది.

- గోపీచంద్‌, వినుకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని